ఉగ్రవాదం అంతుచూడడానికే రంగంలోకి దిగాం : భారత ఆర్మీ కీలక ప్రకటన
ఉగ్రవాదం అంతం చేయాలన్న దృఢ సంకల్పంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని భారత సైన్యం ప్రకటించింది. తాము చేపట్టిన ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆదివారం త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ 100 మంది ఉగ్రవాదుల్లో 1999 ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం (IC-814) హైజాక్ మరియు 2019 పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొంత మంది ఉగ్రవాదులు హతమైన వారిలో వున్నారని పేర్కొన్నారు. వీరిలో యూసుఫ్ అజార్, అబ్దుల్ మౌలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి వారు కూడా ఈ హతమైన జాబితాలో వున్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు.
మసూద్ అజార్ సోదరుడు యూసుఫ్ జార్ ఐసీ 814 హైజాకింగ్ కేసులో మోస్ట్ వాంటెండ్ జాబితాలో వున్నాడని, అలాగే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల్లో చురుగ్గా వుండేవాడని తెలిపారు. ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణను కూడా యూసుఫ్ జార్ నేతృత్వంలోనే సాగేదని, జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడని పేర్కొన్నారు. ఇక.. అబ్దుల్ మాలిక్ రవూఫ్ లష్కరే తోయ్యబాలో ఉన్నత స్థాయిలో కమాండర్ గా వున్నాడని, ప్రపంచ ఉగ్రవాదిగా అమెరికా కూడా ప్రకటించిందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు.

ఇక.. ముదాసిర్ అహ్మద్ ఒక సీనియర్ లష్కరే కార్యకర్త మరియు ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మురిద్కేలోని మర్కజ్ తైబాకు బాధ్యత వహించాడని తెలిపారు. ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారు, ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసేవారు అలాగే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం అన్న స్పష్టమైన లక్ష్యాలతోనే తాము ఆపరేషన్ సిందూర్ రూపొందించామని తేల్చి చెప్పారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణనిచ్చిన మురిడ్కే వంటి స్థావరాలను తాము టార్గెట్ చేసుకున్నామన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకంగా భారత్ పాకిస్తాన్ మరియు పీఓజేకే లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు పునరుద్ఘాటించారు.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయకులను అనవసరంగా హత్య చేసిన క్రూరత్వం యావత్ భారతదేశాన్ని కదిలించిందన్నారు. దేశం చూసిన భయంకరమైన దృశ్యాలు, బాధిత కుటుంబాల బాధను మన సాయుధ దళాలు, నిరాయుధ పౌరులపై ఇటీవల జరిగిన అనేక ఇతర ఉగ్రవాద దాడులతో కలిపితే, ఒక దేశంగా మన సంకల్పానికి మరో బలమైన సందేశాన్ని పంపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించామన్నారు. అందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు.
భారతదేశ దృఢ సంకల్పం, ఉగ్రవాదం పట్ల అసహనం, ఉగ్రవాద దాడికి సైన్యం స్పందించింది. ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నారు. మే 7 ఉదయం, సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ ప్రారంభించి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. మే 6-7 తేదీల ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా మరణించారన్నారు.ఆపరేషన్ సిందూర్ దాడులతో పాకిస్తాన్ వణికిపోయిందని రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆ తర్వాత మన భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడిందని, దాని తర్వాత తగిన మూల్యం మాత్రం చెల్లించుకుందన్నారు.