పర్యావరణ హిత వివాహం… ఎద్దుల బండిలోనే వీడ్కోలు… ఇలా 10 ఆసక్తికర తీర్మానాలు
సమాజంలో అవగాహన తీసుకురావడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం ఘజియాబాద్ కి చెందిన సుర్విందర్ కిసాన్ తన వివాహాన్ని సామాజిక పండుగగా చేయాలని నిర్ణయించాడు. ఈ వివాహం కేవలం సంప్రదాయాలు, ఆచారాలకే పరిమితం కాకుండా 10 తీర్మానాలు కూడా తీసుకున్నాడు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ చొరవ ముఖ్యమైందని ఆయన తెలిపాడు.
28 సంవత్సరాల సుర్విందర్ కిసాన్ భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోహనా (సోనిపట్) నుంచి సివిల్ లో బీటెక్ చేశాడు. నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో యేడాది పాటు పనిచేశాడు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకొని, తన సొంత గ్రామంలోనే సామాజిక సేవలో నిమగ్నమయ్యాడు.
వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. గ్రామాలు, పల్లెల్లో అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాడు. రాయ్స్ పూర్ లో భగత్ సింగ్ విగ్రహాన్ని స్థాపించాడు.
1. ఎకో ఫ్రెండ్లీ వివాహం
పెళ్లి సందర్భంగా కట్నం తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. వధువు తరపున ఎలాంటి విరాళాలు, కట్నాలు, కానుకలు తీసుకోకూడదని నిర్ణయించారు. అయితే 11 వేల మొక్కలను మాత్రం బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఈ నిర్ణయం సమాజంలో కొత్త ఆలోచనలను తీసుకొచ్చింది. ఆడంబరాలు లేకుండా, అనవసర ఖర్చులు లేకుండా పర్యావరణ అనుకూల వివాహం చేసుకుంటున్నాడు.
2. ఎద్దుల బండిలో వీడ్కోలు :
ఎద్దుల బండిపైనే సంప్రదాయ పద్ధతిలో వధువుకు వీడ్కోలు పలకాని నిర్ణయించాడు. అత్యాధునిక వాహనాలు వాడొద్దని సూచించాడు. దీని ద్వారా కాలుష్యం పెరగుతుందన్నది కిసాన్ ఆలోచన. ఎద్దుల బండిని వినియోగించడం ద్వారా నూతన సంప్రదాయానికి జీవం పోశాడు.
వీటితో పాటు వధూవరులు పెళ్లి ఆహ్వాన పత్రికపై 10 తీర్మానాలను ముద్రించారు.
1. గోసేవా భాండార్ : గోవుల కోసం గోశాల నిర్వహణ
2.కుట్లు, అల్లికల పాఠశాల ఏర్పాటు… మహిళలకు కుట్లు, అల్లికల నైపుణ్యాలను బోధించే పాఠశాల ఏర్పాటు
3. మురికివాడల్లో పాఠశాలల ఏర్పాటు : మురికివాడల్లో నివసించే పిల్లలకు విద్యా బోధనకు కావల్సిన ఏర్పాట్లు చేయడం.
4.వృద్ధుల కోసం భారత్ దర్శన్ తీర్థయాత్ర : దేశంలోని పవిత్ర యాత్రా స్థలాలకు వృద్ధులను తీసుకెళ్లడం
5. రక్తదాన శిబిరం : రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు శిబిరాల ఏర్పాటు
6.సర్వధర్మ ఆశీర్వాద సభ: అన్ని మతాల వారిని ఒకచోట చేర్చి ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించడం.
7.జీరో వేస్ట్ వెడ్డింగ్ ఈవెంట్: వివాహ వ్యర్థాలను తగ్గించడం మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం.
8. గ్రామాల దత్తత పథకం : ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధి పనులు చేయడం.
9. డ్రగ్స్ మానేయడంపై క్యాంపెయిన్ : దేశంలో యువకులు డ్రగ్స్ కి బానిసలు కాకుండా, డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచార నిర్వహణ
10. వధూ వరులు 51 ఈ – లైబర్రీలను తెరవాలి. దీని ద్వారా విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
సుర్వీందర్ కిసాన్ చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ వహించేవాడు. దానికి తగ్గట్లుగా కృషి కూడా చేస్తున్నాడు. తన డబ్బుల్లోంచి కొంత భాగాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నాడు. మొక్కలు నాటుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు. కూడళ్ల వద్ద నిలబడి, మొక్కలను పంపిణీ చేస్తున్నాడు. దీంతో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. అలాంటి సమయంలో పర్యావరణ అనుకూల వివాహాన్ని చేసుకోవడం ద్వారా సామాజానికి సానుకూల సందేశాన్ని పంపుతున్నాడు. సుర్వీందర్ ఆదర్శ వివాహం సమాజాన్ని కచ్చితంగా ప్రేరేపిస్తుంది.