సంభాల్ హనుమాన్ దేవాలయానికి వస్తున్న అశేష భక్తులు
సంభాల్ లో 46 సంవత్సరాల తర్వాత తెరుచుకున్న భస్మ శంకర్ ఆలయంలోని హనుమంతుడికి భక్తులు పూజలు చేస్తున్నారు. ఇందు కోసం అశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవాలయం ప్రారంభం కావడంతో ఆలయాన్ని శుభ్రం చేశారు. ఉదయం నాలుగు గంటలకే దేవాలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసాను పఠించారు. అదే విధంగా ఆలయ గర్భగుడిలోని పరమ శివుడ్ని కూడా అందంగా అలంకరించారు. మరోవైపు ఆలయానికి ఎదురుగా వున్న ఇంటిని ఆక్రమణగా ప్రకటిస్తూ అధికారులు మార్కింగ్ కూడా చేశారు. దీనిపై ఆ ఇంటి బాధ్యులు కూడా స్పందించారు. త్వరలోనే తమ ఇంటిని తొలగిస్తామని ప్రకటించాడు. ఈ ఆలయం 1978 లో మూతపడింది. ఇటీవల ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులకు ఈ ఆలయం కనిపించింది. దీంతో దీనిని తెరిచారు. ఇక్కడ ఓ బావి కూడా వుంది. తవ్వకాలు జరపగా పార్వతీ విగ్రహం, గణేషుడి విగ్రహం, లక్ష్మీ ప్రతిమలు లభించాయి.