గోరక్షకుడు సోనూసింగ్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీం..
గోరక్షక్ సోనుసింగ్ పై ఇస్లామిక్ ఛాందసుడు ఇబ్రహీం కాల్పులు జరిపాడు. హైదరాబాద్ శివారు ప్రాంతం పోచారం ఐటీ కారిడార్ పరిధిలో బుధవారం ఈ కాల్పుల ఘటన జరిగింది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోనుసింగ్ (ప్రశాంత్) గోసంరక్షణ కార్యకర్త. పశువుల అక్రమ రవాణాను గుర్తించి, హిందూ సంఘాలకు సమాచారం చేరవేస్తుంటాడు.ఇటీవలే వరంగల్ వైపు నుంచి పశువులతో వస్తున్న లారీని ఆపేందుకు సోనుసింగ్ కారులో వెంబడించాడు.
దీంతో సోనూసింగ్ పై కక్ష పెంచుకున్నాడు ఇబ్రహీం.చర్చల కోసం శ్రీకాంత్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా కూడా ఇబ్రహీం పెట్టుకున్నాడు. కబురు పంపాడు. ప్రశాంత్ సింగ్ తన కారులో యంనంపేట్ కి చేరుకున్నాడు. చర్చలు జరుగుతుండగా ఇబ్రహీం తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ ను బయటికి తీశాడు. మూడు రౌండ్లు గాల్లోకి పేల్చి, నాలుగో రౌండ్ ను ప్రశాంత్ వైపు కాల్చాడు. ఆ తూటా ప్రశాంత్ ఛాతీ కింది భాగంలో దిగింది. కాపాడాలంటూ ప్రశాంత్ సింగ్ కేకలు వేస్తూ, పరుగులు తీశాడు. దీంతో నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు.
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు…
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై నిందితుడు ఇబ్రహీం కాల్పులు జరపడంతో వెంటనే సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితిని నిలకడగానే వుందని తెలిపారు. సోనూసింగ్ కాలేయానికి బుల్లెట్ తాకడంతో పరిస్థితి విషమంగా వుందని, అత్యవసర చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఇతర నేతలు కూడా సోనూసింగ్ ను పరామర్శించారు.
A1 ఇబ్రహీం అరెస్ట్ : సీపీ ప్రకటన
ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే చేధించామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. యమ్నంపేట్ వద్ద అక్టోబర్ 22న సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్ కార్యకర్త బిద్ల ప్రసాంత్ అలియాస్ సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. గో రక్షక్ దళ్ కార్యకర్త ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు A1 మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీని అరెస్టు చేశామని… అలాగే సహ నిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు.