స్వదేశీ మేళా వారసత్వ సంపద కు ప్రతీక : గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
స్వదేశీ జాగరణ మంచ్ మరియు స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతున్న స్వదేశీ మేళా కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు. అలాగే జె ఎన్ టి యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ… స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహిస్తున్న ఈ స్వదేశీ మేళా మన గొప్ప సాంస్కృతిక వారసత్వం, స్వదేశీ నైపుణ్యాల వేడుక మాత్రమే కాదని ఇదొక లోతైన తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. శతాబ్దాలుగా భారతదేశానికి మార్గనిర్దేశం చేసిన మన భరత భూమి పురాతన జ్ఞానంలో పాతుకుపోయిన వారసత్వ సంపద కు ప్రతీక అని, స్వదేశీ కేవలం ఆర్థిక భావన మాత్రమే కాదని, ఇది మన స్వావలంబన వ్యక్తీకరణ అని అన్నారు.
బాహ్య దేశాల పై ఆధారపడకుండా, పరిష్కారాల కోసం అంతర్గతంగా చూడాలనే ఆలోచనను ప్రోత్సహించే సూత్రమని అన్నారు. స్వదేశీ భావన మన స్వంత వనరులను గుర్తించడం వాటిని ఉపయోగించడం నేర్పుతుందని, అవి భౌతికమైనవి, మేధోపరమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి కావచ్చని అని వివరించారు. మన మూలాలు, ప్రజలతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవాలని ఇది మనలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వదేశీ జాగరణ మంచ్ మరియు స్వావలంబి భారత్ అభియాన్ నిర్వాహకులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ ఏర్పాటుచేసిన ప్రతి ఒక్కరికి వారి శుభాకాంక్షలు తెలియజేశారు.
జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా నిర్వహిస్తూ, స్వదేశీ మేళా ద్వారా స్థానిక ఉత్పత్తుల గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వదేశీ జాగరణ మంచ్ ని అభినందించారు.అనంతరం మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్వదేశీ మేళా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వదేశీ జాబ్ మేళా లో దాదాపు 16000 మందికి పైగా పాల్గొనగా ఉద్యోగం సాధించిన 3000 మందిలో కొందరికి గవర్నర్ గారు ఆఫర్ లెటర్లు అందించారు, దాదాపు 4500 మంది రెండవ రౌండ్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్వదేశీ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి మొదలుకొని రాజస్థాన్ తమిళనాడు, కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల నుండి దాదాపుగా స్వదేశీ ఉత్పత్తులతో కూడిన 350 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఈ స్టాల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక స్వదేశీ స్థానిక ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ హరీశ్ బాబు గారు, గంగోత్రి డెవలపర్స్ చైర్మన్ శ్రీ మధురాం రెడ్డి, స్వావలంబి భారత్ అభియాన్ ప్రాంత కన్వీనర్ జి రమేష్ గౌడ్, స్వదేశీ మేళా కన్వీనర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత కో కన్వీనర్లు శ్రీ సిద్దుల అశోక్ గారు, శ్రీ ఈశ్వర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.