విద్యుత్ అవసరం లేకుండానే పొలాల్లోకి నీటిని ఎత్తిపోసే పరికరం… తెలుగువాడి ఆవిష్కరణ
కొండవాగు ప్రాంతాల్లో వుండి కూడా, వ్యవసాయానికి నీరు లేక కటకటలాడుతున్న రైతుల కోసం నూత్న ఆవిష్కరణ వచ్చింది. డీజిల్ ఇంజన్లతో ఖర్చు అధికం అయ్యే అవకాశాలు వుండటంతో రైతులకు సులభంగా నీటిని అందించాని పంపన శ్రీనివాస్ నూతన ఆవిష్కరణ చేశారు. దీంతో రైతుల నెత్తిన పాలు పోసినట్లైంది. కొండ ప్రాంతాల్లో వుండే రైతులకు శాశ్వతంగా మేలు జరగాలని వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసే నిర్మాణాన్ని చేయాలనుకున్నాడు. పంపన శ్రీనివాస్ స్వస్థలం కాకినాడ. చదివింది ఐటీఐ.
పాత కాలం ర్యాంపంపు పద్ధతిలో సాంకేతికతను మరింత మెరుగు చేసి, వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేశారు. అలాగే హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని కూడా ఆవిష్కరించారు. హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణ ద్వారా వాగులో 5 అడుగుల ఎత్తు నుంచి కిందికి వచ్చే నీటిని ఒడిసి పట్టి, పంట పొల్లాలోకి ఎత్తిపోసేదే హైడ్రో లిఫ్ట్. ఈ యంత్రం శ్రీనివాస్ సొంత ఆలోచన, సొంత ఖర్చు కూడా. చిన్న నమూనా యంత్రంతో ముక్కోలు చెక్ డ్యామ్ వద్ద ట్రయల్ నిర్వహించారు. నిపుణులకు చూపించడంతో వారు సెహభాష్ అని మెచ్చుకున్నారు.
ఈ యంత్రం మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్ తో వుంటుంది. చుట్టూ అంగుళం బ్లేడ్లు వాలుగా వుంటాయి. నీటి ఉధృతికి రాళ్లు కొట్టుకు వచ్చినా కదలకుండా వుండే గట్టి ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చాడు. హైడ్రో లిఫ్ట్ తో కూడిన ఈ చట్రాన్ని చెక్ డ్యామ్ కిందలో వుంచారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం వుంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తిపోయవచ్చు. నీటి ప్రవాహం వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40సార్లు తిరుగుతుంది. ఈ బాక్స్ షాఫ్ట్ నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పీఎంతో నడుస్తుంది.
నిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు తోడుతుంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుంది. డ్రిప్ గనక ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని అంటున్నారు. దీని తయారికి 35 వేలు ఖర్చు అవుతుందని, వాగులో ఇన్ స్టాల్ చేయడానికి ఖర్చులు అదనం. అయితే.. పెద్ద మొత్తంలో సద్వినియోగం చేయాలనుకుంటే హైడ్రో లిఫ్ట్ పొడవు 9-16 అడుగుల పొడవు, 2-4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చు.
మరోవైపు ఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతిక కూడా ఉపయోగిస్తున్నారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ర్యాం పంపును వాడుతున్నారు. దీనిని అమర్చడానికి వాగులో 4 నుంచి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్న జలపాతం వుండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకే ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్ పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలు.. వాటంతట అవే రెండు పిస్టన్లు ఒక దాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ వుంటాయి. దీంతో నీరు ఒత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన నాన్ రిటర్న్ వాల్వ్ కి అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తిపోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది.అయితే కనీసం 8 నుంచి 10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించవచ్చు.దీన్ని నిర్మించడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి.