భారత కీర్తిని రెట్టింపు చేసే గగన్ యాన్
మంగళ్ యాన్, చంద్రయాన్-3 విజయాలతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ ఖ్యాతి ఇనుమడిరచింది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ గగన్ యాన్‌కు సిద్ధమైంది. భారత్‌కు ఇదే తొలి మానవ సహిత రోదసి యాత్ర. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లోట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్‌లో ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(టీవీ-డీ1)ను ప్రయోగించింది.
మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేసి, ఆపై మానవ సహిత ప్రయోగాలను చేయాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ-డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్‌లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వచ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడినుంచి వ్యోమ గాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు.
ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో తెలిపింది.
ఇంతటి ప్రతిష్ఠాత్మక గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్ యాన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోదసిలోకి వెళ్లనున్నారని మోదీ తెలిపారు.
ఇవి నాలుగు పేర్లు కాదు… 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని అభివర్ణించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల కిందట రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా… మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారని… అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అని స్పష్టం చేశారు.
రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 3న రష్యా వ్యోమనౌక సోయుజ్ టి-11 ద్వారా మరో ఇద్దరు రష్యన్లతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు, మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళుతుండగా, ఆ నలుగురు వ్యోమగాములకు కూడా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో, గగన్ యాన్ భారత అంతరిక్ష రంగాన్ని సరికొత్త ఎత్తులకు చేర్చనుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ వచ్చే ఏడాది జరగనుంది.