ధర్మరక్షణ కోసం బలిదానం
ఔరంగజేబు అకృత్యాలు, దారుణాలు మితిమీరి పోయాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో పండిట్‌లను మతంమార్చడానికి ప్రయత్నించాడు. దిక్కుతోచక వారు సిక్కు గురువు గురుతేగ్‌బహదూర్ దగ్గరకి వచ్చారు. తమ కష్టాల్ని చెప్పుకుని వీటి నుంచి బయటపడే మార్గం చెప్పమని మొరపెట్టు కున్నారు. వాళ్ళ దయనీయ పరిస్థితి చూసిన గురుతేజ్ బహదూర్ ‘ఎవరో ఒక మహాపురుషుని బలిదానంతోకానీ ఈ సమస్య పరిష్కారం కాదు’అని అన్నారు. గురుతేజ్ బహదూర్ పక్కనే ఉన్న ఆయన 9ఏళ్ళ కుమారుడు గోవిందసింహ్ ‘మిమ్మల్ని మించిన మహా పురుషుడు ఎవరున్నారు’అన్నాడు. అతని మాటలు విన్న గురుతేజ్‌బహదూర్ కాశ్మీరీ పండిట్‌లతో‘గురుతేజ్‌బహదూర్ మతంమారితే మేమంతా మతంమారతామని చెప్పండి’అన్నారు. వాళ్ళు అదే విధంగా ఔరంగజేబుకు చెప్పడంతో మొగలాయి సైన్యం గురు తేజ్‌బహదూర్‌ను బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళింది. అక్కడ మతం మారమని ఆయన్ని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారు, భయపెట్టారు. ఆయన లొంగక పోవడంతో చివరికి చిత్రహింసలు పెట్టి చంపి వేశారు. అలా ధర్మరక్షణ కోసం గురుతేజ్ బహదూర్ అపూర్వమైన బలిదానం చేశారు.