ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ విత్తనాలతోనే వ్యవసాయంలో అధిక దిగుబడులు

మన దేశంలో చాలా రోజుల వరకు దేశవాళీ విత్తనాల వాడకమే బాగా ఉండేది. కానీ… పరిస్థితులు  మారిపోతున్నాయి. హైబ్రీడ్ విత్తనాలు, బీటీ విత్తనాల వాడకమే బాగా పెరిగిపోయింది. దీంతో రైతులు ఆర్థికంగా  బాగా నష్టపోతున్నారు. అలాగే నేల సారవంతం కూడా తగ్గిపోతోంది. ఒక్క పంట పండిరచుకొని, మరుసటి సంవత్సరం పంట కోసం ఎప్పుడు విత్తనాలను దాచుకుంటామో అప్పుడు విత్తనాలను కొనే అవసరం వుండదు. దేశవాళీ ఆవుపేడ, మూత్రాలను ఎరువుగా వాడే క్రమంలో రసాయన లేదా సేంద్రీయ ఎరువుకు ఒక్క రూపాయి ఖర్చు కూడా అవసరం లేదు. ఏ దేశవాళీ విత్తమైనా మన బంగారు నేలల్లోనే విరగపండుతాయి. ఇప్పటి దాకా మనం రసాయన లేదా సేంద్రీయ ఎరువులు వాడినందు వల్ల మొదటి సారి దేశవాళీ విత్తనం వేస్తే ఏదైనా కొంచెం దిగుబడి తగ్గుతుంది కానీ… రైతులకు నష్టం రాదు. రెండో పంట నుంచి దిగుబడులు పెరగడం మాత్రం ఖాయం. ఏ గ్రామానికి ఆ గ్రామం దేశవాళీ విత్తనాలను అభివృద్ధి  చేసుకోవాలి. ఇందుకు ప్రభుత్వం కూడా సహకరించాలి.

కొన్ని పంటలను కలిపి పండిరచడం రైతుకు, భూమికీ మేలు
ప్రధాన పంట వేసిన తర్వాత చాళ్ల మధ్య ఖాళీలో రాగులు, సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలు కంది, పెసర, మినుము, అలసంద, ఉలవ వంటి పప్పు ధాన్యాల పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి. దేశవాళీ విత్తనాలనే వాడాలి. పప్పు జాతి పంటలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పొలానికి పుష్కలంగా అందిస్తాయి. వరిని మాత్రం ఒంటరిగానే సాగు చేయాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు, హైబ్రీడన విత్తనాల ఖర్చు వుండదు. ఇక వ్యవసాయానికి పెట్టే ఖర్చు అంతా కూడా అంతర పంటల ద్వారా రైతుకు తిరిగి వచ్చేస్తుంది. ఏదైతే ప్రధాన పంటగా వేశారో ఆ పంట దిగుబడి అంతా రైతుకు మిగిలినట్టే. పెట్టుబడి లేని వ్యవసాయం అంటే ఇదే.

ప్రకృతి  వ్యవసాయంతో జీవితాలు మారిపోతాయి

పెట్టుబడి లేని ప్రకృతి  వ్యవసాయం మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. మీ లోపలి శత్రువులను, దుష్టత్వాన్ని ఓడిరచి మీలోని దైవంతో మీరు సంబంధంలోకి రాగలుగుతారు. పెట్టుబడి లేని ప్రకృతి  వ్యవసాయాన్ని ఆచరించడం ప్రారంభించారంటే… మొత్తంగా మీ ప్రవర్తలోనే పెనుమార్పు చోటు చేసుకుంటుంది. ఇక దేన్నీ పట్టించుకోకుండా తాత్కాలికంగా అధిక దిగుబడుల కోసం అర్రులు చాచడం అంటే ఏమిటో గమనించారా? దీర్ఘ  కాలంలో ప్రకృతి  వనరులను అధికంగా నష్టపరచడం, అధికంగా ఆర్థికంగా  నష్టాలు కొనితెచ్చుకోవడం, అధికంగా అప్పులు పెరగడం, అధిక సంఖ్యలో రైతులు బలవన్మరణాలకు పాల్పడటం ఇదీ దాని అర్థం.  ప్రభుత్వం ఏం పనులు చేస్తే రైతులకు అవార్డులు ఇచ్చి ఆకాశానికెత్తుతోందో తెలుసా? ప్రమాదకరమైన రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వేసి నెలలో వుండే అశేష సూక్ష్మజీవులను నాశనం చేసిన వారికి, మనుషుల ఆరోగ్యానికి హానికరమైన జన్యుమార్పిడి విత్తనాలు, హైబ్రీడ్  విత్తనాలను వాడిన వారికి… ప్రభుత్వం ఉత్తమ రైతులుగా అవార్డులు ఇస్తోంది. ఎందుకంటే ఆ విష రసాయనాలను వాడకుండా ఆ రైతులు తాత్కాలికంగానైనా అధిక దిగుబడులు సాధించలేరు. దీన్నిబట్టి మానవ వనరులను, ప్రకృతి  వనరులను ధ్వంసం చేసైనా సరే తాత్కాలికంగానైనా అధిక దిగుబడులు సాధించే రైతులే ఉత్తమ రైతులని ప్రభుత్వం నిర్వచిస్తున్నట్లు అర్తమవుతూనే  వుంది.

పైపై ఆకర్షణలకు  లోను కావొద్దు… ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..

అద్భుతమైన  పంట దిగుబడులు సాధించాలని, తద్వారా ప్రభుత్వం చేత ఉత్తమ రైతు, ఆదర్శ  రైతు, కృషి  రత్న వంటి బిరుదులు పొందాలన్న బలమైన ఆకాంక్ష రసాయనిక వ్యవసాయం చేసే రైతు మదిలో వుంటుంది. దోపిడీ వ్యవస్థ  వైపు మిమ్మల్ని , మీ తోటి వారిని ఆకర్షించి , ఆత్మహత్యల దిశగా నెట్టేందుకే ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం ఇవ్వజూపే బిరుదులు మీలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను ఉద్దీపన చేస్తాయి. మీరు గనక నిజంగా మీ జీవితంలో మార్పు రావాలని అనుకుంటే.. కళ్లు చెదిరే దిగుబడులు తీయాలన్న బలమైన ఆకాంక్షను వదులుకొని తీరాల్సి వుంటుంది. ఈ ప్రమాదకరమైన రసాయనిక వ్యవసాయాన్ని వదిలించుకుంటే… ప్రకృతి  వ్యవసాయంలోకి అడుగుపెట్టవచ్చు. ఇది జరగాలంటే మీరు దృఢ  చిత్తంతో కచ్చితమైన నిర్ణయానికి  రావాలి.

మిశ్రమ పంటల సాగుతో అంతా మేలే…
లోతు దుక్కులకు స్వస్తి చెప్పాలని, మిశ్రమ ఆహార పంటల సాగు ద్వారా పంట భూమిలో జీవ వైవిధ్యం పెంపొందుతుందని, భూమి సారవంతమవుతుందని, ఆహారోత్పత్తి కూడా ఇనుమడింప  చేస్తుంది. చిన్న సన్నకారు రైతులకు మేలు కలుగుతుందని ఐరాస కూడా సూచిస్తుంది. భూమి పైఒర మట్టే నాగరికతకు పునాది వంటిదని శాస్త్రవేత్తలు అంటుంటారు. అయితే మనిషి తన జీవన అవసరాల కోసం భూమిని వినియోగించుకోవడంలో విచక్షణ కోల్పోవడం వినాశకరంగా పరిణమిస్తోది. పెరుగుతున్న జనాభా ఆహారం, నీటిని సమకూర్చుకునే క్రమంలో చోటు చేసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల భూమిపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. 19వ శతాబ్దం నుంచి భూవినియోగ తీరుతెన్నులు మారడంతో భూమిలో, చెట్టు చేమల్లో నిక్షిప్తమై వున్న కర్బనం 60 శాతంపైగా వెలువడి వాతావరణంలో కలిసింది. గత 25 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా 24 శాతం భూమిసారాన్ని, ఉత్పాదక శక్తిని కోల్పోయిందని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *