భారత భూమిలో సౌందర్యం, సుగంధం దాగి వున్నాయి : చిన్న జీయర్ స్వామీజీ

హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (HSSF) ఆధ్వర్యంలో హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం సేవాప్రదర్శిని ఘనంగా ప్రారంభమైంది. పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవాసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సేవావ్రతులైన వ్యక్తులు, మఠమందిరాలు, సమాజానికి అందిస్తున్న సేవలకు సంబంధించిన బృహత్ మేళాగా ఈ సేవా ప్రదర్శిని ఏర్పాటైంది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, రామకృష్ణ మిషన్ (విజయవాడ)కు చెందిన శ్రీశితికంఠానంద స్వామి, ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు శ్రీభాగయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు నిరంజన్, HSSF-IMCTF అఖిలభారత సంయోజకులు గుణవంత్ సింగ్ కొఠారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సేవాప్రదర్శిని ప్రారంభోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రెటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించారు.
HSSF సేవాప్రదర్శిని ప్రారంభోత్సవ సభలో ఆశీః ప్రసంగం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ఈ బృహత్ మేళా భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మన దేశానికి ఒక ఆత్మ ఉన్నదని చూపించే సంకల్పంతోనే ఏర్పాటైన ఈ సేవాప్రదర్శినిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విశాల హృదయం కలిగిన భారతదేశంలో వనరులకు కొరత లేదంటూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆలోచన లేని విద్యావిధానమే కొనసాగుతోందని, దేశంలో ఇప్పటికీ దాస్య భావన పోలేదని ఆవేదన చెందారు. వేద విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న భారతదేశంలో సహజత జీవించే ఉందని, మన భూమికి సహజసంపద, సౌందర్యం, సౌగంధ్యం, రుచి ఉన్నాయని జీయర్ స్వామి వివరించారు. భారతీయతను ఆచరిస్తూ లోక క్షేమాన్ని, విశ్వ కళ్యాణాన్ని కోరుకునే వ్యక్తులు సంస్థలను HSSF ఒక చోటికి చేర్చిందని ప్రశంసించారు.
మానవుడు దైవాన్ని చేరుకునే ప్రయాణంలో సాధనగా మన రుషులు సేవామార్గాన్ని మనకు చూపించారని, HSSF సేవాప్రదర్శిని దానిని ప్రతిబింబిస్తోందని రామకృష్ణ మిషన్, విజయవాడ నుంచి విచ్చేసిన స్వామి శితికంఠానంద కొనియాడారు. సనాతన ధర్మంలో త్యాగానికి ప్రతినిధులుగా నిలిచిన దధీచి, జీమూతవాహనుడు, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు వంటి వారిని ఉదహరిస్తూ సమాజం గుర్తింపును ఆశించకుండా సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థల ఈ సేవాప్రదర్శిని ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. సేవ ద్వారా మాత్రమే అహంకారం నిర్మూలన జరుగుతుందన్న స్వామి రంగనాథానంద బోధను ప్రస్తావిస్తూ ఈ సేవా మేళాలు భాగంగా జరుగనున్న కన్యావందనం, గురువందనం, మాతా పితృ వందనం కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య ప్రసంగిస్తూ భారతీయ సమాజ మౌలిక స్థితి, సాంస్కృతిక తత్వం, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా HSSF సేవాప్రదర్శిని నిలుస్తుందన్నారు. సేవకు ప్రతిమూర్తిగా నిలిచిన శ్రీకృష్ణుడి వారసులైన భారతీయులు మన దేశంలోని ధార్మిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. బ్రిటిష్ వారు రాకముందు మనదేశంలో దారిద్ర్యమే లేదని, విదేశీ దురాక్రమణ తర్వాత కూడా మన గ్రామాలు సుసంపన్నంగానే ఉన్నాయని తెలిపారు. దేశంలోని ధర్మశాలలకు ప్రజలే దాతలుగా నిలిచారంటూ 1785 వ సంవత్సరం వరకూ తమిళనాడు నుంచి బరంపురం వరకూ ఉన్న సుమారు లక్ష పాఠశాలలకు ప్రజలు, రైతులే అండగా నిలిచారని, వాటిలో సమస్త కులాల వారు విద్యను అభ్యసించేవారని విశాల భారతీయ తత్వాన్ని సభకు తెలిపారు. రామకృష్ణ మఠం, సత్యసాయి సంస్థలు, మాతా అమృతానందమయి సంస్థలు, సేవాభారతి వంటి ఎన్నో సంస్థలు సేవానిరతిని భాగయ్య ప్రస్తావించారు. అమెరికా, కెన్యా వంటి దేశాల్లో సైతం భారతీయులందిస్తున్న సేవలను తెలియజేస్తూ HSSF సేవాప్రదర్శినిలో ఆ స్ఫూర్తిని చూడవచ్చన్నారు.
HSSF-IMCTF అఖిలభారత సంయోజకులు గుణవంత్ సింగ్ కొఠారి తమ ప్రసంగంలో ఈ సేవా ప్రదర్శిని విశిష్టతను సభకు తెలిపారు. హైందవ ధర్మంలోని సేవానిరతిని చాటేందుకే దీనిని ఏర్పాటు చేశామంటూ వివిధ రాష్ట్రాలలో గతంలో నెలకొల్పిన మేళా వివరాలు, సంస్థల గురించి తెలియజేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు నిరంజన్ మాట్లాడుతూ సమాజ సేవలో తమ వంతుగా అందిస్తున్న సేవలను వివరించారు.
సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్మతః పౌరసత్వాన్ని తేలిగ్గా పొందుతున్న భారత ప్రజలు ఈ దేశపు అసలైన చరిత్ర ఏమిటన్నది అవగాహన లేని స్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు. వ్యవస్థలకు నేతృత్వం వహిస్తున్నవారు సైతం ఇదే పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో నిస్వార్థ సేవలందించే వ్యక్తులు, సంస్థలను ఏకతాటిపైకి తెచ్చిన HSSF సేవాప్రదర్శిని మన నిజమైన పౌరసత్వాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం, సమాజం గుర్తించకపోయినా తమ వంతు బాధ్యతగా సేవల అందించే వ్యక్తులు, సంస్థలను ఈ మేళాలో సందర్శించి ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.HSSF సేవాప్రదర్శిని ప్రారంభోత్సవానికి ముందు వివిధ సాంస్కృతిక సంస్థలకు చెందిన కళాకారులు తమ అద్వితీయ నాట్య, గాన ప్రతిభతో అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *