కమర్షియల్ కాంప్లెక్స్ కోసం పాక్ లో హిందూ దేవాలయం కూల్చివేత
పాకిస్తాన్‌లో వున్న ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చేశారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లండీ కోతాల్ బజార్‌లో వున్న ఆలయాన్ని కూల్చేశారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో వున్న ఈ ఆలయాన్ని ‘‘ఖైబర్ టెంపుల్’’ అని కూడా పిలుస్తారు.ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమే పవిత్రమైన హిందూ దేవాలయాన్ని కూల్చేశారు. దేశ విభజన జరగక ముందు నుంచీ ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం వుంది. దీంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిందువుల మనోభావాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా 15 రోజుల క్రితం నుంచే దేవాలయాన్ని కూల్చి, కమర్షియల్ భవన నిర్మాణాన్ని ప్రారంభించేశారు.
పైగా అక్కడ దేవాలయం వున్నదని, దాని ఉనికే తమకు తెలియదని అధికారులు బుకాయిస్తున్నారు. నిబంధనల ప్రకారమే అంతా జరుగుతోందని అంటున్నారు. దేవాలయం కూల్చివేతపై స్థానికంగా వుండే ఆదివాసీ జర్నలిస్టు షిన్వారీ తీవ్రంగా తప్పుబట్టారు. రికార్డుల్లో దేవాలయం లేదని అధికారులు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి ఈ ఖైబర్ దేవాలయంగా పేరు గాంచిందని తెలిపారు. 1992 లో భారత్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా స్థానికంగా వుండే ముస్లిం మత పెద్దలు ఈ దేవాలయాన్ని పాక్షికంగా కూలగొట్టారని వెల్లడిరచారు.