గుంటగలగర ఆకు
– దీనిని కేశరంజన, భృంగరాజ అని సంస్కృతంలో పిలుస్తారు.
– దీనిని పితృదేవతల అర్చనల్లో వాడుతారు.
– తేమగల ప్రదేశాలలో ఉంటుంది. లంక నేలల్లో శీతాకాలంలో పెరుగుతుంది.
– ఇది మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, పసుపు, నలుపు. నలుపు దొరకటం మహా కష్టం. దీనిలో పసుపురంగు పువ్వులు పూసేది మంచి ప్రశస్తమైనది.
– దీని రుచి కారం, చేదు కలిసి ఉంటుంది.
– ఇది శరీరంలో కఫం, వాతాన్ని పోగొడుతుంది.
– దంతాలు, చర్మానికి మేలు చేస్తుంది. ఆయువుని, ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది.
– హెర్నియా, ఆయాసం, పొట్టలోని క్రిములు, ఆమరోగం అనగా రుమాటిజం, పాండు రోగం అనగా భయంకరమైన రక్తక్షీణత, గుండెజబ్బు, చర్మరోగం వంటి వ్యాధులు హరిస్తుంది.
– కొన్ని రకాల ఆకుకూరలు నేత్రాలకు చెడు చేస్తాయి అని అంటారు. కాని ఆకుకూరల్లో పొన్నగంటికూర తరువాత నేత్రాలకు మేలు చేసేది గుంటగలగర.
– ఈ ఆకులు ముద్దగా నూరి తేలు కుట్టినచోట వేస్తే విషం విరుగుతుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది.
గుంటగలగర ఉపయోగించు విధానం –
దీనిని తరచుగా కూరగా, పచ్చడిగా ఉపయో గించడం మంచిది. తియ్యకూరగా కాని, పులుసు కూరగా కాని వండుకోవచ్చు. గుంటగలగర ఆకువేయించి చేసిన పచ్చడికి కొంతవరకు గోంగూర పచ్చడి రుచి వస్తుంది. గుంటగలగర ఆకులో ఇనుము ఎక్కువుగా ఉంటుంది. దీనిని లోపలికి తరచుగా తీసుకోవడం వలన శరీరానికి ఇనుము చక్కగా అందుతుంది.
– ఉషాలావణ్య పప్పు