వేప గింజలతో స్వయం సమృద్ధి సాధిస్తున్న తెలంగాణ మహిళలు
ఎందుకూ పనికిరాని, భూమిలో కలిసిపోయే వేప గింజలే ఇప్పుడు ఆ మహిళలకు ఉపాధి చూపిస్తున్నాయి. ఆ మహిళలకి ఆర్థిక స్వావలంబన దిశగా ఆ గింజలే అడుగులు వేపిస్తున్నాయి. వేప గింజల నుంచి వేప నూనె, వేప పిండిని తయారు చేసి, విక్రయిస్తున్నారు. దీని ద్వారా స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఈ ఆదర్శమైన గాథ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గల్ గ్రామానికి సంబంధించింది.
జహీరాబాద్ మండలం అల్గల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మొదటగా మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మోత్తం మూడు యూనిట్లు ఏర్పడ్డాయి. ఈ యూనిట్ లోని మహిళలు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వేప గింజలను కొనుగోలు చేసి, ఇళ్లకు తెచ్చుకుంటారు. అయితే… తమ తమ వ్యవసాయ పనులు చేసుకుంటూనే తీరిక సమయాల్లో వేప గింజల నుంచి వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.
ఇలా రెండు దశాబ్దాలుగా మహిళలు ఈ పని చేస్తున్నారు. అలాగే వేప గింజల నుంచి సేంద్రీయ ఎరువులు, క్రిమి సంహారక మందులను కూడా తయారు చేస్తున్నారు. చాలా పంటలకు వేప నూనెను సేంద్రీయ పురుగుల నివారిణిగా ఉపయోగిస్తున్నారు. అలాగే వేప కేక్ ను కూడా సేంద్రీయ ఎరువుగా వాడుతున్నారు. గింజలు కిందపడటంతో వాటికి మట్టి అంటుంది. మహిళలు ఈ మట్టిని తొలగించి, వీటిని ఎండబెట్టి ప్రాసెస్ చేస్తారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకూ నూనె తీసిన వేప పిండి (కేక్) తయారవుతుంది. గింజలు గనక బాగా వుంటే మరింత ఎక్కువగా వస్తుంది. వేప నూనెను వ్యవసాయ పంటలపై వుండే చీడపీడల నివారణకు పిచికారీగా వాడుతారు. దీనిని ఔషధాల తయారీకి, చర్మ వ్యాధుల నివారణకు కూడా వాడుతారు. మహిళలు తయారు చేసిన వేప పిండి, వేప నూనెను వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసి, తీసుకెళ్తుంటారు. అయితే… తాజాగా… ఫోన్లో ఆర్డర్ తీసుకొని, ఆర్టీసీ కార్గొ ద్వారా, ఇతరత్రా సాధనాల ద్వారా తెప్పించుకుంటున్నారని మహిళలు తెలిపారు.
ప్రారంభంలో, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (DDS) ఈ ప్రాంతంలో సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ మహిళలకు ఒక యంత్రాన్ని అందించింది. అయితే వివిధ సవాళ్ల కారణంగా కొన్నేళ్లుగా ఉత్పత్తిని నిలిపివేశారు. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నాలుగేళ్ల కిందట మళ్లీ మూడు యంత్రాలను మంజూరు చేసి ఈ మహిళలకు అండగా నిలిచింది. 15 మంది మహిళలు నాలుగేళ్లుగా మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించారు. వేప నూనె కిలో 400 రూపాయలుగా, వేప కేక్ 35 రూపాయలుగా నిర్ణయించామని తెలిపారు.
రాష్ట్రంలోని జడ్చర్ల, తాండూరు తదితర ప్రాంతాల్లో ఏటా సీజన్‌లో వేప విత్తనాలను కొనుగోలు చేస్తామని ఓ యూనిట్ కి సంబంధించిన మహిళ తెలిపారు. చెట్టు సాధారణంగా జూలై-ఆగస్టు నెలలలో ఫలాలను ఇస్తుంది. పండ్లను ఎండబెట్టి, నూనె మరియు కేక్ తయారీకి ఉపయోగిస్తారు. సేంద్రీయ సాగును అభ్యసిస్తున్న రైతుల నుండి మహిళలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్డర్‌లను పొందుతున్నామని తెలిపింది.
మరో మహిళ మాట్లాడుతూ… ఓ వైపు వ్యవసాయం చేసుకుంటూనే ఈ పని చేస్తున్నామని తెలిపింది. యేడాదిలో ఆరు నెలల పాటు నూనె, వేప కేక్ ను తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. మార్కెటింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో తమ కష్టం వృథా అవుతోందని వాపోయింది.