సేవాభారతి ఆధ్వర్యంలో చెంచులకు ఉచిత వైద్య శిబిరాలు
నల్లమల అడవులలో నివసించే గిరిజన చెంచుల ఆరోగ్య పరిరక్షణకు నంద్యాల సేవాభారతి, సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో నంద్యాలలోని ఐ.యమ్.ఏ మహిళా విభాగం వైద్యులతో ఉచిత ప్రసూతి, శిశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.గత సంవత్సరంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఈ వైద్య శిబిరాలను ఈ సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి.నల్లమల అడవుల్లోని దత్తత చెంచు గూడేలలో అందుబాటులో లేని ప్రసూతి ఇతర కీలక వైద్య సేవలు అందచేస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎర్ర మఠం, పెద్ద గుమ్మడాపురం గూడెంలోని చెంచుల కోసం వైద్య శిబిరాలను నిర్వహించారు.ఈ వైద్య శిబిరాల్లో డాక్టర్ సత్య శివ సుందరి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ మాధవి, డాక్టర్ సుష్మ మరియు డాక్టర్ కాదర్ బాద్ ఉదయ శంకర్ లు పాల్గొని 125 మంది చెంచు మహిళలు, పురుషులు మరియు పిల్లలకు పరీక్షలు నిర్వహించి, మందులు టానిక్కులను ఉచితంగా అందజేశారు.
పోషకాహారము, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఆరోగ్య సలహాలను ఇచ్చారు. నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండలం ఎర్రమఠం చెంచు గూడెంకు చెందిన భారతి అనే 6 ఏళ్ల బాలిక , ఐయమ్ ఏ మహిళా విభాగం సంఘమిత్ర సహాయంతో జూలై 31, 2023న వైద్య శిబిరాన్ని నిర్వహించినప్పుడు ఆమె హెచ్ బి స్థాయి 2 గ్రాములు గా గుర్తించి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. తగిన చికిత్స పొందిన అనంతరం ఆ బాలిక ఆరోగ్యంగా ఇంటికి చేరింది. ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉండడం సంతోషం కలిగించిందని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.