సంఘ వికాసానికి అంకితమైన దేశభక్తుడు హెచ్ వి శేషాద్రి

సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. సంఘ్ ప్రచారక్‌గా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అంకితం చేశారు. మొదట శేషాద్రి గారి పని ప్రదేశం మంగళూరు విభాగ్ కాగా, తర్వాత కర్ణాటక రాష్ట్రం, ఆ తర్వాత యావత్ దక్షిణ భారతదేశం. 1986 వరకు వీరు దక్షిణాదిలో చురుకుగా పని చేశారు. శ్రీ యాదవరావ్ జోషిచే బాగా ప్రభావితమైన శేషాద్రిగారు 1987 నుండి 2000 వరకు సంఘ్ సర్‌కార్యవాహ. ఈ కారణంగా వారు భారతదేశమంతటా, ఇంకా ప్రపంచంలోని కొన్ని దేశాలలోను పర్యటించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం సరైన నాయకత్వాన్ని అందించారు. శేషాద్రి గారు పనిలో నిమగ్నమైనప్పటికీ, ప్రతిరోజూ రాయడానికి సమయం కేటాయించుకునేవారు. తన రచనల ద్వారా ఎందరోమందికి స్పూర్తి ప్రదాతగా నిలిచారు. సేవాకార్యక్రమాల విస్తరణకు, సంస్కృత అభ్యున్నతికి కూడా శేషాద్రి ఎంతో కృషి చేశారు.శేషాద్రి గారు వందకు పైగా చిన్న పెద్ద పుస్తకాలు రాశారు; రెండవ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ ప్రసంగాలను ‘బంచ్ ఆఫ్ థాట్స్’ రూపంలో మొదట సంకలనం చేసింది వీరే. దాని సంచికలు నేటికీ ఏటా ప్రచురించబడుతున్నాయి. శేషాద్రి గారి ప్రసంగ శైలి కూడా అద్భుతంగా ఉంటుంది. సరళమైన మరియు ఆసక్తికరమైన ఉదాహరణలు ఇస్తూ తన అభిప్రాయాలను శ్రోతలకు తెలియజేసేవారు.

నాల్గవ సర్‌సంఘచాలక్ రజ్జు భయ్యా అనారోగ్య కారణాలతో సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు, స్వయంసేవకులందరూ శేషాద్రి జీ ఈ బాధ్యతను చేపట్టాలని కోరుకున్నారు; కానీ వారు ఇందుకు సిద్ధంగా లేరు. మితిమీరిన శారీరక, మానసిక శ్రమ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఈ పని ఓ యువకుడికి ఇవ్వాలని అన్నారు. చివరికి ఈ బాధ్యతను సుదర్శన్ జీకి అప్పగించారు.
మెరుగైన సమాజాన్ని నిర్మించాలంటే అందుకు అనుగుణంగా స్వయం సేవకులు తయారవ్వాలని శేషాద్రి గారు బలంగా విశ్వసించారు. వారి రచనలన్నింటిలో కూడా సంఘ లక్ష్యాలు, సంఘ చేసే పనులు, సంఘ దృక్పథం స్పష్టంగా గోచరించించేవి. ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రశంస ఉండేది కాదు.
జీవితకాలం మొత్తం సంఘ వికాసానికి పనిచేసిన శేషాద్రి గారు తమ 80 సంవత్సరాల వయసులో ఆగస్టు 14, 2005 సాయంత్రం దేశమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *