అనంతనాగ్‌లో కాలిబూడిదైన కశ్మీరీ హిందువుల ఇళ్లు… కుట్ర కోణం ఉందని అనుమానాలు
అనంతనాగ్‌లోని మట్టన్‌లో కశ్మీరీ హిందువుల ఇళ్లు అకాస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇలా పూర్తిగా ఐదు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి 1:45 నిమిషాలకు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని, మంటలను ఆర్పారు. అయితే.. మంటలను ఆర్పడానికి చాలా సమయమే పట్టింది. ఓ ఇంట్లో మాత్రం మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో దాన్ని కూల్చేశారు. ఈ మంటలను ఆర్పడానికి మొత్తం నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును ప్రారంభించారు.
మరోవైపు ఈ విషాద ఘటనపై కశ్మీర్ శారదా పీఠం చైర్మన్ రవీంద్ర పండిత స్పందించారు. ఈ ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మైనారిటీ ఆస్తుల రక్షణకు నియమితులైన అధికారులు సరైన చర్యలు తీసుకోలేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృత్తం కాకుండా హిందువులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బెదిరిస్తే.. బెదిరిపోం… ఇక్కడే వుంటాం : హిందువుల ప్రకటన..
తమను ఎన్ని రకాలుగా, ఎందరు బెదిరించినా.. తామెక్కడికీ వెళ్లమని, బెదిరింపులకు భయపడమని కశ్మీరీ హిందూ కమ్యూనిటీ తేల్చి చెప్పారు. 1990 నుంచీ తమకు బెదిరింపులు ప్రారంభమయ్యాయని, తాము భయపడమన్నారు. తాము ఎక్కడికీ వెళ్లమని, ఇదే తమ జన్మభూమి అని ధైర్యంగా ప్రకటించారు. తమ ఇళ్లను ఇక్కడే కట్టుకుంటున్నామని, దేవాలయాల పునరుద్ధరణ కూడా జరుగుతోందన్నారు. హిందువుల ఆస్తులకు, ప్రాణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
బెదిరింపులకు దిగుతున్నారా? హిందువులను భయపెడుతున్నారా?
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ, పర్యాటక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా తమ ఆస్తులు, తమ బంధువులను పూర్తిగా వదిలేసి వెళ్లిపోయిన.. కశ్మీరీ పండితులు, హిందువులు తిరిగి తమ సొంత స్థలాలకు చేరుకుంటున్నారు. అలాగే హిందూ దేవాలయాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఇది చూసి సహించలేక.. కొందరు దేశ ద్రోహులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.