ఆలయ కేంద్రంగా బలమైన ఆర్థిక వ్యవస్థ..

ఒక లక్ష్య సాధన దిశగా ప్రజలను ఏకతాటిపై నడిపించాలంటే ధర్మం (మతం) ఆధారంగా వారికి మార్గదర్శనం చెయ్యాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. నేటి కాలంలో అందుకు నిలువెత్తు నిదర్శనంగా అయోధ్య రామమందిరం నిలిచింది. ధర్మం కేంద్రంగా వచ్చిన పిలుపునకు ప్రజలు శిరసావహించిన ఫలితంగా అయోధ్యలో సాక్షాత్కరిస్తున్న ఆ భవ్య రామమందిరం ఈనాడు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఊతమై నిలిచింది. మందిర నిర్మాణం తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రత్యేకించి అయోధ్య క్షేత్రంలో ‘‘కనక ధార’’ కురుస్తోందంటూ IIM లక్నో విడుదల చేసిన నివేదికలోని అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం…

IIM లక్నో అధ్యయనం ప్రకారం ఆలయ నిర్మాణానికి ముందు అయోధ్య అంటే తీర్థయాత్రా స్థలంగా మాత్రమే గుర్తింపు ఉండేది. సందర్శకుల సంఖ్య దాదాపుగా 1.7 లక్షలుగా ఉండేది. స్థానిక మార్కెట్లు, దుకాణాల ఆదాయం కూడా రోజుకి రూ.400 నుంచి రూ.500 మాత్రమే.. సరైన ఉపాధి దొరక్క కూలీలు పనికోసం పక్క ఊళ్ళకు వెళ్లేవారు. నూతన దేవాలయ నిర్మాణానికి పూర్వం జాతీయస్థాయి హోటళ్లు కూడా తక్కువే.. ప్రయాణ సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే.. నాడు అయోధ్య రైల్వే స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు కూడా పరిమితం. ఇక విమానాశ్రయం ఊసే లేదు. రియల్ ఎస్టేట్ కూడా స్తబ్దుగా ఉండేది.

ఇక అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ట తర్వాత అక్కడి ఆర్థిక పరిస్థితులు అత్యంత సానుకూలంగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్యకు రోజుకు 2 లక్షల మంది వరకూ సందర్శకులు వస్తున్నారు. దీంతో స్థానిక మార్కెట్, రవాణా, ఆతిథ్య రంగాలకు కొత్త జవసత్వాలు వచ్చాయి. సుమారు 85 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలోఉన్నాయి. దీని ప్రభావం మౌలిక సదుపాయాలకే కాకుండా పెట్టుబడి, సేవా రంగాలకు కూడా విస్తరించింది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్, విస్తరించిన రోడ్లు, నగర సుందరీకరణ… ఇలాంటి ప్రాజెక్టులతో విస్తృతంగా అభివృద్ధి పుంతలు తొక్కుతోంది. మరోవైపు ఎలక్ట్రికల్ వాహనాలు, సౌరశక్తి వంటిని కూడా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఓ రకంగా అయోధ్య ‘‘మోడల్ సోలార్ సిటీ’’గా అభివృద్ధి చెందుతోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, ఆలయ నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరుగగా అందులో అయోధ్యదే అధిక భాగం. 2025 నాటికే యూపీలో పర్యాటక వ్యయం 4 లక్షల కోట్లు దాటిందని, పర్యాటక ఆధారిత కార్యకలాపాల నుంచి ఆదాయం 25 కోట్ల వరకూ చేరిందని అంచనా. నిర్మాణ, రవాణా, ఆతిథ్య, సేవారంగాలల్లో ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా పెరిగి జాతీయ, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య కొత్త గుర్తింపు పొందింది. అయోధ్యలో సుమారు 150కి పైగా కొత్త హోటళ్లు, హోమ్ స్టేలు స్థాపించారు. తాజ్ హోటల్స్‌తో పాటు వివిధ రకాల ఇంటర్నేషనల్ హోటల్స్, రిసార్టులు కూడా తాము అయోధ్యకు సైతం విస్తరిస్తామని ప్రకటించాయి. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో అయోధ్య బుకింగ్‌లు నాలుగు రెట్లు పెరిగాయి. స్థానిక హస్తకళలు, మతపరమైన సావనీర్లు, విగ్రహాలకు డిమాండ్ కూడా పెరిగింది, ఇది చేతివృత్తులవారికి, స్థానిక ఉత్పత్తిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

అయోధ్యలో ఉద్యోగాల కల్పనలో కూడా గొప్ప వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా యువతరం ద్వారా దాదాపు 6 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఏర్పాటు అయ్యాయి. పర్యాటక వృద్ధి వల్ల రాబోయే 4–5 సంవత్సరాలలో పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలలో దాదాపు 1.2 లక్షల ప్రత్యక్ష – పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారుల రోజువారీ ఆదాయం ₹2,500కు చేరుకుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా వృద్ధి చెందింది, ఆలయం చుట్టూ ఉన్న ఆస్తి విలువలు ఐదు నుండి పది రెట్లు పెరిగాయి. సంప్రదాయ ధార్మికతను ఆధారంగా చేసుకొని అభివృద్ధి నమూనాలను తయారు చేస్తే, కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని అయోధ్య నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *