‘‘యాంటీ నక్సల్స్ ఆపరేషన్’’ లో పాల్గొన్న వారిని సన్మానించిన కేంద్ర హోంమంత్రి

యాంటీ-నక్సల్ ఆపరేషన్లలో అతిపెద్దదైన కర్రెగుట్ట ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలను, రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సన్మానించారు. భద్రతా బలగాల కుటుంబ సభ్యులను, పోలీసుల కుటుంబీకులను కూడా సన్మానించారు. పరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో భద్రతా బలగాల సాహసాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాల సాహసాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని ప్రశంసించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తన నివాసంలో సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసులు, డీఆర్ జీ, కోబ్రా బెటాలియన్లతో పాటు వారి కుటుంబీకులను కూడా సన్మానించారు.అనంతరం అమిత్‌షా ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించినట్టు ఆ పోస్ట్‌లో అమిత్‌షా తెలిపారు.
నక్సలైట్లందరూ లొంగిపోయే వరకు, పట్టుకునే వరకు లేదా అంతమొందించే వరకు మోడీ ప్రభుత్వం విశ్రమించదని, ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ను నక్సల్స్ రహితంగా మారుస్తామని పునరుద్ఘాటించారు.యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ కారణంగా పశుపతినాథ్ నుంచి తిరుపతి ప్రాంతం వరకూ 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఈ ఆపరేషన్లలో గాయపడిన భద్రతా బలగాల జీవితాలు సాఫీగా సాగేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్గిస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *