విశ్వ కళ్యాణం కోసమే హిందూత్వం

2021, డిసెంబర్‌ 28న ఒక సమావేశంలో ప.పూ. సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశం


నేడు సర్వత్ర ‘హిందూత్వం’ గురించిన చర్చ సాగుతోంది. ఆ చర్చలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని :

– ‘‘హిందువులు ఉండాలి. కానీ హిందూత్వం అవసరం లేదు!’’

–  ‘‘హిందూత్వం మంచిదే. కానీ హిందుత్వ వాదులు సరైనవారు కారు!’’

–  ‘‘వివేకానందుని హిందూత్వం సరైనదే. కానీ సంఘ హిందూత్వం మంచిది కాదు’’

–   గాంధీజీ హిందూత్వం సరైనది.

ఈ వాదోపవాదాలన్నీ సాధారణ హిందూ సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. విషయం పట్ల పూర్తి అవగాహన, జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతోంది. అయితే కొందరు సమాజంలో గందరగోళాన్ని, అవగాహనా రహిత్యాన్ని మరింత పెంచాలనే ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి వాదాలను లేవనెత్తుతుంటారు. అలాంటి వారికి హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూత్వం గురించి ఎలాంటి ఆసక్తి, సదుద్దేశ్యం ఉండవు. వారికి కావలసినది కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. వర్తమాన రాజకీయాలలో సంఘ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వారు పొరబడుతుంటారు. ఆ దురభిప్రాయం వల్లనే ప్రతి విషయాన్ని సంఘకు ముడిపెట్టి చూస్తుంటారు, మాట్లాడుతుంటారు.

మొదట వాళ్ళు ‘హిందూ తీవ్రవాదం’ అనే పదాన్ని ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారం వారికే నష్టదాయకంగా పరిణమించింది. ఈ ప్రచారాన్ని మొత్తం హిందూ సమాజం ముక్తకంఠంతో నిరసించింది, వ్యతిరేకించింది. దానితో వాళ్ళు ఇప్పుడు ‘హిందూత్వం మంచిదే, కానీ సంఫ్‌ు కాదు’ అంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితిలో ‘హిందూ’ అంటే ఏమిటి అనే విషయంపై స్పష్టమైన అవగాహన అవసరం.

నిజానికి హిందూ అనే పదానికి కచ్చితమైన, స్పష్టమైన నిర్వచనం, అర్ధం చెప్పడం కష్టమే. ముఖ్యంగా బయట ప్రపంచానికి హిందూ, హిందూత్వం గురించి చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే వారికి ‘భిన్నత్వంలో ఏకత్వం’ అర్ధం కాదు. ఒక ప్రవక్త, ఒక పుస్తకం, కొన్ని నిబంధనలు, ఒక దేవుడు, ఒక భాష ఉంటే వారికి అర్ధమవు తుంది. కానీ ఇక్కడ వివిధ భాషలు, దేవతలు కనిపించేసరికి వారికి అర్థంకాదు.

హిందూ అనే పదం ప్రాచీన కాలం నుంచి వచ్చినది కాదన్నది నిజం. తరువాత మనకు ఆ పేరు వచ్చింది. బయటి వారు ఆ పేరు పెట్టి ఉండవచ్చును. అయితే ఆ పేరు ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు అన్నవి పెద్ద విషయాలు కావు. ఎందుకంటే మనకు మన పెద్దలు పేర్లు పెడతారు. అవి మనల్ని అడిగి పెట్టరు. కానీ మనకు ఇష్టమైన, కాకపోయినా ఆ పేర్లతోనే మనం జీవనం సాగిస్తాం. అలాగే హిందూ అనేది మన పేరు అయింది,

ఉత్తరం యత్‌ సముద్రస్య, హిమాద్రెశ్చైవ దక్షిణం

వర్షం తద్‌ భారతం నామ భారతీ యత్ర సంతతి

మరియు

హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం

తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్ష్యతే

వంటి శ్లోకాలు పురాణాల్లో కనిపిస్తాయి. ముస్లిం దురాక్రమణ ప్రారంభం కానంత వరకు హిందూ అనే పదం జనసామాన్యంలో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటివరకూ ఎన్నడూ లేని రీతిలో ఆ దురాక్రమణ సాగింది. దురాక్రమణ దారులు ఇక్కడ ఉన్న జీవన విధాన్ని మార్చేయా లనుకున్నారు. పూజపద్దతిని కాదన్నారు. కాఫిర్‌ (ముస్లిమేతరులు)లను తమ మతానికి (ఈమాన్‌) మార్చడమే వారి లక్ష్యం. అందుకే వాళ్ళు కేవలం సంపద కోసం మాత్రమే దాడి చేయలేదు.

‘హిందూ’ అనే పదం పూజా పద్దతి లేదా ఒక మతగ్రంధాన్ని సూచించేదికాదు. అనేక ఏళ్లుగా ప్రచారంలో ఉన్న అపోహల మూలంగా హిందూ అంటే పూజాపద్దతి లేక ఆహార పద్దతి అని పొరబడుతున్నాము. ఫలానా పూజా పద్దతి కలిగిన వాడు హిందువు, ఫలానా ఆహారం తినేవాడు హిందువు అని మనం భ్రమపడు తున్నాం. నిజానికి హిందూ అనేది మన అస్తిత్వం, గుర్తింపు. అది మన జాతీయతను తెలిపే పేరు. భారతదేశంలో నివసించేవారి గుర్తింపు ‘హిందూ’.

వారి (పాశ్చాత్యులు) దగ్గర శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం చాలానే ఉంది. బాహ్య ప్రపంచాన్ని వాళ్ళు ముక్కలు, ముక్కలుగానే చూస్తారు. అందులో వారికి ఏకత్వం కనిపించదు.అర్ధకామాలు కావాలనుకుంటే మోక్షసాధన సాధ్యపడదు. అలాకాదు, మోక్షం కావాలనుకుంటే అర్ధకామాలు లభించవు. వీటన్నింటినీ కలిపి సాధించే అంశం ఏది వారికి తెలియదు.

ఉన్నది ఒకటే సత్యం. కాబట్టి బయటకు కనిపించే స్వరూపాలు అన్నీ ఆ సత్యానికి ప్రకటికరణ మాత్రమే. ‘ఆత్మవత్‌ సర్వభూతేషు’ (అన్నింటిలోని ఆత్మ స్వరూపం ఒక్కటే). ఈ విషయాన్ని అంగీకరిస్తే అప్పుడు సంఘర్షణకు తావేలేదు. ‘బలమున్నవాడిదే జీవనం’, అస్తిత్వానికై సంఘర్షణ వంటివి ఉండవు. దానికి బదులు సమన్వయం, సహకారం ఏర్పడతాయి. అన్నిటా ఉన్నది అదే ఆత్మ కాబట్టి ఒకరిది పైచేయి అనే మాటే ఉండదు. ఒకరు ఏదైనా కోల్పోతే నాకూ నష్టమే. నేను ప్రగతి సాధిస్తే ఇతరులకు కూడా లాభమే. అటువంటిదే నిజమైన ప్రగతి. మన ఋషులు, మునులు ఈ శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి తాము వేరు అనుకునే వారికి ఈ సత్యాన్ని బోధపరచాలి. ఈ జ్ఞానాన్ని అందరికీ కలిగించాలంటే అది కేవలం కొందరు వ్యక్తులవల్ల సాధ్యపడదు. మొత్తం జాతి అందుకు పూనుకోవాలి. అందుకనే మన ఋషులు గొప్ప తపస్సు ద్వారా మన దేశాన్ని, జాతిని రూపొందించారు.  శాశ్వతమైన నియమాలనే ‘ధర్మం’ అంటారు. హిందూత్వం ఎవరికి నష్టం చేయదు. అందువల్ల ‘హిందూ తీవ్రవాదానికి’ అవకాశమే లేదు. అలాగే హిందూ మతతత్వవాదులు ఎక్కడా ఉండరు. అది అంతా కల్పితం, లేదా భ్రమ. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వాదాలు, అభిప్రాయాలూ ప్రచారం చేస్తున్నారు. ‘అందరికీ అభివృద్ధి, ప్రగతి’ అని హిందూత్వం కోరుకుంటుంది. సత్యం, కరుణ, సుచిత (స్వచ్ఛత), తపస్సు అనే నాలుగు అంశాలు కలిగిన ధర్మం ద్వారా ఇది సాధించడానికి వీలవుతుందని భాగవతం చెపుతోంది. కనుక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి, ఆ సత్య మార్గంలోనే వెళ్ళాలి. స్థూలమైన ఈ తత్వాన్ని మన పెద్దలు మనకందించారు. దాని ఆధారంగా ఏర్పడిన అనేక ఆచారాలు తరతరాలుగా అనుసరిస్తూ వస్తున్నాం. ఈ సంప్రదాయం మన కుటుంబ వ్యవస్థ ద్వారా కొనసాగింది. ఇలా మన సంస్కృతి రూపుదిద్దుకుంది. ఒక సమాజపు స్వభావం ఆ సమాజపు ప్రజల ప్రవర్తన తీరువల్ల నిర్ధారితమవుతుంది. మన మాతృభూమి భారత్‌, ఈ అఖండ భారత్‌ పట్ల మన అకుంఠితమైన నిష్ట. ఈ ధర్మాన్ని, సంస్కృతిని, హిందూ సమాజాన్ని పరిరక్షించడం మన కర్తవ్యం.

‘వసుధైవకుటుంబకం’ అనే భావనను సాకారం చేసుకునేందుకు వివక్ష లేని, స్వేచ్ఛాయుత జీవనం హిందువు గడపగలగాలి. ఈ పని చేయగలగడమే ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించడం అవుతుంది. కాబట్టి హిందుత్వపు అర్ధం ప్రపంచ సంక్షేమం (విశ్వ కళ్యాణం). హిందూత్వం అంటే హిందూ సమాజ సంఘటన. భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *