రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దమే : అప్పాల ప్రసాద్
రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దమని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. సమర్థవంతమైన ప్రధాని నరేంద్ర మోదీ అని, ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. కరీంనగర్ పట్టణంలో గురువారం ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ నేతలు, హిందువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ..పాక్ లో వున్న ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరుతో ధ్వంసం చేసిన దేశం భారత్ అని, మిస్సైల్స్, డ్రోన్లను అత్యంత అధునాత సాంకేతికతతో భారత సైన్యం వాటన్నింటినీ తుత్తునీయలు చేసిందన్నారు. భారత పాటవాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనేది ఓ ఝలక్ మాత్రమేనని, ట్రయల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో పీఓకేను కూడా తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో టీమ్ వర్క్ అంటే ఏమిటో ప్రపంచం చూసిందని, త్రివిధ దళాలు, ప్రధాని మోదీ, రక్షణ, హోం మంత్రి అందరూ కలిసి టీమ్ వర్క్ గా, సమన్వయంతో పనిచేశారన్నారు.తరుచూ హిందువులను తిట్టే హైదరాబాద్ ఎంపీ ఒవైసీ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులను తిడుతున్నారని, ఇంతటి సందర్భాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చారన్నారు. ఇప్పటి వరకు హిందువులను విమర్శించే వారు, ఇబ్బందిపెడుతున్నవారు, రాళ్లు విసురుతున్న వారి గుండెల్లో కూడా దేశభక్తి వచ్చిందని, సరిహద్దుల్లో సైనికుల పాటవాలు, పంథా ఏమిటో, ప్రతిభ ఏమిటో ప్రపంచానికి చూపించామన్నారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్ మామూలుది కాదని, ఓ వ్యూహాత్మక, రక్షణాత్మక ఆపరేషన్ అని, నాలుగు రోజుల్లోనే ఏం చేయాలో ఓ యోజనా బద్ధంగా ఆపరేషన్ కొనసాగిందన్నారు. పహల్గాంలో మతం అడిగి మరీ, ఉగ్రవాదులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత డ్రోన్లు, రఫేల్ విమానాలు, చక్ర వ్యూహాలను పాక్ ఆపలేకపోయిందని, తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. దయచేసి యుద్ధం ఆపండని అడుక్కున్నారు కాబట్టే ఆపరేషన్ ఆపామని, లేదంటే పాక్ లో ఏ నగరాన్నైనా ధ్వంసం చేసే శక్తి భారత్ కి వుందన్నారు. మరోవైపు అగ్నివీర్ యోధులు కూడా పాక్ డ్రోన్లను ధ్వంసం చేసేశారన్నారు. భారత పాటవాన్ని చూపి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయని తెలిపారు. నేడు దేశంలో ధైర్యం కలిగిన ప్రధాని వున్నారన్నారు. అందరూ క్షేమంగా వున్నారంటే దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల వల్లేనని అన్నారు. తమ చావును సైతం లెక్క చేయకుండా పహారా కాస్తున్నారని ప్రశంసించారు.
హిందుత్వం అంటే ఉన్మాదం కాదని, విశ్వాసం కలిగించే స్థితి అని అప్పాల ప్రసాద్ తెలిపారు.ఇంట్లొ మాత్రమే కులం అని, బయటికి వచ్చిన తర్వాత అందరమూ హిందువులమేనని అన్నారు. భారత్ లో వైవిధ్యం వున్నా, భేద భావాలున్నా… భారత్ మాతాకీ జై అంటే అందరూ జై అని నినదిస్తారని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్మించిన దేశం భారత్ అని అన్నారు. వేదాలు వచ్చిన సమయంలో ఏ మతమూ ఈ భూమి మీద లేదన్నారు. అందరికీ అన్నాన్ని, జ్ఞానాన్ని పంచే దేశమని అన్నారు. ఒకప్పుడు గోధుమల కోసం ఇబ్బంది పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచానికి అన్నం పెడుతోందన్నారు. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లను పంపిన దేశమన్నారు. ప్రపంచంలో మూడో స్థానం చేజిక్కించుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని, ఇందుకు కేవలం ప్రధాని మోదీయే పని చేస్తే కుదరదని, ప్రజలందరూ దేశం కోసం పనిచేయాలన్నారు. ఈ ప్రయత్నం దేశంలో జరగాలని, అందుకే హిందూ ఏక్తాయాత్ర అని తెలిపారు. ఇది విద్వేషం కోసం జరిపే యాత్ర కాదని, అందరూ ఒక్కటేనన్న ఆదర్శాన్ని పంచడానికే ఏక్తాయాత్ర అని అప్పాల ప్రసాద్ తెలిపారు.