వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు… ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం
వర్షాకాల వచ్చేసింది. కానీ… అన్ని ప్రాంతాల్లో వర్షాలు తొందరగా కురవడం లేదు. దీంతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళనలో వుంటారు. మొగులేకి మొహం’’ పెట్టి దేవుడ్ని ప్రార్థిస్తుంటారు. దీంతో పాటు మరో సంప్రదాయం కూడా మన దేశంలో వుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగానే వుంది. అదే ‘‘కప్పల పెళ్లి’’. కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నది ప్రజల అచంచల విశ్వాసం. ఇంత ఆధునిక యుగంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే… ఏదో జరిపించాలని జరిపించరు. కప్పల పెళ్లి సందర్భంగా శుభలేఖలు కూడా పంచిపెడతారు. చాలా మందిని పిలుస్తారు. కప్పలను వధూవరులుగా రెడీ చేస్తారు. వైభవంగా పెళ్లి చేస్తారు. పురోహితుడు మంత్రాలు కూడా చదువుతాడు. కప్పలను పెళ్లి దుస్తులతో అలంకరించి, వాటికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా పెళ్లి చేస్తూ… వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రార్థిస్తారు.
మన భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి వర్షాలు కావల్సిందే. లేదంటే లక్షల మంది ఆకలితో వుండిపోతారు. రైతులందరూ కడు పేదరికంలోకి వెళ్లిపోతారు. ఇలాంటి కరువు కాటకాలు రాకుండా, వర్షాల కోసమే ఈ కప్పల పెళ్లి చేస్తారు. అలాగే ప్రకృతిని భగవంతుడిగా ఆరాధించే సంస్కృతి మనది. కాబట్టి ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలని, వర్షాన్ని ఆహ్వానించాలని ఈ తంతు చేస్తారు.
మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంప్రదాయం పెద్ద మొత్తంలోనే వుంది. ‘‘కప్పతల్లి ఆటలు’’ పేరుతో కప్పలకు పెళ్లిల్లు చేస్తారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తారు. అలాగే వేడి గాలులు, వేడి కూడా బాగా తగ్గాలని కూడా కప్పల పెళ్లి సందర్భంగా వేడుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలంటూ కోరుకుంటారు. ఈ సమయంలో కప్పలు బెక బెక అంటూ చప్పుళ్లు చేస్తే… దేవుడే నేరుగా తమ మొర విన్నాడని, సంతృప్తి చెందాడన్న నమ్మకం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వుంది.
ఇక ప్రధానంగా గిరిజనులు కూడా ఈ సంప్రదాయాన్ని అత్యంత నిష్ఠతో చేస్తుంటారు. గ్రామస్థులంతా తమ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేపట్టి, అందర్నీ ఆకట్టుకుంటారు. తొలుత తమ వ్యవసాయ దేవతలైన బీమ, బీమానిలకు తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లిల్ల కోసం కప్పలను గాలిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు.