కెనడాలో హిందూ దేవాలయంఫై మరోసారి దాడి… గోడలఫై మోదీ వ్యతిరేక రాతలు
కెనడాలోని ఖలిస్తానీ అతివాదులు హిందూ దేవాలయాలను, సనాతన ధర్మాన్ని నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ దేవాలయాన్ని విధ్వంసం చేయడమే కాకుండా… గోడలపై భారత వ్యతిరేక రాతలు రాస్తూ గ్రాఫిటీ పెయింట్ వేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. వీరు హిందూ ఉగ్రవాదులంటూ రాసుకొచ్చారు. ఈ చర్యలను అక్కడి విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా వున్న హిందూ సమాజంపై విద్వేషం పెంచే వారిపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హద్దులు మీరిపోతున్నారని తీవ్రంగా దుయ్యబట్టింది.
మరోవైపు స్వామి నారాయణ టెంపుల్ విధ్వంసం, భారత వ్యతిరేక రాతలపై భారత సంతతి ఎంపీ చంద్ర మౌర్య తీవ్రంగా ఖండించారు . స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి జరిగిందన్నారు. ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇలాంటి ట్రాఫిట్ రాయడం ఇదేమీ మొదటిసారి కాదన్నారు. కొన్నేళ్లుగా గ్రేటర్ టొరంటో, బ్రిటీష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రాంతాల్లో వున్న హిందూ దేవాలయాలపై విద్వేషపూరిత గ్రాఫిటీలతో విధ్వంసాలకు దిగుతున్నారని మండిపడ్డారు.
అయితే.. ఇలా హిందూ దేవాలయాలను ఖలిస్తానీ అతివాదులు దాడులు చేయడం ఇదేమీ ప్రథమం కాదు. గతంలోనూ జరిగాయి. గతేడాది జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన విషయం తెలిసిందే. దీని తర్వాత ఖలిస్తానీ అతివాదులు కెనడాలో నిరంతరం హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో భారత్, కెనడా మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి.