ఆ ఊరిపేరే ”పండ్ల గ్రామం”… ఎటు చూస్తే అటు పండ్లే… రైతుల్లో ఆనందమే
ఆ ఊరి పేరు ధుమల్‌వాడీ. కానీ… అక్కడి రైతుల విధానం, వారు చేసే పని కారణంగా ఆ గ్రామానికి పండ్ల గ్రామంగా పేరు పడిపోయింది. నిజమే.. ఆ గ్రామస్థులు పట్టుదలతో వ్యవసాయం చేస్తూ రకరకాల పండ్లను పండిస్తుంటారు. దీంతో ఆ గ్రామానికి ప్రభుత్వం ‘‘పండ్ల గ్రామం’’ అని గుర్తింపును కూడా ఇచ్చింది. మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఆ గ్రామంలో సరైన నీరు లేక దుర్భిక్షం తాండవం చేసింది. కానీ ఇప్పుడు రైతులందరూ అక్కడ లక్షాధికారులే. ధుమల్ వాడీలో సుమారు 250 కుటుంబాలు వుంటాయి. గతంలో ఇక్కడి రైతులు మినుములు, గోధుమలు, జొన్నలు సాగు చేసేవారు. భూసారం తగినంతగా లేకపోవడం, చీడపీడల కారణంగా పంటలు కూడా సరిగ్గా పండేవి కావు. దీంతో చాలా మంది రైతులు రైతు కూలీలుగా మారిపోయాయి.
కొందరు అదే ఊరిలో కూలీగా మారితే, మరి కొందరు వివిధ గ్రామాలకు వెళ్లి కూలీలుగా మారిపోయారు. దీంతో ఆ ఊరు కళ తప్పింది. దీంతో గ్రామస్థులందరూ ఓ చోట సమావేశమయ్యారు. తమ ఊరు ఇలా కళ తప్పడం బాగో లేదని, వ్యవసాయం విషయంలో ఏదైనా చేయాలని, తమకు తగిన సూచనలు, సలహాలు కావాలని స్థానికంగా వుండే వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సంప్రదించారు. దీంతో భూసారాన్ని పెంచే మార్గాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వారికి చెప్పారు. అంతేకాకుండా అతి తక్కువ రోజుల్లో వచ్చే పండ్ల సాగు చేయాలని కూడా సూచించారు. ధుమల్‌వాడీలో వుండే వాతావరణం పండ్ల పెంపకానికి అనువైన వాతావరణం అని, రైతులందరూ అటు వైపు మొగ్గు చూపించాలని సూచించారు. దీంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే… పండ్ల పండిరచడం అనేది డబ్బులతో కూడిన వ్యవహారం. రైతులందరి వద్దా అంత డబ్బు కూడా లేదు. దీంతో చాలా మంది ముందుకు రాలేదు.
దీంతో గ్రామస్థులందర్నీ ఏకతాటిపైకి తేవడానికి కొందరు పెద్దవారు చాలా ప్రయత్నాలు చేసి, చివరికి కృతకృత్యులయ్యారు. కొందరు మాత్రం మొదటి దశలో పండ్ల తోటలు వేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. క్రమంగా వారు కొద్ది కొద్దిగా లాభాలు గడిరచారు. పంటలు గనక వేస్తే ఆ సీజన్‌కే పరిమితం కావాలి. అందుకే రైతులందరూ తమకున్న 1000 ఎకరాల్లో 20 నుంచి 25 రకాల పండ్లను సాగు చేయాలని నిర్ణయించారు. మామిడి, దానిమ్మ, సపోట, సీతాఫలం, అరటి, డ్రాగన్ ఫ్రూట్, అంజీర, నారింజ, నిమ్మ, జామ, ద్రాక్ష, ఉసిరి, కొబ్బరి లాంటి పంటలను పండిస్తున్నారు.
ఇలా చేసిన తర్వాత ప్రతి సీజన్‌లోనూ పంట చేతికొచ్చి, ఆదాయం రావడం ప్రారంభమైంది. యేడాది వచ్చే సరికి 40 నుంచి 50 కోట్ల ఆదాయం రైతులకు వస్తోంది. దీంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ గ్రామానికే ఇతర గ్రామాల నుంచి కూలీలకు వస్తున్నారు. దాదాపు 20 గ్రామాల నుంచి రైతులు కూలీలకు వస్తున్నారు. స్థానికంగా వుండే ఓ రైతు మాట్లాడుతూ… వ్యవసాయం లాభసాటిగా వుంటుందని గ్రామస్థులమందరమూ నిరూపించామని సంజయ్ ధుమాల్ అనే రైతు పేర్కొన్నాడు. ‘‘మా ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు. వ్యాపారులే మా దగ్గరికి వస్తారు. ఈ విషయాన్ని మేము సగర్వంగా ప్రకటించుకుంటున్నాం.
మరో ప్రయోగం కూడా చేసి, సక్సెస్ అయ్యారు. పండ్ల తోటల మధ్య పశువుల కోసం మేత, ఇంటి అవసరాలకు సరిపడేంత కూరగాయలను కూడా పండిరచుకుంటున్నారు. అయితే… గ్రామంలో పొలం లేని వారికి కూడా పొలం వున్న వారు ఉపాధి చూపిస్తూ… తమ వెంట లాభాల్లోకి తీసుకెళ్లడం ఇక్కడి విశేషం. దీని కోసం భూమి వున్న రైతులు కాలువలు, చెరువుల గట్ల పైన పండిస్తున్నారు .దీంతో భూమి లేని వారు కూడా లాభాలు గడిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఢల్లీి రాష్ట్రాల నుంచి పండ్లను కొనుగోలు చేసుకోవడానికి వస్తున్నారు. ఒకప్పుడు దరిద్రం తాండవమాడిన చోట ఇప్పుడు ధన, ధాన్య రాశులతో ఊరు ఊరంతా కళకళలాడిపోతోంది.