‘వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వం’’… శ్రీ గురుపౌర్ణమి సందర్భంగా
హిందూ ధర్మంలో మాతా పితరుల తర్వాత అత్యున్నత స్థానం గురువుదే. అందుకే ఆచార్య దేవోభవ.. గురుస్సాక్షాతన పరబ్రహ్మ, గురువే సర్వలోకానాం అంటూ గురువును దైవానికి ప్రతిరూపంగా భావించే తత్వం సనాతన ధర్మంలో కనిపిస్తుంది. తల్లిదండ్రులు మనకు జన్మను ప్రసాదిస్తే.. ఆ జన్మకొక స్థితిని , సార్థకతను ప్రసాదించేవాడు గురువు. అయితే.. ప్రాచీన కాలంలోని గురు శిష్య సంబంధానికి ఆధునిక కాలంలోని గురుశిష్య సంబంధానికి చాలా తేడా వుంది. ప్రాచీన కాలం నుంచి గురువులు తమ శిష్యులను ఆ లక్ష్యంతోనే తీర్చిదిద్దుతుండేవారు.
శిష్యులను పరిపూర్ణ మానవులుగా, ఆధ్యాత్మిక సంపన్నులుగా వికసింపచేస్తాడు. ఇదం బ్రాహ్మం` ఇదం క్షాత్రం’’ అన్న రీతిలో తీర్చిదిద్దుతాడు. ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమగా భావిస్తూ గురు దేవులను ఆ రోజున స్మరించుకోవడం ఓ సంప్రదాయం ‘‘వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వం’’ అన్నారు. ఈనాడు ప్రపంచంలో కనిపించే ప్రాచీన, అర్వాచీన వాఙ్మయం మొత్తం వ్యాస వాఙ్మయమే. వేద విభజన చేసి, అష్టాదశ పురాణాలను, మహా భారతాన్ని రచించిన వ్యాసుడు లోకకల్యాణం కోసం ఆ వాఙ్మయాన్నంతటినీ తన శిష్యులైన పైల, సుమంత, జైమిని, వైశంపాయనుల ద్వారా ప్రచారం చేయించాడు. పుత్రుడైన శుక మహర్షి ద్వారా భాగవతాన్ని, సూత మహాముని ద్వారా పురాణగాథలను ప్రచారం చేయించి, సమాజంలో నైతిక, ధార్మిక విలువలను పెంపొందించాడు.
అలాగే త్రేతాయుగంలో దశరథ పుత్రులుకు గురువైన వశిష్టుడు విద్యా బుద్ధులు నేర్పించాడు. శ్రీరాముడు సన్యాసదీక్ష తీసుకోవాలని భావించినప్పుడు వశిష్టుడు బోధ చేసి, కర్తవ్య పరాయణుడ్ని చేశారు. ఆ బోధే ‘‘యోగవాశిష్టం” గా ప్రసిద్ది చెందింది. ఆ తర్వాత సాందీప మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, కుచేలుల విద్యాభ్యాసం వర్గ రహితమైన ఆదర్శ సమాజానికి అద్దంపడుతోంది. శ్రీకృష్ణుడు కాళియ మర్దనం చేసినా గోవర్ధన గిరిని పైకెత్తి అందర్నీ కాపాడం వెనుకా గురువు పాత్ర వుంది. అలా వారిని తయారు చేశారు. మరోవైపు జగద్గురు ఆది శంకరులు ధర్మ దంఆన్ని చేత ధరించి, ధర్మోద్ధరణకి తన శిష్యులను పీఠాధిపతులుగా చేసి ఒక పరంపరను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో నాలుగు వైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలున్నాయి. అవే మన దేశానికి రక్షగా వెలుగొందుతున్నాయి. ఇందులో శృంగేరి పీఠం ‘‘సార్వభౌమ పీఠం’’గా వెలుగొందుతోంది. ధర్మ ప్రబోధం, ధర్మ ప్రచారం చేస్తూ… ఆ పీఠాధిపతులు దేశపర్యటన చేస్తుంటారు. వీటినే ‘‘విజయ యాత్ర’’లుగా పిలుస్తుంటారు.
మహర్షి విద్యారుణ్యులు హరిహర బుక్కరాయలను నిమిత్తంగా చేసుకొని, హిందూ ధర్మ పరిరక్షణకై విజయనగర సామ్రాజ్య స్థాపన చేయడంలో ప్రధాన లక్ష్యం… సమాజ శ్రేయస్సు. అలాగే సమర్థ రామదాసు శివాజీని తీర్చిదిద్దడంలోనూ సమాజ శ్రేయస్సు మాత్రమే. మొగలులు, సుల్తానుల కబంధ హస్తాల నుంచి దేశ ధర్మాన్ని కాపాడి, అందరికీ శివాజీ ఆదర్శం కావడంలో సమర్థ రామదాసు పాత్రే కీలకం.
ఇక ఆధునిక యుగంలో రామకృష్ణ ` పరమహంసల కలయిక. ఇది గంగా యమునా కలయిక వంటిది. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో సనాతన ధర్మానికి ఇబ్బందులు వస్తున్న సమయంలో.. దీనిని ఉద్ధరించాల్సిన పనిని పరమహంస యువకుడైన స్వామి వివేకానందకు అప్పగించారు. దీనికి కావల్సిన శక్తినంతటినీ పరమహంస ఆయనకు ధారపోశారు. దీంతో ప్రపంచంలో స్వామి వివేకానంద హిందూ బావుటా ఎగరేశారు. అందుకే
గురుబ్రహ్మ.. గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాతన పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమ:’’
అని గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపునిగా మనం ఆరాధిస్తున్నాం. భారతీయ ధర్మంలో ఈ గురువుకు ప్రత్యేక సాÊథనం వుంది. అయితే… లౌకిక విద్యలు నేర్పించే వారిని గురువుగా ఆరాధిస్తున్నాం కానీ… నిజానికి జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే.. లౌకికం, ఆధ్యాత్మికం రెండూ ఈ సమాజానికి అత్యావశ్యకం.
గురువు తనకు అందించిన నారాయణ మంత్రాన్ని తిరుకొట్టియూరు లోని నరసింహ స్వామి ఆలయగోపురం ఎక్కి లోకానికి అంతటికీ అందించారు. ఇలాచేసి నీకు రావాల్సిన పుణ్యాన్ని ఇతరులకు అందించి నీవు పాపం మూటగట్టుకుంటున్నావంటే.. లోకమంతటికీ మేలు జరుగుతున్నప్పుడు నాకు కీడుజరిగినా ఆనందమే అని చాటిన మహనీయులు రామానుజులు. దుష్టుల దునుమాడి దుర్గములపై ధర్మధ్వజం ఎగరేసిన వీరాశివాజీలో కించిత్ గర్వం తొణకిసలాడినపుడు… ఆయనను వ్యాహ్యాళికి తీసుకెళ్లి అడవిలో ఒకరాతిని పగలగొట్టించితే అందులోనుండి ఒక కప్ప బయట పడుతుంది. అపుడు ఆ గురువు ‘ఈ రాజ్యానికీ..ఇందులోని రాళ్లకూ..ఈరాళ్లలోని నీటికీ… ఈనీటిలోని కప్పకూ నీవే రాజువు కదా..’ అంటాడు. అప్పుడు తత్వం బోధపడ్డ శివాజీ గురువు కాళ్లపైబడి రాజ్యాన్ని మొత్తం వదిలి సన్యాసం తీసుకుంటానంటే… నీవు నా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పాలించు అని బోధించిన గురువు సమర్థరామదాసు. రాజ్యాన్ని దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న నందవంశాన్ని తుడిచిపెట్టడానికి.. యవనులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చంద్రగుప్తుని తీర్చిదిద్దిన గురువు చాణక్యుడు. ఇలా ఎందరెందరో గురువులు దేశానికి తమ మేధస్సును ధారపోశారు.. అటువంటి గురువులు నేడు కావాలి….