రైతు సందేహాలను తీర్చే యాప్ ”ప్లాంటిక్స్‌ యాప్‌” …. 20 భాషల్లో అందుబాటులోకి

మనకు ఏదైనా సమస్య వస్తే గూగుల్‌లో శోధిస్తాం. లేదంటే… దానికి సంబంధించిన వీడియోస్‌ను యూట్యూబ్‌లో అన్వేషిస్తాం. కానీ రైతుకు ఇబ్బందులు వస్తే? క్రిమి కీటకాలను గుర్తించడం ఎలా? పంట సమస్యలకు పరిష్కారం ఎలా? ఉత్పాదకతను పెంచుకోవడం ఎలా? అసలు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడంలో రైతుకు ప్రతి నిత్యం ఎవరు ఉపయోగపడతారు? అంటే… వీటన్నింటికీ, వ్యవసాయ విజ్ఞానానికీ ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ యాప్‌ పేరు ప్లాంటిక్స్‌ యాప్‌. రైతులకు ఈ మొబైల్‌ యాప్‌ ఎంతో ఉపయోగకారి అని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలే ప్రకటించారు. దేశం మొత్తంలో సుమారు  3 కోట్ల మంది రైతులు దీనిని ఉపయోగిస్తున్నారు. దాదాపు 60 రకాల పంటలకు సంబంధించి 10 కోట్ల ఫోటోలను యాప్‌లోకి అప్‌లోడ్‌ కూడా అయ్యాయి.

అంతేకాకుండా సమస్యకు సమాధానం కూడా అన్ని ప్రాంతీయ భాషల్లో వచ్చే విధంగా కూడా ఇక్రిశాట్‌ దీనిని రూపొందిచింది. దాదాపు 20 ప్రాంతీయ భాషల్లోకి ఈ యాప్‌ వచ్చేసింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ యాప్‌ తయారు అయ్యింది. కానీ… ఈ మధ్య రైతులు ఈ యాప్‌ను బాగా వాడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపుగా రైతులందరూ మొబైల్స్‌ని వాడుతూనే వున్నారు కాబట్టి… ఈ ప్లాంటిక్స్‌ యాప్‌ వాడకం పెరిగింది.

‘‘సైన్స్‌, ఇన్నోవేషన్‌ మరియు టెక్నాలజీని రంగరించి చిన్న కమతాల రైతులకు మేలు చేసేందుకు, పరిష్కారమార్గాలను రూపొందించడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని మేం విశ్వసిస్తున్నాం. మేము చూపించిన సమాధాలను ఇప్పటి వరకు 30 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ అయ్యాయి. 10 కోట్ల ఫోటోలు అప్‌లోడ్‌ అయ్యాయి. చొరవ, సహకారం అందించే వారి ప్రయత్నాలు, రైతుల ప్రయత్నాలు.. ఇలా ఇవన్నీ కలిసొచ్చాయని ఈ యాప్‌ను చూస్తే అర్థమవుతోంది. సుస్థిర, స్థిరమైన వ్యవసాయానికి ఈ యాప్‌ స్ఫూర్తి కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో పేరున్న సంస్థలతో కూడా కలిసి పనిచేస్తాం అని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సిమోన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *