వనవాసీ క్షేత్రాల్లో ‘ఆరోగ్యయాత్ర’
వనవాసీ క్షేత్రాల్లో, మారుమూల పల్లెల్లో వైద్య సేవలు అందిస్తూ నేషనల్ మెడికోస్ టీమ్ ఆరోగ్య భారతం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 15 వనవాసీ పల్లెలకు వెళ్లి, నేషనల్ మెడికోస్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇది రెండు రోజుల పాటు సాగింది. ‘‘కొమురం భీం స్వాస్త్య సేవాయాత్ర’’ పేరుతో ఈ కార్యక్రమం సాగింది. ఇందులో 150 మంది వైద్య విద్యార్థులు, వైద్యులు ఓ బృందంగా ఏర్పడి… రోజంతా వనవాసీ గూడెల్లో, మారు మూల పల్లెల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేశారు. ఈ సేవా యాత్రకు ఏకలవ్య ఫౌండేషన్ తమ పూర్తి సహాయ సహకారా లను అందించింది. రెండు రోజులపాటు సుమారు 500 మందికి వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఔషదాలు అవసరమైనవారికి ఔషధాలను కూడా ఉచితంగానే అందించారు. అలాగే శుభ్రత, ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి వనవాసులకు ఈ బృందాలు అవగాహనను కలిగించాయి. ఏకలవ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసింది.
తెలంగాణతెలంగాణ నలుమూలల నుండి 150 మంది మెడికోలు మరియు 30 మంది వైద్యుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. హైపర్‌టెన్షన్ మరియు డయాబెటిస్‌పై దృష్టి సారించి, 500 మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికోలు అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. వనవాసులతో వెంటనే మమేకమైపోయారు. వారి ఆప్యాయతను వీరు అందుకున్నారు.. వీరి ఆప్యాయతను వారందరుకు న్నారు. తమ కుటుంబ సభ్యుల లాగానే వనవాసు లందర్నీ మెడికోలు దగ్గరికి తీసి, వారికున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలకు చూపించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఔషదాలను కూడా అందించి తమ గురుతర బాధ్యతను నిర్వహించారు.
ఈ రెండు రోజుల క్యాంపులో బీపీ, షుగర్‌తో పాటు జనరల్ స్క్రీనింగులు కూడా ఈ బృందాలు నిర్వహించాయి. అవసరమైన వారి నుంచి బ్లడ్ షాంపుల్స్ కూడా సేకరించి, పూర్తి బ్లడ్ పిక్చర్, వైడల్ టెస్టులు, ఫీవర్ ప్రొఫైల్ వంటి వాటిని కూడా నిర్వహించారు. చిన్న పిల్లలకు మరింత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వుండాలని వారికి సూచించారు. మరోవైపు మహిళల విషయంలో ఈ మెడికో బృందం మరింత లోతైన శ్రద్ధ వహించింది. మహిళలకే ప్రత్యేకంగా వుండే వైద్యపరమైన ఇబ్బందులను కూడా వీరు పరిగణనలోకి తీసుకొని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సూచనలు చేశారు. సోమార్ పేట, గర్కంపేట, పెద్ద మల్కాపూర్, ధరమడుగు, వైజాపూర్, ధమన్ గూడ, ధాంపూర్, వాల్గొండ, డోంగర్ గావ్, ధోనంద, హర్కాపూర్, హర్కాపూర్ అంధుగూడ, సిరికొండ, రాజ్యంపేట, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
క్యాంపుల ద్వారా తేటతెల్లమైన విషయాలు
అత్యధికుల్లో విటమిన్ డి లోపం వుందని గుర్తింపు. ఎక్కువ మంది పాలు తాగరు. కాల్షియం లోపం అధికం. పండ్లు చాలా తక్కువగా తింటారు. మంచి నీటిని చాలా తక్కువగా తీసుకుంటారు. ఫ్లోరోసిస్ సమస్య కూడా గుర్తించారు. విటమిన్ల లోపం బాగా వుంది. పంట పండిస్తారు కానీ… వనవాసులు తినరు. దానిని అమ్మేసి, డబ్బు పోగు చేసుకుంటారని తెలిసింది. అలాగే చేతులను పరిశుభ్రం చేసుకోవడం కూడా తక్కువే. కొన్ని ప్రాంతాలలో చెప్పులు కూడా వేసుకోరు. మద్య పాన సమస్య అధికంగా వుంది. మలేరియా, సీజనల్ వ్యాధులు అధికం. రక్తహీనత బాగా వుందని వెల్లడైంది. అనారోగ్యం సమయంలో టెస్టుల విషయంలో తీవ్ర అలసత్వం. హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ సమస్యలు చాలా చాలా తక్కువ అని గుర్తించారు. అలాగే ఆవులను బాగా పెంచుతారు కానీ.. ఆ పాలను వారు తీసుకోరు. అమ్మరు కూడా. కేవలం లేగదూడలకే వదిలేస్తారు. మంచి నీటిని కూడా చాలా తక్కువగా తాగుతారని వెల్లడయింది. అతిసాధారణ రుగ్మతలు కూడా పట్టించుకోక పోవడంవల్ల పెద్ద సమస్యలకు దారితీస్తున్నాయి. కనీస వైద్యం కూడా అందకపోవడం కూడా ఇందుకు కారణమని తేలింది.