న్యూజిలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధనా తరగతులు ప్రారంభం

హిందూ సంస్కృతిని, విద్యను ప్రోత్సహించే దిశగా న్యూజీలాండ్ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోటోరాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఆ తరగతులు జరుగుతున్నాయి. పిల్లలకు, పెద్దలకూ హిందూ ధార్మిక గ్రంథాల గురించి సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు సంస్కృత శ్లోకాలు, మంత్రాలు కూడా నేర్పిస్తారు. ఈ తరగతులకు ఎవ్వరైనా హాజరు కావచ్చు. హిందూ సంస్కృతి గురించి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే చాలు. ఈ కార్యక్రమాన్ని జులై 21న జరిగిన గురుపూర్ణిమ వేడుకల సందర్భంలో ప్రారంభించారు.
ఈ తరగతులు తీసుకునేది ఈశ్వరీ వైద్య. ఆమె వృత్తి రీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్. తన తల్లిదండ్రుల దగ్గర బాల్యం నుంచీ నేర్చుకున్న విషయాలను ఇప్పుడు ఈ తరగతి గదిలో బోధిస్తారు. ఈశ్వరి ప్రస్తుతం జాన్ పాల్ కాలేజ్‌లో గణితం, సైన్స్ బోధిస్తున్నారు. హిందూ సంస్కృతి గురించి బోధించాల్సిన ప్రాధాన్యతను ఆమె ఇలా వివరించారు… ‘‘మా అమ్మ ఐదు నుంచి పన్నెండేళ్ళ పిల్లలకు సంస్కృతం నేర్పించేవారు. నేను పెరుగుతున్న దశలో సంస్కృత శ్లోకాలు నేర్చుకునేదాన్ని, మంత్రాలు వల్లెవేసేదాన్ని. నాకున్న జ్ఞానాన్ని తరువాతి తరాలకు అందించే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టం’’.
హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజీలాండ్ అధ్యక్షుడు డాక్టర్ గుణ మగేసన్ ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచారు. ఈ తరహా తరగతులు మొదలుపెట్టాలని తాము ఎప్పటినుంచో అనుకుంటున్నామని చెప్పారు. ఈ తరగతులను త్వరలోనే న్యూజీలాండ్‌లోని ఇతర నగరాలకు కూడా వ్యాపింపజేసే సమర్ధత ఉందని, హిందూ విద్య గురించి అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోందనీ చెప్పుకొచ్చారు.హిందూ ధర్మగ్రంథాల గురించి ప్రాథమిక తరగతులను హిందూ జనాభా గణనీయంగా ఉన్న ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేయాలనే విస్తృతమైన లక్ష్యంలో భాగంగా న్యూజీలాండ్‌లో మొదలుపెట్టారు.
ఉదాహరణకు, అమెరికాలో ఎన్నో హిందూ దేవాలయాలూ, సాంస్కృతిక సంస్థలూ ఉన్నాయి. అక్కడి హిందువులు తమ తర్వాతి తరాలకు తమ సాంస్కృతిక సంపద గురించి తెలియజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలను అక్కడి సంస్థలు ఇప్పటికే చేపట్టాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా హిందూ విద్యా కార్యక్రమాలు పెరిగాయి. ప్రత్యేకించి హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న లండన్ వంటి నగరాల్లో ఈ కార్యక్రమాలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాలను చూస్తుంటే, విదేశాల్లో హిందూ సంస్కృతిని, హిందూ నైతిక విలువలను పరిరక్షించడం, భవిష్యత్ తరాలను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా భారతీయ డయాస్పోరాను ప్రోత్సహించడానికీ జరుగుతున్న ప్రయత్నాలు. ఇటువంటి ప్రయత్నాలకు విశేష ఆదరణ లభిస్తోంది. దాన్ని గమనిస్తే.. హిందూ ధర్మశాస్త్రాల తరగతులకు ప్రజాదరణ మరింత ఎక్కువ పెరుగుతుంది. సనాతన ధర్మపు వారసత్వాన్ని తరువాతి తరాలకు చేర్చే గొప్ప కృషిలో భాగస్వాములకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *