తేనె సేకరణ, ఉత్పత్తితో ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు

గ్రామీణ ప్రాంతాల మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి, ఆర్థిక స్వావలంబన కోసం ఆదిలాబాద్ జిల్లాలో వినూత్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అక్కడి గ్రామీణ అభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కలిసి ప్రత్యేక దృష్టి పెట్టాయి. స్థానిక అడవుల్లో, స్థానికంగా లభించే వనరుల ద్వారానే వారి ఆర్థిక స్వావలంబనకు దారులు వేస్తున్నారు. మహిళలు స్వయంఉపాధి పొందేలా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాంకిడి మండలకేంద్రంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో తేనెశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వయంసంఘాల సభ్యుల నుంచి కొనుగోలు చేసిన తేనెను శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. దీంతో స్వయంసహాయక సభ్యులకు ఉపాధితోపాటు మండల సమాఖ్యకు లాభాలు చేకూరుతున్నాయి.

తేనె శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చిన సర్కార్…

వాంకిడి మండల కేంద్రంలో వేంకటేశ్వర మండల సమాఖ్య ఆధ్వర్యంలో తేనెశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ సంస్థ రూ.14.14లక్షల రూపాయలు కేంద్రం నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. రూ.3.50లక్షలతో తేనె శుద్ధి యంత్రం కొనుగోలు చేయగా రూ.7లక్షలతో గ్రామీణ మహిళలనుంచి తేనె కొనగోలు చేసేందుకు తేనె పెట్టెలు కొనుగోలు చేశారు. అనంతరం తేనె ఉత్పత్తి చేసే విధానం, తేనె సేకరణ తదితర అంశాలపై సభ్యులకు శిక్షణ ఇచ్చారు. మహిళలు కూడా అత్యంత శ్రద్ధతో ఇది చేయడానికి ముందుకు వచ్చారు. అధికారులు కూడా అన్ని రకాలుగా సహకరించారు.

తేనెటీగల పెంపకం, ఉత్పత్తి చేసేందుకు జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, సిర్పూర్, జైనూర్ మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. దీనికి బాగా కసరత్తు చేశారు. ఎంపికచేసిన గ్రామాల్లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగలను పెంచడం, అందులోని తేనె సేకరించే విధానాలపై హైదరాబాద్‌ నుంచి వచ్చిన శిక్షకులు మెలకువలు నేర్పించారు. వాంకిడి మండలంలోని ఆటవీప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల సభ్యులకు తేనె పెట్టెలను పంపిణీ చేశారు. వాటిని తమ పంటపొలాల్లో అనుకూలంగా ఉన్నచోట ఏర్పాటు చేసి తేనె ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో పెట్టెలో మూడు నుంచి నాలుగు కిలోల తేనె ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి చేసిన తేనెను మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసి తేనె శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తేనెను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మార్కెట్ లో కూడా బాగా డిమాండ్ వుండటంతో మహిళలు మరింత ముందుకు వస్తున్నారు. మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో కిలో తేనెను 600 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతానికి చుట్టుపక్కల జిల్లాల్లోనే అమ్ముతున్నామని, వీలైతే హైదరాబాద్, ఇతర జిల్లాలకు కూడా విక్రయించే చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *