గాంధీజీ హత్య – నెహ్రూ అధికార సమీకరణ
హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులకు అలవాటై పోయింది. జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్య జరిగింది. దీనికి కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వాతంత్య్రం సాదించు కుంది. ఆ స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందే దేశం రెండుగా విభజితమయ్యింది.
గాంధీజీ హత్య
దేశ విభజనకు మహాత్మా గాంధీయే పూర్తిగా బాధ్యులని భావించినవారిలో నాథూరాం గాడ్సే కూడా ఉన్నారు. జనవరి 30, 1948 రోజున సాయంత్రం 5.17 గం.లకు గాంధీజీ ప్రార్ధన సమావేశానికి వస్తున్నప్పుడు గాడ్సే ఆయనను సమీపించారు. గాంధీజీకి నమస్కారం చేస్తున్నట్లుగా ముందుకు వంగి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆ తరువాత స్వయంగా తానే ‘‘పోలీస్’’ అంటూ పిలిచి లొంగిపోయారు. ఆయన కోర్ట్‌లో వినిపించిన వాదన ‘మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్’ అనే పుస్తకంగా వెలువడిరది. అయితే హత్య ప్రయత్నం జరిగిన వెంటనే గాంధీజీని ఆసుపత్రికి తరలించకుండా బిర్లా హౌస్‌కు ఎందుకు తీసుకువెళ్ల రాన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకదు.
ఆర్.ఎస్.ఎస్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం
ఈ సంఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర లేదని సాక్షాత్తు సర్దార్ వల్లభాయి పటేల్ చెపుతున్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని విధిస్తున్నట్లు నెహ్రూ ప్రకటించారు. ఈ విషయం నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్త రాల్లో తెలుస్తుంది.
గాంధీజీ హత్య జరిగి నెలరోజులు కాకుండానే 27 ఫిబ్రవరి 1948న పటేల్ ఒక ఉత్తరం వ్రాసారు. గాంధీజీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందన డానికి తగిన ఆధారాలు అన్వేషించాలంటూ నెహ్రూ వ్రాసిన లేఖకు సమాధానంగా పటేల్ ఇలా వ్రాసారు ` ‘‘బాపు హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును నేను ప్రతి రోజు పర్యవేక్షిస్తూనే ఉన్నాను. ఈ కేసులో దొషులందరి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటిని బట్టి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది’’.
ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడానికి బలమైన ఎలాంటి ఆధారం లేకపోయినా నెహ్రూ ఆ పని చేయాలనుకోవడానికి గల కారణం గురుజి గోల్వాల్కర్‌లో ఆయన బలమైన రాజకీయ ప్రత్యర్ధిని చూసి ఉండవచ్చనిపిస్తుంది. నిజానికి గాంధీజీ హత్యకు సరిగ్గా ఒక రోజు ముందు, జనవరి 29న నెహ్రూ మాట్లాడుతూ ‘‘నేను ఆర్‌ఎస్‌ఎస్‌ను తొక్కివేస్తాను’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోల్వాల్కర్‌కు ఎంతో ప్రజాదరణ ఉందని 1949లో బీబీసి కూడా వ్యాఖ్యానించింది. బీబీసి రేడియో ప్రసారం చేసిన ఒక రిపోర్ట్‌లో ‘భారత ఆకాశమండలంలో ఉద్భవించిన, ఉజ్వలంగా ప్రకాశిస్తున్న తార గోల్వాల్కర్. ఆయన తరువాత అంతటి సంఖ్యలో ప్రజా వాహినిని కదిలించే వారు ప్రధాని నెహ్రూ మాత్రమే’ అంటూ పేర్కొంది. గోల్వాల్కర్ అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ చాలక్‌గా ఉన్నారు.
ఫిబ్రవరి 4,1948న ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించింది. నిషేధానికి వ్యతిరేకంగా సంఘ స్వయంసేవకుల సుదీర్ఘమైన పోరాటం తరువాత సెప్టెంబర్ 14,1949న ప్రభుత్వం బేషరతుగా నిషేధాన్ని తొలగించింది. బొంబాయి శాసన సభకు సమర్పించిన లిఖితపూర్వక ప్రకటనలో (శాసన సభ పత్రాలు పుట.2126) ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని కొనసాగించడానికి ఎలాంటి అవసరం కనిపించడం లేదని, కనుక బేషరతుగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నా మని, ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి హామీ పత్రం ఇవ్వలేదని హోమ్ మంత్రి మొరార్జీ దేశాయి పేర్కొన్నారు. ఇలా ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎలాంటి నేరారోపణ చేయడానికి ఆధారాలు లేవని స్పష్టమైనప్పటికి కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. నెహ్రూ కుమార్తె అయిన ఇందిర 1966లో విశ్రాంత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జెఎల్ కపూర్ నేతృత్వంలో మరో కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఆ కమిషన్ 100 మంది సాక్ష్యులను విచారించిన తరువాత 1969లో అంతిమ నివేదిక సమర్పించింది. కపూర్ కమిషన్ తన నివేదికలో ఇలా పేర్కొంది-‘‘మహాత్మా గాంధీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదు. ఈ ఘోరమైన నేరంలో ఆ సంస్థ పేరును ప్రస్తావించడానికి ఎవరికి వీలులేదు. దోషులు ఎవరు ఆర్ ఎస్ ఎస్ సభ్యులని ఎక్కడా నిరూపితం కాలేదు..’’
– ఆయూష్ నడిరపల్లి