జోథాతో అక్బర్ పెళ్ళి జరగలేదు.. రాణా ప్రతాప్ సంధికి రాలేదు: రాజస్థాన్ గవర్నర్

అక్బర్‌కు సంబంధించిన చరిత్రలోని ఒక అంశంపై రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబావ్‌ బగాడే కీలక సమాచారాన్ని వెల్లడించారు. బ్రిటిష్‌ చరిత్రకారుల ప్రభావం కారణంగా నాడు జోధా బాయి- మొఘల్ చక్రవర్తి అక్బర్‌ల వివాహంతో సహా పలు ఉదంతాలు భారతదేశ చరిత్రలో తప్పులతో నమోదయ్యాయని గవర్నర్ హరిభావ్ పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ బగాడే మాట్లాడుతూ అక్బర్ నామాలో జోధా.. అక్బర్‌ల వివాహానికి సంబంధించిన ప్రస్తావన లేదన్నారు. అయితే జోధా – అక్బర్‌లు వివాహం చేసుకున్నారని చెబుతారన్నారు. ఈ కథనంపై ఒక సినిమా కూడా రూపొందించారన్నారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, అయితే అది అబద్ధమని గవర్న్‌ర్‌ పేర్కొన్నారు.

భర్మల్ అనే రాజు ఒక పనిమనిషి కుమార్తెను దత్తత తీసుకుని, ఆమెను అక్బర్‌కిచ్చి వివాహం జరిపించారంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు.. 1569లో అమర్ పాలకుడు భర్మల్ కుమార్తె – అక్బర్‌ల వివాహానికి సంబంధించిన చారిత్రక కథనంపై మరోమారు చర్చను లేవనెత్తాయి. బ్రిటిష్ వారు మన దేశానికి చెందిన వీరుల చరిత్రను మార్చివేశారు. కొంతమంది భారతీయ రచయితలు బ్రిటిష్ వారికి ప్రభావితమయ్యారని గవర్నర్ పేర్కొన్నారు.

రాజ్‌పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్.. అక్బర్‌కు సంధిని కోరుతూ లేఖ రాశాడనే చారిత్రక వాదనను కూడా ఆయన ఖండించారు. మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నారు. చరిత్రలో అక్బర్ గురించి అధిక సమాచారం ఉన్నదని, మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అయితే పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ హరిభావ్ బగాడే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *