ఆ శ్రమ ఫలితమే ఈ ఫలాలు
– వడ్ల భాగయ్య
శ్రీ గురూజీ జయంతి ప్రత్యేకం (మాఘ బహుళ ఏకాదశి)
శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోళ్వల్కర్) రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలకులు. భారతదేశ ఐకమత్యం, అఖండతను సంరక్షించ టానికిబీ హిందూధర్మరక్షణకు, హిందూ సమాజ ఏకాత్మతకు, సమరసతా నిర్మాణానికి తన సంపూర్ణ జీవితాన్ని సమర్పించినవారు.
భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు, జాతీయ భావనలు వ్యతిరేకిస్తూ, స్వైర విహారం చేస్తున్న సమయములో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయులుబీ భారత జాతీయత, సంస్కృతి-పరంపరలు ఆధారంగా భారత జాతిలో నవచైతన్యాన్ని నింపి, జాతికి యోగ్యమైన దిశను చూపి, నడిపించిన వీరయోధులు శ్రీ గురూజీ.
సామాన్య కుటుంబం – అసామాన్య వ్యక్తిత్వం
శ్రీ గురూజీ మాఘ బహుళ ఏకాదశి, 1827 శక సంవత్సరం (19 ఫిబ్రవరి 1906) నాడు సదాశివరావు, లక్ష్మీబాయి దంపతులకు నాగపూరులో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవ్. శ్రీకృష్ణుడివలె మాధవ్ కూడా తమ తల్లిదండ్రులకు 8వ సంతానం. సామాన్య మధ్యతరగతి కుటుంబము అయినా తల్లిదండ్రులు ధర్మనిష్ఠాపరాయణులు. తండ్రి శ్రీ సదాశివరావు పోస్టల్ విభాగంలో పనిచేసి, తదనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. తల్లి శ్రీమతి లక్ష్మీబాయి (తాయీజీ) మమతామూర్తి.
సాధకులు శ్రీ గురూజీ
బెంగాలులోని ముర్షిదాబాద్ జిల్లాలోని సారగాచి ఆశ్రమం పూజ్య శ్రీ అఖండానంద స్వామి కేంద్రం. పూజ్య అఖండానంద మహా తపస్సంపన్నులు, విముక్త ఆత్మ, శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యులు, స్వామి వివేకానందకు సహాధ్యాయి. 1912 నుండి 1937 సంవత్స రములో సమాధి స్థితి పొందేవరకు స్వామి అఖండా నంద సారగాచీలోని ఆశ్రమం కేంద్రంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు సేవచేస్తూ సాధన చేసేవారు. శ్రీ గురూజీలో ఆధ్యాత్మిక దృష్టి అధికంగా ఉండేది. నాగపూరు రామకృష్ణ మిషన్ స్వామీజీ సహకారంతో శ్రీ గురూజీ సారగాచి ఆశ్రమం చేరారు. దాదాపు 4 మాసాలపాటు శ్రీ గురూజీ ఆ ఆశ్రమంలో స్వామి అఖండానంద శిష్యరికంలో గడిపారు. అయితే అవి అత్యంత పరిణామకారక మైన రోజులు. భగవాన్ శ్రీ రామకృష్ణ శతజయంతి, దీపావళి, దుర్గాపూజ, కాళీపూజ, మాత శారదా జయంతి, స్వామి వివేకానంద జయంతి -అలా ఒక ఉత్సవం తర్వాత ఇంకొక ఉత్సవం వచ్చేవి.
కఠోర సాధన
ఆశ్రమములో సూచనలను శ్రీ గురూజీ గోళ్వల్కర్ తప్పక అనుసరించేవారు. కొద్దిరోజులలో కాళీపూజ, అశ్వినీ అమావాస్య రానే వచ్చాయి. పూజా సామగ్రి తోమి కడిగి పెట్టడం, ఆశ్రమ పరిసరాలు ఊడ్చి, శుభ్రం చేయడం వంటి పనులు విభూతి చైతన్యకు, గోళ్వల్కర్‌కు స్వామీజీ అప్పచెప్పారు. వీటిని శ్రద్ధతో చేసేవారు వారిద్దరూ.
ప్రతి దినమూ రాత్రి హారతి తర్వాత స్వామి అఖండానంద గది ముందు సత్సంగం జరిగేది. స్వామీజీ ప్రవచనముండేది. ఒకనాడు సత్సంగంలో శ్రీ స్వామీజీ ఇలా అన్నారు ‘పూజ కొరకు చేసే పనులన్నీ పూజలో భాగమే. పూజామందిరంలో ఊడ్చడం, తడిగుడ్డతో నేల తుడవడం, పాత్రలు తోమి కడగడం, పూలు, పండ్లు అలంకరించటం వంటి పనులన్నీ ఆరాధనా భావంతోనే చేయాలి. పనిచేస్తూ మంత్రం జపించటం, భగవంతుని స్మరించటం జరుగుతూ ఉండాలి’. ఇవన్నీ నా కొరకే చెప్తున్నారని భావించి గోళ్వల్కర్ ఎంతో తృప్తి చెందారు.
ఇలా సాధన సాగుతూండగా, 1937 సంవత్సరము 13 జనవరి మకర సంక్రాంతి కల్యాణకారక ఉత్తరాయణ ప్రథమ దినము – సరిగ్గా ముహూర్త సమయానికి శాస్త్ర ప్రకారము దీక్ష యిచ్చారు స్వామీజీ. 24 జనవరి నాడు స్వామీజీ గోళ్వల్కర్‌ని అకస్మాత్తుగా పిలిచారు. తన ముందు కూర్చోమన్నారు. స్వామీజీ అన్నారు ‘నీకు శుభం కలుగు గాక. నీకు ఆత్మ దర్శనము కలుగుగాక. నేను నా గురు మహారాజ్‌ని ప్రార్థిస్తున్నాను.. నాలో ఉన్న మంచినంతా నీకు ధారపోస్తున్నాను.. నా తపస్సంతా నీకు ప్రసరింపచేస్తున్నాను. నీలో ఉన్న చెడు అంతా నాలో చేరిపోనివ్వు, నాకే రకమైన సుఖము అక్కర్లేదు. దుఃఖమే కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి ఎప్పుడూ మరచిపోకుండా ఉండే విధంగా, నాకు దుఃఖాన్ని కలుగచేయమని కోరుతున్నాను. చూడు ! మన కోసం భగవంతుడు ఎన్ని కష్టాలను సహించాడో! శ్రీకృష్ణుడు జన్మించాడా! ఒక్కసారి కూడా కన్నతల్లి పాలు త్రాగలేదు. తల్లిని వదిలి, బృందావనం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా సుఖం లేదు. ఎప్పుడూ రాక్షసులతో పోరాటాలే. ఆయన పడిన కష్టాలు చూస్తే, మన కష్టాలు లెక్కలోకే రావు, అందుకని నీ చెడు అంతా నాకు ఇచ్చివేయి, నాలో ఉన్న మంచి అంతా నీవు తీసుకొని వెళ్ళు, నీకివే నా ఆశీస్సులు. నేటి సంధ్యా సమయం గుర్తుంచుకో వెళ్ళు. నీకంతా మేలే జరుగుతుంది’ అన్నారు. ఇంతకంటే మించిన ఆశీస్సులు ఇంకేముంటాయి. ఆధ్యాత్మిక శక్తుల సాధన ఇదే కదా. తన కఠరమైన సాధన ద్వారా గోళ్వల్కర్ తన జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు.
ఆశ్రమం నుండి సమాజం కోసం
పూజ్య స్వామి అఖండానంద శరీరం శాంతించిన తర్వాత, శ్రీ గురూజీ గోళ్వల్కర్ నేరుగా నాగపూర్ వచ్చేశారు. సంఘ కార్యమునకు, తనను తాను సమర్పించుకున్నారు.
అఖండ భ్రమణం
సరసంఘచాలక్‌గా పూజ్య శ్రీ గురూజీ 33 సంవత్సరముల పాటు పనిచేశారు. 66 సార్లు దేశం నలుమూలలా పర్యటన చేశారు. మాతృభూమి పట్ల భక్తిని, శ్రద్ధను జాగృతం చేస్తూ జాతీయ భావనను, జాతి యావత్తులో నింపారు.
సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్‌జీ, పరమపదించగానే, సంఘం ఎలా నడుస్తుందో..? అని ఎందరో చింతించిన వేళ, పూజ్య శ్రీ గురూజీ అత్యంత సమర్థవంతంగా సంఘ కార్యాన్ని స్వీకరించి, దేశం నలుమూలలా విస్తరింపజేశారు.
స్వతంత్రం సిద్ధించిన వేళ
ఒకవైపు దేశానికి స్వతంత్రం రావడం, మరోవైపు దేశవిభజన – భారతదేశ చరిత్రలో విచిత్రమైన, సన్నివేశం, అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఆనాటి లాహోర్, నేటి పాకిస్తాన్ ప్రాంతంలో ఆఖరి నిమిషం వరకు వీరు పర్యటిస్తూ హిందూ సమాజ మనోబలాన్ని కాపాడిన ధీశాలి శ్రీ గురూజీ. ఆఖరి హిందువు కూడా సురక్షితంగా వచ్చేవరకు, అందరిని స్వతంత్ర భారత భూమిలో చేర్చేవరకు, వచ్చినవారందరికి, నివాసము, భోజనాదులు, సరియైన వ్యవస్థను ఏర్పాటు చేయించినవారు శ్రీ గురూజీ.
