ఏ నేలలోనైనా పండే పంట పనస.. పైగా రోగ నాశిని

వాతావరణంలో వేగంగా మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా పండే పంటలపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ స్థలం కూడా తీసుకోని పంటలు ఎవున్నాయోనని చూస్తున్నారు. వీటన్నింటితో పాటు ఇప్పుడు సమాజం విటమిన్లు పుష్కలంగా వున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటన్నింటికీ అనుకూలమైన పంట పనస పంట. చల్లని ప్రాంతాల్లోనే కాదు, వేడి వాతావరణం, కరువు ప్రాంతాల్లోనూ పనస పంట సాగుకు అనుకూలమని చెబుతుంటారు. పొలం గట్లపై పనస చెట్లు వేసుకున్నా… పంట చేతికి వచ్చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే పోషక విలువలు కూడా పుష్కలమే. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పెరిగే పండ్లు ఇవి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, లంబసింగి ప్రాంతం, అరకు ప్రాంతాల్లో ఈ పంట పుష్కలంగా లభిస్తుంది.

అన్ని రకాలుగా ఈ పంట కలిసి రావడంతో గిరిజనులు ఈ పనసను ఎక్కువగా వేస్తుంటారు. అధిక లాభాలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కో చెట్టుకు 20 వేల నుంచి 25 వేల రూపాయల లాభం వస్తుంది. దీంతో అక్కడే అమ్మడం కాకుండా, ఇతర ప్రాంతాలకు, పెద్ద పెద్ద మార్కెట్లకు కూడా వీటిని తరలించి, రైతులు లాభాల బాటలో వున్నారు.

ఎరువులు, తెగుళ్లు, పురుగులు… ఇలాంటి బాధలేమీ వుండవు కాబట్టి… పనస పంట వైపు రైతులు ఎక్కువగా వెళ్తారు. చల్లటి, వేడి వాతావరణం అని కాకుండా ,అత్యంత ఇబ్బంది పరిస్థితులను కూడా తట్టుకొని, ఈ పంట ఎదుగుతుంది. నల్లరేగడి నేలల్లో కూడా ఇది సాగు అవుతుంది. ఎర్ర నేలలు, కంకర నేలలు కూడా పనసకు అనుకూలమే. సాగుకు అంత అనుకూలించని నేలల్లో కూఆ ఈ పనస సాగు చేస్తున్నారు. అయితే… నీరు నిలిచిపోయే నేలలు మాత్రం ఈ పంటకు సరిపడవు. మెట్ట నేలల్లో పెరిగిన వాటి రుచి బాగా వుంటుందని అంటుంటారు. తొలి రెండు సంవత్సరాలు మాత్రం నీరు అందించాలి.

పనస మొక్క నాటిన ఏడేళ్ల నుంచి పంట చేతికి వస్తుంది. 100 సంవత్సరాల వరకూ చెట్లు పండ్లనిస్తూ వుంటాయి. అంట్లు నాటుకుంటే 4 నుంచి 6 సంవత్సరాల లోపే కాపుకాస్తాయి. లేత కాయలు కొన్నింటిని తీసేస్తే.. మిగతా కాయలు బలంగా పెరుగుతాయి.
పుష్కలంగా విటమిన్లు… గింజ మొదలు.. అంతా ఉపయోగమే…

సర్వ రోగ నివారిణి పనస 

పనస అనేక రోగాలను తగ్గిస్తుంది. కొందరైతే సర్వరోగ నివారిణి అని కూడా అంటుంటారు. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఆ చెట్టు కాండం నుంచి తీసిన బెరుడును సంప్రదాయిక మందుల్లో వాడతారు. పనస తొనల్లో వుండే స్పీరోజైమ్‌ అనే ఎంజైమ్‌ గుండె జబ్బుల నివారణకు కూడా తోడ్పడుతుంది. ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఏ,సీ విటమిన్లు పుష్కలం. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, 12 శాతం పిండి పదార్థాలు, 7 శాతం మాంసకృతులు, 2 శాతం పీచు పదార్థాలుంటాయి. చక్కెర శాతం తక్కువగా వుంటుంది. పైగా సులభంగా జీర్ణం కూడా అయిపోతుంది. కేన్సర్‌ నిరోధకంగా కూడా ఈ పనస పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *