ఫిబ్రవరి 5 వరకు వారణాసి గంగా హారతి నిలిపేత
ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ దృష్ట్యా కొన్ని రోజుల పాటు ఘాట్ ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 5 వరకు వారణాసిలోని దశాశ్వమేథ్ ఘాట్, శీత్ల ఘాట్, అస్సీ మొదలైన ఘాట్ లలో నిర్వహించే గంగా హారతి నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పోలీసులు కోరారు. మహా కుంభమేళాకి భారీగా ప్రజలు తరలి వస్తున్నారని, దీంతో ఘాట్ ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే ఈ చర్యలని అధికారులు తెలిపారు. మరోవైపు మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని పోలీసు కమిషనర్ ప్రకటించారు.