ఉచిత ఓటీటీని ప్రారంభించిన ప్రసార భారతి…

వీడియో గేమింగ్, వినోదరంగానికి భారత్ గమ్యస్థానం కావాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రసారాల సంస్థ ప్రసార భారతి సొంత ఓటీటీని తీసుకొచ్చింది. వేవ్స్ పేరుతో సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఈ ఓటీటీ వేదికగా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా అందిస్తామని తెలిపింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వేదికగా ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌‌ను ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతాలతో పాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఇ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.

వేదికను ప్రారంభించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దీనిని భారతీయ వినోదానికి ఒక మైలురాయిగా అభివర్ణించారు. ప్రాంతీయ ప్రోగ్రామింగ్‌తో కూడిన విభిన్న కంటెంట్‌కు అతను తన ప్రశంసలను వ్యక్తం చేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు భారతదేదేశపు డిజిటల్ ఇండియా విజన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్లాట్‌ఫారమ్ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. ప్రత్యేకించి భారత్‌నెట్ ద్వారా గ్రామీణ సమాజాలను అనుసంధానించే దాని సామర్థ్యాన్ని ప్రస్తావించారు.

ప్రసార భారతి ఛైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్, ‘వేవ్స్’ కుటుంబ-స్నేహపూర్వక కంటెంట్‌కు కేంద్రంగా, అందరికీ స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని అభివర్ణించారు. ఈ ప్లాట్‌ఫాం యువ క్రియేటర్‌లు, ఫిల్మ్‌మేకర్‌లకు మద్దతు ఇస్తోందని సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు

ఈ ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 12 కంటే ఎక్కువ భాషల్లో 10కిపైగా కేటగిరీల్లో విభిన్నమైన కంటెంట్ పొందవచ్చని తమ యూజర్లకు తెలిపింది ప్రసార భారతి. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఫ్రీ గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ సైతం ఉంటాయని తెలిపింది.

ఇతర స్ట్రీమింగ్ సేవలకు భిన్నంగా ఉండేలా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్ డిసి) సాయంతో ఈ వేవ్స్ ఓటీటీని రూపొందించినట్లు తెలిపింది. పెద్ద వారి కోసం అలనాటి చిత్రాలు, మదురమైన పాటలు ఇందులో ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు పిల్లల కోసం వినోద కార్యక్రమాలైన ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెలనాలీరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *