‘‘వలసెళ్లిన గ్రామాన్ని తిరిగి నిలబెట్టి, స్వావలంబన దిశగా తీసుకెళ్లిన ‘‘హెడ్గేవార్ సేవా సమితి’’
మహారాష్ట్రలోని నందూర్ బర్, నవాపూర్ లాంటి గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారం. అది తప్ప అక్కడి గిరిజనులకు వేరేది తెలియదు. దీంతో లాభం తక్కువగా రావడంతో ఆర్థికంగా చితికిపోయారు.తిండి లేక, కనీస అవసరాలను కూడా తీర్చుకోవడానికి అతి కష్టంగా మారింది. పేదరికం వారి జీవితంలో భాగమైపోయింది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు లేదు. దీంతో ఆ గ్రామాన్ని విడిచి, దగ్గర్లో వున్న పట్టణాలకు వలసెళ్లిపోయారు. దీంతో ఆ గ్రామం చిన్నదైపోయింది. చాలా మంది వెళ్ల లేక వెళ్లలేక.. తమ గ్రామాన్ని విడిచిపెట్టేశారు. పల్లె మొత్తం పట్నం వెళ్లిపోయింది.
ఈ ముప్పును పసికట్టింది డా.హెడ్గేవార్ సమితి. ‘‘దిద్దుబాటు’’’ చర్యలు చేపట్టింది. దీంతో ఆ గిరిజన ప్రాంతంలోని గిరిజనుల జీవితం చక్రం మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హెడ్గేవార్ సేవా సమితికి సంబంధించిన గజానన్ డాంగే, లలిత్ బాలకృష్ణ పాఠక్, రంగనాథ్ రుంఝాఝీ నవేలే తో పాటు మరి కొందరి ప్రయత్నాల వల్ల ఆకలి, పేదరికం, పోషకాహార లోపం పూర్తిగా దూరమయ్యాయి. అద్భుతమైన పరివర్తన కనిపిస్తోంది.
ప్రారంభంలో సేవా సమితి మహారాష్ట్రలోని నవాపూర్ తహసీల్‌లోని ఖండ్‌బారా బ్లాక్‌లోని 8 గ్రామాలలో పనిని ప్రారంభించింది. అభివృద్ధికి దూరంగా వున్న నవాపూర్ ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోంది.

‘‘నాబార్డు’’ సాయంతో ఈ గ్రామాల రూపు రేఖలను హెడ్గేవార్ సేవా సమితి మార్చేసింది. అక్కడి ప్రజలకు 500 మంది ముందుకు వచ్చారు. మామిడి, ఉసిరి మొక్కల పెంపకం చేయాలని హెడ్గేవార్ సమితి సూచించింది. దీనిని వెంటనే స్వీకరించి, రైతులు వాటిని నాటడానికి అంగీకరించారు. అయితే.. సరైన పద్థతుల్లో, మొక్కలు పాడవకుండా వుండేలా గోతులు ఎలా తవ్వాలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ సంస్థ రైతులకు నేర్పించింది. అలాగే పొలం చివరన ఒక గొయ్యి తవ్వడం ద్వారా నేల కోతకు మరియు నీటి సంరక్షణకు సహాయపడే “ఫామ్ బండింగ్” గురించి శిక్షణ ఇచ్చింది.
మరోవైపు నది దగ్గర్లోనే వున్నా… నీటి సమస్య వుండేది. దీనికి కూడా హెడ్గేవార్ సమితి ఓ పరిష్కారాన్ని చూపించింది. వారి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం దసరా పండగ తర్వాత వందలాది మంది నేసు అనే నది ఒడ్డున చేరి, ప్రార్థనలు చేస్తారు. నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటారు.
దీనిని కూడా గమనించిన హెడ్గేవార్ సమితి సభ్యులు..నీటి సమస్యను పరిష్కరించడానికి, సమితి రైతులను ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా ఆనకట్ట నిర్మించుకునేలా ప్రేరేపించింది. రైతులు నేసు నదిపై చిన్న ఆనకట్టలు నిర్మించి తమ పొలాలకు సాగునీరు అందించారు. దీనిని గమనించిన తర్వాతే ప్రభుత్వం ముందడుగు వేసి, ఇప్పుడు ప్రభుత్వం 17 పక్కా ఆనకట్టలను కూడా నిర్మించింది.

ఇక.. అక్కడి పిల్లలకు విద్య అందించాలని కూడా హెడ్గేవార్ సమితిని నిర్ణయించుకుంది. దీంతో ఈ ప్రాంతంలోని పిల్లలకు 10వ తరగతి వరకు విద్యను అందించడానికి పాఠశాలలను స్థాపించింది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో దాదాపు 500 మంది పిల్లలు చదువుతున్నారు.
అలాగే రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వుండకూడదని కూడా సమితి నిర్ణయించింది. వ్యవసాయ పంటల అమ్మకం కోసం, ఇతరత్రా పనుల కోసం, నూర్పిడి కోసం గుజరాత్ కి వెళ్లాల్సి వచ్చేది. దీంతో రైతులకు శ్రమతో పాటు ఖర్చు, ప్రయాణం కూడా ఎక్కువే. దీనిని పరిష్కరించడానికి సమితి 13 గ్రామాల్లో 13 రైసు మిల్లులను కూడా ప్రారంభించింది. రైతులకు తమ సౌలభ్యం మేరకు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించింది.
ఇక… కూరగాయలు ప్రతి రోజూ కొనుక్కోవడం ఆర్థికంగా ఇబ్బంది అని కూడా సమితి గ్రహించింది. దీంతో గిరిజనుల ఇళ్ల వెనుకే వున్న ప్రాంగణంలో కూరగాయల పెంపకంపై శిక్షణనిచ్చింది. ఒకే రకమైన పంట కారణంగా, నేల కోత ఒక సాధారణ సమస్యగా మారింది. దీనిని పరిష్కరించడానికి పంట క్యాలెండర్ ను కూడా సమితి సూచించింది.
శ్రీమతి తేటిబాయి కుశాల్ పావ్రా ఉత్తమ నాణ్యత గల కూరగాయలను అమ్మినందుకు NICRA (నేషనల్ ఇన్నోవేషన్ ఆన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్) నుండి అవార్డును పొందారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సమితి సహాయంతో ఆమె శిక్షణ పొందింది.
హెడ్గేవార్ సేవా సమితి నందూర్ బర్ తో పాటు దాని చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రైతులు తమ గ్రామాలను విడిచిపెట్టి వెళ్లకుండా, ఉన్న గ్రామంలోనే వ్యవసాయం, తమ కాళ్లపై తాము నిలబడే జీవనాధారంతో పాటు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రణాళికలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రైతులు, ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి, ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తోంది.