హిందుత్వపై ఐఐటీ బాంబే అవమానకర ప్రశ్న.. పెత్తందారీ, ఆధిపత్యం కోణాలతో ప్రశ్నాపత్రం
హిందూ వ్యతిరేకతను చాటేలా ఐఐటీ బాంబేలోని హుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (హెచ్ఎస్ఎస్) విభాగం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష వివాదాస్పదంగా మారింది. ఈ విభాగంలోని హిందూ వ్యతిరేక ప్రొఫెసర్లు మే 7, 2024వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రంలో హిందుత్వను అవమానిస్తూ హైందవానికి “పెత్తందారీ, ఆధిపత్య” తత్వాలను ఆపాదించారు. What does Antonio Gramsci mean by hegemony? Is Hindutva, hegemony or counter-hegemony? Discuss… అంటూ ఆ ప్రశ్నాత్రంలోని సెక్షన్ 2లో 4వ ప్రశ్నగా దీనిని ఇచ్చారు.
విద్యార్ధుల భావజాలాన్ని అంచనా వేసేలా రూపొందించిన ఈ ప్రశ్నతో ఈ పరీక్షా ప్రక్రియలోని నిష్పాక్షికత ప్రశ్నార్థకంలో పడింది. అంతే కాకుండా సదరు హిందూ వ్యతిరేక ప్రొఫెసర్ల ఆలోచనా సరళికి అనుగుణంగా జవాబు రాయని విద్యార్థులు ఎంపిక కాకుండా ఏరివేసేలా దీన్ని తయారు చేశారనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
ఇది ఇక్కడితో ఆగలేదు. కులము మరియు మతపరమైన హింసకు సంబంధించిన Comment on the similarities between caste violence and communal violence… అని ఇంకో ప్రశ్నను కూడా ఇదే ప్రశ్నాపత్రంలో చేర్చారు. ఈ ప్రశ్నతో ఈ పరిక్షా ప్రక్రియను వివాదాస్పదం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో సోషియాలజీ ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ అంశంపై లోతైన విచారణ చేయించి, సంబంధిత వ్యక్తులకు తగిన శిక్ష విధించాలని ఐఐటీ బాంబే యంత్రాంగానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి.
హెచ్ఎస్ఎస్ విద్యార్థులు ఈ ప్రశాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభాగంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాక ఇదే కోణంలో అతివాద భావజాలం కలిగిన ఉపన్యాసకులను పిలిపించి ప్రసంగాలు చేయిస్తూ విద్యాసంస్థలోని సుహృద్భావ వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామం ప్రతిష్ఠాత్మక ఐఐటీ-బాంబే విద్యాసంస్థ సమగ్రత, విద్యాసంస్థల నిర్వహణలో నిష్పాక్షికతపై వాడివేడి చర్చను రేకెత్తించింది. దీనిపై సంస్థ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో… మున్ముందు నిర్వహించే పరీక్షల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.