అటు సంప్రదాయం, ఇటు ఆధునికం.. హ్యాండ్ మేడ్ ఆభరణాలతో ‘‘స్వయంసమృద్ధి‘‘

చేతితో చేసే అల్లికలతో గౌహతిలోని జూరి రాజ్ కుమార్ అనే మహిళ దేశవ్యాప్త ప్రచారం పొందింది. అలాగే స్వయం సమృద్ధి దిశగా విజయం సాధించి, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. చేతితో చేసే అల్లికలు సంప్రదాయకమే అయినప్పటికీ, మార్కెట్ కి అనుగుణంగా, ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ చేతితో ఆభరణాలు, బుట్టలు తయారు చేస్తోంది. పట్టుదలతో, ఎలాంటి శిక్షణా లేకుండా తనకున్న శ్రద్ధతో వీటిని తయారు చేస్తోంది. వీటి తయారీయే తనను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేసింది. కేవలం తాను చేయడమే కాకుండా ఈ కళపై ఆసక్తి వున్న వారికి వర్క్ షాపులు, శిక్షణ కూడా అందిస్తుంది.

పురాతనంగా వున్న డిజైన్లకు ఇప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ట్రెండ్స్ కి అనుగుణంగా తయారు చేసింది. చేతితో తయారు చేయడం ద్వారా ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ హిత) కూడా వుంటుందని పేర్కొంది. జూరీ రాజ్ కుమార్ చేతితో తయారు చేసిన ఆభరణాలు, ఇతర వస్తువులు విదేశాలకు కూడా వెళ్తున్నాయి.

అయితే.. ఈ కళను తన అమ్మ దగ్గరి నుంచి నేర్చుకున్నానని, అమ్మే తనకు గురువు అని ప్రకటించింది. 2008 లో మొదట పూసలు, దారాలను నేయడం నేర్చుకున్నానని, ఇప్పుడు చేతితో తల్లి కూతుళ్లు కలిసి నెక్లెస్, చెవి పోగులు, చోకర్లు, బ్రాస్ లెట్ లతో పాటు ఫ్యాషన్ రింగులు, అప్పుడప్పుడు బుట్టలు కూడా నేస్తున్నామని వివరించింది.

‘‘ఈ కళ 2008 లో మా అమ్మ నుంచి నేర్చుకున్నా. అప్పుడే హ్యాండీ క్రాఫ్ట్ (చేతితో తయారు చేసిన) ఆభరణాలు, వస్తువులపై ఆకర్షితులరాలినయ్యా. కేవలం 2,000 రూపాయలతో ఈశాన్య భారత సంప్రదాయ గిరిజన, చేతి పనులను చూసి ఆకర్షితురాలినయ్యా.అప్పుడే కళాఖండాల తయారీని ప్రారంభించారు. నా డిజైన్లు వ్యక్తిగత అభిరుచులతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రతి డిజైన్ కి కూడా పక్కా ప్రణాళిక, తగినంత సమయం తీసుకొనే తయారు చేస్తా.కానీ సమయం పడుతుంది. ఇంట్లోనే అస్సామీ ఆభరణాల డిజైన్లను చేస్తా. మిసింగ్, కర్బి, నాగా, మిజో, బోడో, అపతాని, కుకి తో పాటు ఇతర గిరిజన సమూహాల నుంచి ప్రేరణ పొందాను. నేను ఉపయోగించే పూసలు అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, దిఫు వంటి ప్రదేశాల నుంచి తీసుకుంటా.’’ అని జూరీ రాజ్ కుమార్ పేర్కొంది.

అయితే.. జూరీ రాజ్ కుమార్ తయారు చేసే ఆభరణాలు అన్ని వయస్సుల వారీకి అందుబాటులో వుంటాయి. 20 రూపాయల నుంచి మొదలు పెడితే 2,000 రూపాయల వరకూ వుంటాయి. తమ దగ్గరికి వచ్చే వినియోగదారుల అభిరుచి, వారి అవసరాలకు అనుగుణంగా ఆభరణాలను రూపొందిస్తుంది.

అయితే.. తానింకా ఆన్ లైన్ మార్కెటింగ్ లోకి వెళ్లలేదని, అయినా.. వినియోగదారులు నేరుగా తమ దగ్గరికి వచ్చే తీసుకెళ్తుంటారనివివరించింది. ఎక్కువగా ఫోన్ల ద్వారా ఆర్డర్లు వస్తాయని తెలిపింది. అంతేకాకుండా తరుచుగా గౌహతిలోని స్థానిక ప్రదర్శనల్లో, ఢిల్లీ, బెంగళూరు, ఈశాన్య ప్రాంతాల్లో జరిగే స్థానిక ప్రదర్శనల్లో ఈ ఆభరణాలను వుంచుతానని తెలిపింది.

ఇలా చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాకుండా పర్యావరణ హితం కూడా అవుతుందని తెలిపింది. విదేశాల నుంచి వచ్చే బ్రాండ్ల కంటే.. స్థానికంగా తయారైన హ్యాండ్ మేడ్ ను ప్రోత్సహించినట్లవుతుందని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *