దానం మన కుటుంబ జీవనంలో భాగం
కుటుంబప్రబోధన్
భారతీయ కుటుంబ జీవనంలో ‘దానం’ ఓ సహజసిద్ధమైన భాగమైపోయింది. మన రాశిఫలాలు చెప్పే జ్యోతిష్యులు ఏ రాశివారు ప్రతివారం ఏఏదానాలు చేయలో చెబుతుంటారు. కుటుంబంలో ఏదైనా కష్టమొచ్చి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఫలానా కందులో, పెసలో, బియ్యమో, నువ్వులో ఏదోఒకటి దానం చేయమని, చీమలకు, పక్షులకు, పశువులకు పెట్టమని చెబుతుంటారు. మన కష్టాలకు ‘దానం’ పరిహారం అని కాదుకాని, సృష్టిలో చరాచర జీవరాశి, జంతుజాలం గురించి ఆలోచించడం దానరూపేణా మనకు పెద్దలు అలవాటు చేసిన విషయం. దానములన్నింటిలో అన్నదానం శ్రేష్టమని చెప్తారు. భోజనం తరువాత ‘అన్నదాత సుఖీభవ’ అంటుంటాం. ఆ దాత ఆ గృహస్తు కావచ్చు, రైతు కావచ్చు, భగవంతుడు కావచ్చు లేదా మన పెద్దలు కావచ్చు. పూర్వజన్మ పుణ్యఫలమే మనం ఈ రోజూ నాలుగు మెతుకులు తినేందుకు సానుకూలమవుతున్నది. ఇదో కృతజ్ఞతాసూచకం కావచ్చు. అందుకే పెద్దలు ఋణము తీర్చుకోవడానికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుంటాము. శ్రాద్ధకర్మల్లో భాగంగా ‘దశదానాలు’ చేసే పరంపర మనకున్నది. ఇందులో నువ్వులు, బెల్లం, ఆవు, బంగారం, లవణం, భూమి, వెండి, నెయ్యి, వస్త్రాలు, ధాన్యం. కేవలం శ్రాద్ధకర్మల్లోనేకాదు గృహప్రవేశాల్లో, నూతన ఉద్యోగ సమయాల్లో కూడా దానం చేయాలి. సంక్రాంతిరోజు, గ్రహణ సమయంలోనూ దానం చేయవచ్చు అని పెద్దలు చెబుతారు. ‘దీయతేదానం’ అన్నారు. ఇచ్చేది దానం. భగవద్గీతలో 17వ అధ్యాయంలో గీతాకారుడు రకరకాల దానం గురించి చెప్పాడు. నాకుంది కాబట్టి ఇస్తున్నాను అనే భావనలో చేసేది రాజస దానం. నాకుంది, నీకు లేదు కాబట్టి ఇవ్వడం, దానికి మళ్లీ ఏదో కొంత అపేక్షించడం తామస దానం. నాకున్నది అనుభవించినపుడు నేనెంత ఆనందం పొందుతున్నానో అంతే ఆనందం నేను వాటిని మరొకరికిచ్చినపుడు కూడా వారు అంతే ఆనందం పొందాలి అని భావించి ఇవ్వడం సాత్త్విక దానం అన్నారు. అపాత్ర దానం చేయవద్దన్నారు. దానం ప్రతిరోజూ చేయాలి. దానం చేయని రోజు దుర్దినం. భిక్షకుడికిచ్చేది భిక్ష దానం కాదు. భగవంతుడికిచ్చేది నివేదన, సమర్పణ. గురువుకిచ్చేది గురుదక్షిణ. మహాభారతంలో 27 నక్షత్రాల వారికి ఏఏ దానాలు చేయాలో చెప్పారు. కృత్తికా నక్షత్రం వారు నేతితో కలిపిన పాయసం, రోహిణి నక్షత్రం వారు మినుములు, మృగశిరవారు అప్పుడే ఈనిన ఆవును డూడ సహితంగా ఇవ్వాలన్నారు. ఆరుద్ర వారు పులగం. పునర్వసు వారు పిండి వంటలు, పుష్యమి వారు బంగారం, ఆశ్లేషవారు వెండి, మాఘ వారు నువ్వులు, పాల్గుణ వారు భక్ష్యాలు, హస్తవారు ఏనుగుతో కూడిన రథాలు, చిత్త వారు ఎద్దును, బంగారాన్ని, స్వాతి వారు ధనాన్ని, విశాఖ వారు అవు, ఎద్దులను, అనురాధ వారు వస్త్రాలు, కంబళి, జ్యేష్ఠవారు కర్వేపాకు, మూల వారు అన్నదానం, వృక్ష దానం, పుస్తకదానం, పూర్వషాఢవారు గోదానం, ఉద్తరాషాఢ వారు లోహదానం, విద్యా దానం, శ్రవణం వారు ముత్యాలు, ధనిష్ఠవారు ఏదో ఒకదానం, శతభిషవారు గంధం చెక్కలు, పూర్వభాద్ర వారు వెండి, బంగారు నాణాలు, పుస్తకదానం, ఉత్తరాభాద్రవారు అన్నిదానాలు చేయవచ్చని, రేవతి వారు గోదానం చేయమని చెప్పారు.
దానం మనల్ని మంచిపనులు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నక్షత్ర యోగం బాగుపడేందుకు ఈ దానాలు ఉపకరిస్తాయి. యజ్ఞం, దానం లేదా తపస్సు చేయమని శ్రీ కృష్ణుడు చెప్పాడు. జ్ఞానదానం కూడా మంచిదే. ఉత్తమ జన్మలకోసం, ఉత్తమ గతుల కోసం, మోక్షం కోసం దానం చేయమన్నారు. మనం వాడుకోవడానికి వీలుకానిదాన్ని దానం చేయకూడదు. ఏమేమి దానం చేయాలో మన పెద్దలు చెప్పిన జాబితా చూస్తే, దానం చేయడానికి ఏ వస్తు, విషయ, పరిమితులు లేవని మనకర్థమవుతున్నది. అన్నీ భగవంతుడిచ్చినవే. భగవంతుడి రూపంలో ఉన్న మన సమాజంలోని సాటి సోదరసోదరీమణులకు, సమస్త జీవరాశికి మనవైన వస్తు, ధన, సంపదను దానం చేయడమే జీవిత పరమార్థమవుతున్నది.
– హనుమత్ ప్రసాద్