సైకిల్ వల్ల ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు..
సైకిల్’’ కేవలం ప్రయాణ సాధనమే కాదు. భావోద్వేగంతో కూడుకున్నది. ఓ తండ్రి తన బిడ్డలకు సైకిల్ నేర్పడం, తన భుజాలపై, ఛాతీపై ఆడించుకోవడం రెండూ సమానమే. అలాగే స్నేహితులందరూ కలిసి సైకిల్ పై కొద్ది మైళ్ల దూరం వెళ్లేవారు. దీంతో స్నేహితం మరింత బలపడేది. అంతేకాకుండా సైకిల్ జీవిత పాఠాలను కూడా నేర్పిస్తుంది. సైకిల్ నేర్చుకునే క్రమంలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నేర్చుకుంటాం. దీని ద్వారా జీవితంలో కూడా ఎత్తు పళ్లాలు వుంటాయన్నది తెలిసొస్తుంది.
అంతేకాకుండా ఒకప్పుడు సైకిల్ వుంటే అదో స్టేటస్. అలాగే వాచీ కూడా. పెళ్లిళ్లో అల్లుడికి అత్తగార్ని సైకిల్ కట్నంగా అడిగేవారు. అప్పట్లో సైకిల్ అంటే అంత క్రేజ్. ఎవరైనా కొత్తగా సైకిల్ కొంటే.. అందరూ వచ్చి దానిని చూసేవారు. ఆ సమయంలో సైకిలే గొప్ప ఆస్తి.అయితే.. ప్రతి యేటా జూన్ 3 ‘‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’’ గా జరుపుకుంటాం. ఈ యేడాది ఐక్యరాజ్య సమితి ‘‘పచ్చని భవిష్యత్తు కోసం సైక్లింగ్’’ అనే థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.
మరో వైపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘పంచ పరివర్తన్’’ ను సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందులో పర్యావరణ పరిరక్షణ కూడా ఓ అంశం. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు… ఇలా ప్రయాణ సాధనాలు పెరిగిపోవడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడింది. దీంతో పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు ప్రజల ఆరోగ్యాలపై, పంటలపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది.
‘‘సైక్లింగ్’’ వల్ల ఆరోగ్య ప్రయోజనాలివీ…
ప్రతి రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల మన గుండె పనితీరు మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి శరీరంలోని కేలరీలను సులభంగా కరిగించేస్తుంది. అలాగే ఊబకాయం నుంచి కూడా కాపాడుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మానసికంగా, ఉల్లాసంగా వుండేలా చేస్తుంది. సైక్లింగ్ ద్వారా కాళ్లు, నడుము, కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచుతుంది.మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడతాయి.
పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర:
పర్యావరణ పరిరక్షణలో కూడా సైకిల్ అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది.
1. గాలి కాలుష్యం తగ్గుతుంది
కార్లు, బైకులు, బస్సులు వంటి ఇంధన వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్‌ను కాల్చి కార్బన్ డయాక్సైడ్ (CO₂), కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి హానికర వాయువులను విడుదల చేస్తాయి.
సైకిల్‌కు ఇంధనం అవసరం లేదు.
సైకిల్ నడపడం వల్ల నేరుగా ఎలాంటి కాలుష్య వాయువులు విడుదల కావు.
నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
2. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి
ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం గ్రీన్‌హౌస్ వాయువులు.
ఒక కారు ప్రతి కిలోమీటర్‌కు సగటున 120–250 గ్రాముల CO₂ విడుదల చేస్తుంది.
అదే దూరాన్ని సైకిల్‌పై ప్రయాణిస్తే దాదాపు శూన్య ఉద్గారాలు ఉంటాయి.
ఎక్కువ మంది సైకిల్ ఉపయోగిస్తే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గించడంలో సహాయపడుతుంది.
3. ఇంధన పొదుపు
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు పరిమిత వనరులు.
సైకిల్ పూర్తిగా మానవ శక్తిపై ఆధారపడుతుంది.
ఇంధన వినియోగం తగ్గడం వల్ల సహజ వనరుల సంరక్షణ జరుగుతుంది.
దేశం విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడటం కొంత తగ్గుతుంది.
4. శబ్ద కాలుష్యం తగ్గుతుంది
మోటార్ వాహనాలు హారన్‌లు, ఇంజిన్ శబ్దాలతో శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి.
సైకిల్ దాదాపు నిశ్శబ్దంగా పనిచేస్తుంది.
నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
5. రోడ్లపై రద్దీ తగ్గుతుంది
ఒక కారు ఆక్రమించే స్థలంలో అనేక సైకిళ్లు ప్రయాణించగలవు.
ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి.
వాహనాలు నిలిచిపోయి ఇంధనం వృథా కావడం తగ్గుతుంది.
పరోక్షంగా కాలుష్యం కూడా తగ్గుతుంది.
6. ప్రకృతి వనరుల వినియోగం తగ్గుతుంది
కార్లు, బైకులు తయారు చేయడానికి ఎక్కువ ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, శక్తి అవసరం.
సైకిల్ తయారీకి తక్కువ ముడి పదార్థాలు అవసరం.
తయారీ ప్రక్రియలో తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది.
పరిశ్రమల వల్ల కలిగే పర్యావరణ ప్రభావం తగ్గుతుంది.