హిమాచల్ ప్రదేశ్ ’’హిందూ సంఘటన’’ కు ఆదర్శం
హిమాచల్ ప్రదేశ్ లో హిందూ సంఘటనం ప్రస్ఫుటంగా కనిపించింది. హిందువులందరూ ఐక్యమై అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చేయాలంటూ రోడ్లపైకి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది.అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సంజౌలీలో భారీ సంఖ్యలో నిరసన వ్యక్తం చేస్తున్న హిందువులపై అక్కడి ప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జి చేయించింది. వాటర్ కేనన్లను కూడా ప్రయోగించింది.అయినా హిందువుల ధైర్యం చెక్కుచెదరలేదు. పోలీసులతో నిరసనను ఎంత అణగదొక్కేయాలని చూసినా… హిందువులు బెదరలేదు. నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చారు. అంతేకాకుండా అత్యంత విశేషమేమంటే… అక్కడి మంత్రి అనిరుధ్ సింగ్ హిందువుల పక్షాన నిలిచారు. అక్రమంగా మసీదు నిర్మాణాన్ని అసెంబ్లీ వేదికగానే నిరసించారు.
హిందువులకు అన్ని విధాలా అండగా వుంటానని హామీ కూడా ఇచ్చారు. నిర్మాణానికి వున్న చట్టబద్ధతను సూటిగా ప్రశ్నించారు. తాను ఏ వర్గానికి వ్యతిరేకిని కానని, అయితే.. అనుమతి లేకుండానే 2010లో నిర్మాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికార నిర్మాణం పూర్తైపోయిందని దుయ్యబట్టారు.2012లో జరిగిన విచారణ సమయంలో దీనికి సమ్మతి రాలేదని, అయినా 2019 నాటికి మరో నాలుగు అంతస్తులు కూడా అక్రమంగా కట్టడం పూర్తైందని మండిపడ్డారు. 2010లో వ్యాజ్యం పెండింగ్‌లో వున్నప్పుడు నాలుగు అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మించారు? పరిపాలన అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ చట్ట విరుద్ధ పనులను అధికారులు అస్సలు పట్టించుకోలేదని మండిపడ్డారు. 6,357 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికారిక నిర్మాణాలు జరిగాయని, మసీదును నిర్మించిన భూమి అంతా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
అక్రమ వలసదారులు సిమ్లాలోని సంజౌలి మసీదులోనే తిష్ఠ వేశారన్న వార్తలూ వస్తున్నాయి. 50 నుంచి 100 మంది అపరిచితులు అక్కడ తలదాచుకుంటున్నట్లు స్థానికులే ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎలా వుందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు లేకుండానే బయటి వ్యక్తులు యథేచ్ఛగా అక్కడ తిరుగుతున్నారు. ఈ విషయం కూడా స్థానిక హిందువుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంపై అక్కడి గ్రామీణాభివృద్ధి మంత్రి అనిరుధ్ సింగ్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఈ అపరిచితులతో స్థానిక మార్కెట్ లలో మహిళలకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని, మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిచితులు, అక్రమంగా నివాసముండే వారి వద్ద సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వెంటనే బయటికి పంపించాలని కూడా హిందువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తూ.. రాష్ట్రంలోని శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని బయటికి పంపాలని డిమాండ్ చేస్తూ హిందువులు రోడ్లపైకి వచ్చారు.
అక్రమంగా నిర్మిస్తున్న రెండంతస్తులు కూల్చేయండి… కోర్టు ఆదేశాలు
హిమాచల్ ప్రదేశ్ లోని సంజౌలీ మసీదు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మసీదులో అక్రమంగా నిర్మిస్తున్న రెండు అంతస్తుల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని మసీదు నిర్వాహకులకు గడువు విధించింది. తీర్పు వెలువరించేంత వరకూ మసీదును సీల్ చేయాలని కమిషనర్ ఇంతకుముందు ఆదేశాలిచ్చారు. దీంతో హిందువులకు కొంతలో కొంత విజయం వరించిందని అనుకోవచ్చు. కానీ… అక్కడి హిందువులు చేసిన పోరాట పటిమ, ఐకమత్యం అందరికీ స్ఫూర్తినిచ్చింది.
మరోవైపు అత్యంత వివాదాస్పదమైన ఈ మసీదుకి సుదీర్ఘమైన చరిత్ర వుంది. 1947 కి ముందు.. ఇది తాత్కాలిక నిర్మాణమే. 2010 లో శాశ్వతమైన మసీదు నిర్మాణం ప్రారంభమైంది. దీంతో స్థానికంగా నిర్వాసితులైన వారి నుంచి అనేక ఫిర్యాదులు రావడం ప్రారంభమైంది.దీంతో అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. న్యాయశాఖ పరిధిలో వున్నా… 2024 నాటికి ఐదంతస్తుల నిర్మాణం పూర్తైంది. అక్రమ నిర్మాణాలను నిలిపేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. 2023 లో మున్సిపల్ కార్పొరేషన్ మసీదుకి సంబంధించిన మరుగుదొడ్లను కూల్చేయడం ప్రారంభించింది.దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
అయితే ఈ కేసుపై సెప్టెంబర్ 7 న విచారణ జరిగింది. ఆ సమయంలోనే వక్ఫ్ బోర్డు యాజమాన్య పత్రాలను సమర్పించింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5 కి షెడ్యూల్ చేసింది. మరియు వివాదాస్పద నిర్మాణం విషయంలో తాజా పరిస్థితిపై తమకు నివేదిక సమర్పించాలని సంబంధిత జేఈని కోర్టు ఆదేశించింది. మరోవైపు మసీదు ఇమామ్ ఈ అక్రమ నిర్మాణాన్ని సమర్థించాడు. 1947 కి ముందు తాత్కాలిక రెండతస్తుల భవనంగా వుండేదని, మొదట్లో మసీదు తాత్కాలికమైందని, ప్రార్థనలు బయట చేసేవారని, దీంతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.దీంతో విరాళాలు సేకరించామని, మసీదు నిర్మాణం ప్రారంభమైందని వివరించాడు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని తెలిపాడు.