హిందూశంఖారావం – మా ఆలయాలు మాకు అప్పగించండి

జనవరి 5, 2025, విజయవాడకు సమీపంగా, గన్నవరం విమానాశ్ర యానికి చేరువలో ఉన్న కేసరపల్లి ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది.  ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా సాగింది హిందూశంఖారావం కార్యక్రమం.

 గంటగంటకు పెరిగిన హిందూ బంధువుల సంఖ్య, అందరిలోనూ స్ఫుటంగా కనిపించిన ధర్మరక్షణ దీక్షకు సంసిద్ధత ఈ కార్యక్రమ ప్రత్యేకతలు. వృద్ధులు పెద్ద సంఖ్యలో సమ్మేళనానికి ఓపికగా వచ్చారు. ఉర్రూతలూ గించే సాధువుల, పీఠాధిపతుల, ఆధ్యాత్మికవేత్తల ఉపన్యాసాలు, వాటికి ఉప్పొంగిన జనసందోహం ‘జైశ్రీరామ్‌’ అంటూ స్పందించిన తీరు అపూర్వం. ధర్మానికి జరుగుతున్న అపచారాల గురించి స్వాములు ఏకరువు పెడుతుంటే ఆవేశంతో ‘భారత్‌ మాతాకీ జై’ వినిపించిన ఘోష అనిర్వచనీయం. హిందువులలో ఐక్యమత్యానికి మించి ఏర్పడుతున్న ఏకత్వానికి ఈ ముక్తకంఠంతో వెలువడిన నినాదాలు సాక్ష్యం పలికాయి.

 అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి శ్రీ గోవిందదేవ్‌ గిరి మహరాజ్‌ ముఖ్య అతిథిగా వేంచేశారు. విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముఖ్యవక్తగా శ్రీ శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి పాల్గొన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ కమలానంద భారతి సహా 150కి పైగా సాధుసంతులు వేదికను అలంకరించారు.  విశ్వహిందూ పరిషత్‌ అఖిలభారత అధ్యక్షులు శ్రీ అలోక్‌ కుమార్‌, అఖిల భారత సంస్థాగత కార్యదర్శి శ్రీ మిలింద్‌ పరాండే, అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ, పాల్గొన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ కార్యకారిణి సదస్యులు వై.రాఘవులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీ గేయరచయిత అనంత్‌ శ్రీరామ్‌, కొండవీటి జ్యోతిర్మయి, వీ హెచ్‌పీ ఆంధ్రప్రదేశ్‌ నాయకులు తనికెళ్ల సత్యరవికుమార్‌ సాధుసంతులకు, శంఖారావానికి విచ్చేసిన అశేష హిందూ బంధువులకు ఘనస్వాగతం పలికి, సభను నిర్వహించారు.

మధ్యాహ్నం 12.30కు ప్రారంభమై సాయంత్రం ఐదుగంటల వరకు స్వామీజీలు సందేశాలు వినిపించారు. తరువాత హైందవ శంఖారావం డిక్లరేషన్‌ను వేదిక నుంచి వినిపించారు. దీనికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. తరువాత భరతమాతకు హారతి ఇచ్చి, సభను ముగించారు.

శంఖారావం డిక్లరేషన్‌ హిందూ సమాజ ఆత్మ గౌరవానికి సంబంధించిందని వేరే చెప్పనక్కరలేదు. చరిత్ర సాక్షిగా శతాబ్దాలుగా హిందూ దేవాలయాల మీద, ధర్మం మీద, హిందువుల మీద సాగుతున్న దాడులు, వివక్ష, జరుగుతున్న అన్యాయాలు ఇకపై సాగవని డిక్లరేషన్‌ ‘సెక్యులర్‌’ ప్రభుత్వాలను హెచ్చ రించింది. అందుకే ఇది చరిత్రాత్మకం. అయోధ్య ఆలయం కోసం పోరాడాం. న్యాయపోరాటంలో గెలిచి భవ్యమందిరం కట్టుకున్నాం. ఇప్పుడు అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మిగిలిన ఆలయాలను కూడా మనమే నిర్వహించుకోవాలి. మనం కట్టుకున్నాం వాటిని, మనమే నిర్వహించు కుందాం అని ప్రకటించింది డిక్లరేషన్‌. ఇది హిందువులను మరొక ఆత్మ గౌరవ పోరాటం దిశగా వేగంగా అడుగులు వేయించ గలిగిన స్ఫూర్తిని అందించేదే.

తొమ్మిది అంశాలు ఇవి:

1.హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి.

2. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసే లోగా, దేవాలయా లలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.

3. హిందూ దేవాలయాలలో, ఆ ఆలయాలు నిర్వహిస్తున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలి.

4.హిందూ దేవాలయ ట్రస్టు బోర్డులలో, హిందూ ధర్మంపై శ్రద్ధా భక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి.

5.హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని, వెంటనే చర్యలు చేపట్టాలి.

6.హిందూ దేవా లయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించరాదు.

7.హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తు లపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రభుత్వం ,ప్రజా ప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకూడదు. దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని, శిక్ష పడేలా చూడాలి.

8.వినాయక చవితి, దసరా, హనుమజ్జయంతి వంటి ఉత్సవాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు, ఆర్థిక భారాన్ని విధించరాదు. ఈ ఉత్సవాలకు ముందుగా ప్రభుత్వం హిందూ సమాజ ప్రతినిధులైన హిందూ ధార్మిక పెద్దలతో, ధార్మిక సంస్థలతో కలిసి కూర్చుని మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు చేయాలి.

9.హిందూ దేవీదేవతల ఊరేగింపులు, శోభా యాత్రల మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు విధించరాదు.

  ఆలయాల రక్షణ ఆరంభం కావాలి. ఆలయాలు మా పూర్వి కులు నిర్మించారు. ఇప్పుడు మేం నిర్వహించుకుంటాం అని చెబుతున్న హిందూ సమాజం. దీనికి ప్రభుత్వాలు అంగీకరించాలి. దశల వారీగా హిందూ సమాజం కోరికను తీర్చే ప్రయత్నం ఆరంభించాలి. విజయవాడ డిక్లరేషన్‌ ఇదే గుర్తు చేస్తున్నది. హిందూ బంధువులు ఈ డిక్లరేషన్‌ను నిత్యం స్మరించు కోవాలి. ఇందుకోసం జరుగుతున్న, జరగబోయే పోరాటాలలో భాగస్వాములు కావాలి.

ఈ పోరాటానికి హిందూ శంఖారావం నాంది పలికింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ అన్ని జిల్లాల నుండి దాదాపు మూడు లక్షల మందికి పైగా హిందువులు పాల్గొన్నారని అంచనా. కొందరు ఆరులక్షలని అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *