ఔషధ మొక్కలతో ఆరోగ్య క్షేత్రం
కరోనా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామనే సృహా అందరికీ కలిగింది. మనం తీసుకునే ఆహరం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందనే విషయం స్పష్టమైంది. అదే సమయంలో వైరస్ నివారణకు ఔషదాల ప్రాముఖ్యత కూడా ప్రజలకు తెలిసింది. వైరస్ నివారణకు కావాల్సిన ఔషదాలను కనుగోనడంలో చాలా మంది నిమగ్నమైయ్యారు. దేశంలో కొన్ని చోట్ల కరోనా నివారణకు ఔషధాలతో మందులు కూడా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఔషదాలతో చేసిన కరోనా మందు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఔషదాల ప్రాముఖ్యత తెలుసుకుని గత కొన్నేళ్లుగా ఔషదాల మొక్కలను పెంచుతూ చుట్టు పక్కల వారికి సహాయం చేస్తున్న ఒడిషాలోని ఒక రైతు గురించి తెలుసుకుందాం.
ఒడిశాలోని కలహండి జిల్లా నండోల్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రైతు పటాయత్ సాహు తన 1.5 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో 3,000 ఔషధ మొక్కలతో వ్యవసాయం చేస్తున్నాడు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువును ఉపయోగించి మొక్కలను పెంచుతున్నాడు. ఈ రకంగా సాహు స్థానికులకు, గ్రామస్తులకు వారి వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయం చేస్తున్నాడు.
చిన్న వయస్సులోనే సాహు గారికి సాంప్రదాయ ఔషధాల పట్ల అభిరుచి ఉండండతో ఔషదాల తయారిని నేర్చుకోవడం ప్రారంభించాడు. ‘‘మా తాత ఒక ఆయుర్వేద వైద్యుడు. నా విద్యబ్యాసం పూర్తయిన తర్వాత నేను అతని వద్ద సాంప్రదాయ వైద్యం పద్ధతులను నేర్చుకున్నాను. ఔషధ మొక్కలతో సాంప్రదాయ వైద్యం పద్ధతులకు సంబంధించిన పురాతన గ్రంథాలు కూడా నా వద్ద అందుబాటులో ఉన్నాయి ‘‘ అని సాహు అన్నారు.
సాహు తన పెరట్లో 40 సంవత్సరాల క్రితం తన ఔషదాల తోటను ప్రారంభించాడు. సంవత్సరాలుగా పెరుగుతున్న కొద్ది తన తోటలో కొత్త జాతి మొక్కలను జోడిస్తూనే ఉన్నాడు. అతని తోట అశోక, లోధ్రా, బిడంగ, సంబర్సింహ, రస్నజాది, తిహుడి, భిన్ కాఖరు, మైదా, సర్పగంధ, శతావరి వంటి అరుదైన జాతులతో నిండి ఉంది. అంతేకాకుండా భృంగరాజ్, పెంగు, పనికుసుమ, రాజపాత, నాగవేల్, దేబనాసన్, జలదింబిరి, జ్యోతిస్మతి అనే ఐదు రకాల ఔషద మొక్కలు కూడా తన తోటలో పెరుగుతున్నాయి. ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే అన్ని దశమూల జాతులను కూడా ఆయన పెంచుతున్నాడు.
తన తోటలోని 3,000 జాతులలో దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి సుమారు 500 జాతులను సేకరించానని సాహు తెలిపారు. కలహండి జిల్లాలోని కొండల నుండి, మోహంగిరి దట్టమైన అడవి నుండి కొన్ని మొక్కలను అటవీ శాఖ అధికారులతో కలిసి సేకరించినట్టు ఇందుకు ఒడిషా మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ తనకు సౌకర్యం కల్పించిందని సాహు తెలిపారు.
సాహు పగటిపూట రైతుగా, రాత్రి సమయంలో ఔషద వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నాడు. చికిత్స కోసం తనను సందర్శించే వ్యక్తుల నుండి అతను ఎలాంటి డబ్బును ఆశించడం లేదు. తమకు తోచినది ఏది ఇచ్చినా స్వీకరిస్తున్నాడు.
మన్‌కీ బాత్‌లో సాహుకి ప్రధాని మోదీ ప్రశంస
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో పటాయత్ సాహును ప్రశంసించారు. ‘‘సాంప్రదాయకంగా, మన దేశంలో ఆరోగ్యానికి ఉపయోగపడే సహజ ఉత్పత్తులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. ఒడిశాలోని నండోల్, కలహండిలో నివసించే పటాయత్ సాహు జీ, ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా అద్వితీయమైన పని చేస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు.
‘‘అతను 1.5ఎకరాల భూమిలో ఔషధ మొక్కలను నాటడం మాత్రమే కాదు.. సాహు జీ ఈ ఔషధ మొక్కల డాక్యుమెంటేషన్ కూడా చేపట్టారు. ఇలా వ్యవసాయాన్ని ఆరోగ్య క్షేత్రంతో అనుసంధానించడం అభినందనీయం’’ అని మోడీ అన్నారు.