గుస్సాడీ నృత్యకళకు ప్రాణం పోసిన ‘గుస్సాడీ కనకరాజు’
వనవాసీ కళగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుస్సాడీ నృత్యానికి ప్రాణం పోసిన కనకరాజు కన్నుమూశారు. గుస్సాడీ కళాకారులకు శిక్షణనిస్తూ… ఆ కళకు నిత్య నూతనత్వాన్ని నింపిన కనకరాజు ఎందరికో గుస్సాడీ నేర్పించారు. దేవతామూర్తులను ఆరాధించే దండారీ నుంచే తాను స్ఫూర్తి పొందానని, అప్పటి నుంచే గుస్సాడీ నేర్చుకున్నానని చాలా సార్లు చెప్పుకొచ్చారు.ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి కనకరాజు స్వస్థలం. వీరు మార్లవాయిలోని ఐటీడీఏ ఆశ్రమ స్కూల్ లో కర్మచారిగా పనిచేస్తూనే గుస్సాడీ నృత్యం చేసేవారు. అడగ్గానే చాలా మందికి ఆయన గుస్సాడీ విద్యను నేర్పించారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ముందు ప్రదర్శన
1982 లో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లోనూ కనకరాజు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ముందు తన ప్రదర్శన ఇచ్చారు. ఈయన ప్రదర్శకు ఇందిర ఎంతో సంబురపడ్డారు. అలాగే ఆమె కాలికి కనకరాజు గజ్జెలు కట్టడంతో ప్రధాని ఇందిర కూడా వీరితో కలిసి నృత్యం చేశారు. అయితే అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారం కనకరాజుకి శిక్షణ ఇప్పించారు. ఇందులో కనకరాజుతో పాటు సార్మెడీ మెస్రం దుర్గారావును కూడా ఢిల్లీ పంపించారు. ఆ తర్వాత 2002 లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు కూడా కనకరాజు గుస్సాడీ కళను ప్రదర్శించారు. అబ్దుల్ కలాం కూడా చాలా ప్రశంసించారు. ఎన్నో వందలాది మందికి గుస్సాడీ నృత్యం నేర్పించారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ.. నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గుస్సాడీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబరు 9న పద్మశ్రీ ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రదానం చేసింది. ప్రాచీన నాట్యకళను పరిరక్షించడంతోపాటు.. నేర్పించడంలో కనకరాజు చేసిన కృషికి గానూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు అందజేశారు.
అయితే కనకరాజు చదువుకోలేదు. కొంతలో మరాఠీ నేర్చకున్నారు. రారాజు అని మాత్రం సంతకం మాత్రం చేస్తారు. మొదట్లో తన పద్మశ్రీ ప్రకటించిన సమయంలో అధికారులు తన దగ్గరికి వచ్చి తన కుటుంబ వివరాలు అడిగారని, విషయం చెప్పకుండా అడగడంతో తాను చాలా భయపడ్డానని, తర్వాత విషయ చెప్పడంతో చాలా సంతోషించానని అన్నారు. అయితే.. పద్మశ్రీ పురస్కారం రావడం తన పూర్వజుల అనుగ్రహం వల్లే వచ్చిందని చెప్పేవారు. తన పిల్లలు బాగా చదువుకోక, గుస్సాడీ నృత్యంపైనే ఆధారపడ్డారు.
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తూ… జీవించారు. అయితే.. ఈయనను కనకరాజు అని ఎవ్వరూ పిలవరు. ఊరివారితో సహా అందరూ గుస్సాడీ అనే పిలుస్తారు. రోజులకి రోజులు వనవాసీ గ్రామాల్లో పర్యటిస్తూ గుస్సాడీ నృత్యం చేస్తూ… నేర్పించారు. గుస్సాడీ నృత్యం, కనక రాజుకి అభేదం. అంతలా గుస్సాడీలో లీనమైపోయారు కనకరాజు. ఈ ఘటనమైన వారసత్వాన్ని రాబోయే తరాలకు అప్పగించాలన్నదే కనకరాజు తపన. దీనిని జీవితాంతం ఆచరించారు. తాను నేర్చకున్న గుస్సాడీ నృత్య కళ కనకరాజు తలరాతనే మార్చేసింది. ఎంతలా అంటే ఎక్కడో మారుమూల గూడెల్లో నివసించే కనకరాజును… దేశ రాజధానికి పరిచయం చేసి, పద్మశ్రీ వచ్చేలా చేసింది.