అమృతసర్‌లో శ్రీ గురూజీ పర్యటనలో న్యాయమూర్తి రామలాల్‌జీ, పెద్దలు మోహన్‌చంద్ మహాజన్ కలసి – ‘మేము శరణార్థులుగా వచ్చాము’ అని చెప్పగానే, శ్రీ గురూజీ ‘మీరు శరణార్థులుకారు, సంపూర్ణ భారతదేశంలో మీ అందరికి సమానమైన అధికారముంది’ అన్నారు. మన దేశంలో మన వారెవరైనా శరణార్థులు ఎలా అవుతారు?’ అన్నారు. భారతదేశమంతా ఒక్కటే, భారతీయులందరూ ఈ రాష్ట్రము (జాతి) సంతానమే.
దేశ సమైక్యత, సమగ్రతల రక్షణలో
స్వాతంత్య్రం వచ్చిన తొలి దినాలలో కాశ్మీరు విలీనం సమస్యగా మారింది. కాశ్మీరులో ముస్లిం మెజారిటీ, ఆంగ్లేయుల ప్రభావంలో ఉన్న కాశ్మీరు ప్రధానమంత్రి రామచంద్రకాక్ కుతంత్రము, కాశ్మీరును పాకిస్థాన్‌లో విలీనం చేయడానికై మౌంట్‌బాటెన్ కుట్ర, కాశ్మీరు రాజును కాశ్మీరు నుండి బయటకు పంపించాలని షేక్ అబ్దుల్లా, రాజు హరిసింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమము, షేక్ అబ్దుల్లాను సమర్థిస్తూ ప్రధానమంత్రి నెహ్రూగారి వ్యవహారం వల్ల కాశ్మీరు రాజు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి సంకోచిస్తున్న సమయమది.
చివరికి 1947 అక్టోబరు 17న పూజ్యశ్రీ గురూజీ శ్రీనగర్ వెళ్ళటం, 18న రాజమహల్‌కి వెళ్ళటం, రాజు, రాణి శ్రీ గురూజీని స్వాగ తించటం, ప్రశాంత వాతావరణంలో చర్చ జరగడం, శ్రీ గురూజీకి వీడ్కోలు చెప్తూ కశ్మీర్ రాజు ‘మీ సలహాలను నేను తప్పకుండా యోగ్యమైన రీతిలో ఆలోచిస్తా’ అనడం చకచకా జరిగి పోయాయి.
శ్రీ గురూజీ ఢిల్లీకి తిరిగి వచ్చి, సర్దార్‌పటేల్ గారిని కలసి కాశ్మీరు రాజా వారి సుముఖతను, చర్చా విశేషాలను తెలిపారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ సమర్థవంతమైన ప్రయత్నం వలన కాశ్మీరు భారతదేశంలో విలీనమైంది.
సంపూర్ణ సమాజంలో సర్వాంగాల వికాసం
బీజ రూపంలో పూజనీయ డాక్టర్‌జీ ‘సంపూర్ణ హిందూ సమాజ సంఘటన’ కార్యాన్ని ప్రారంభించి, విజయవంతం చేసి 1940లో వెళ్ళిపోయారు. శ్రీ గురూజీ దానిని కొనసాగించారు. సంఘము స్వయం సేవకులను తయారుచేస్తుంది. హిందూ సమాజాన్ని సంఘటితం (ఐక్యం) చేస్తుంది. స్వయంసేవకులు సమాజంలో జాతిని ప్రేమించే వ్యక్తులతో కలసి, సమూహంగా ఏర్పడి -జాతి సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతున్నారు. పూజ్యశ్రీ గురూజీ తమ తపశ్శక్తితో, నిరంతర కృషితో, దూరదృష్టితో, నిశిత పరిశీలనతో, సమగ్రమైన యోజనతో యోగ్యమైన కార్యకర్తలను జాతీయ జీవనంలో పనిచేయడానికి పంపించారు. మార్గదర్శనం చేశారు. నేడు ఫలిత ములను అందరూ చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. విద్యారంగంలో, ధార్మిక, కార్మిక క్షేత్రంలో, వ్యవసాయ రంగంలో, జనజాతి-కొండ కోనల ప్రజలలో, సేవాక్షేత్రంలో, సాంస్కృతిక రంగంలో నేడు మౌలికమైన మార్పు తెస్తూ, జాతిని సంఘ టితం చేస్తూ, జాతి సమగ్ర వికాసం కోసం స్వయం సేవకులే కాక, జాతీయభావన కలిగిన వ్యక్తులు, సమూహాలన్నీ పనిచేస్తూ విజయపథంలో ముందు కెళుతున్న సంగతిని గమనిస్తూనే ఉన్నాం.