అస్సామీ సంప్రదాయ వంటకంలో అద్భుత బ్యాక్టీరియా
అస్సాం సంప్రదాయ వంటకం పానీ టెంగాలో మానవులతోపాటు పరిశ్రమలకు పనికొచ్చే అద్భుత బ్యాక్టీరియా ఉందని ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మ్యాంగోస్టీన్, చింతపండు, నిమ్మరసంలో ఆవ గింజలను పులియబెట్టి ఉప్పు, పచ్చి మిర్చి వేసి ఆ ముద్దను అరిటాకులో పెట్టి వెదురు బొంగుల్లో ఒకటీ రెండు వారాలు ఉంచితే పచ్చడి లాంటి పానీ టెంగా తయారవుతుంది. అస్సామీలు దీన్ని అన్నంతో కలిపి భుజిస్తారు. పానీ టెంగాలో బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఎస్‌ఎంపీ-2 అనే మంచి బ్యాక్టీరియా ఉందని సహాయ ప్రొఫెసర్ లలిత్ మోహన్ పాండే సారథ్యంలోని పరిశోధక బృందం తెలిపింది. ఈ బ్యాక్టీరియాకు బయో సర్ఫేక్టెంట్స్ అనే సేంద్రియ రసాయనాలను ఉత్పన్నం చేసే శక్తి ఉంది.
మామూలుగా ఒకదానితో ఒకటి కలవని నూనె, నీరు వంటి పదార్థాలను మేళవించడానికి బయో సర్ఫేక్టెంట్స్ తోడ్పడతాయి. ప్రస్తుతం జిడ్డును తొలగించడానికి తోడ్పడే రసాయనిక బయో సర్ఫేక్టెంట్స్‌ను సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లలో వాడుతున్నారు. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల పరిశోధనవల్ల సేంద్రియ బయో సర్ఫేక్టెంట్స్ అందుబాటులోకి రానున్నాయి. అవి సముద్రాల్లో, నేల మీద నూనె చారలను తొలగించడానికీ, భూగర్భం నుంచి చమురును తవ్వి తీయడానికీ, సౌందర్య ఉపకరణాల్లో వాడటానికీ, కొన్ని రకాల మందుల తయారీకీ ఉపకరిస్తాయి. రసాయన సర్ఫేక్టెంట్స్ మాదిరిగా బయో సర్ఫేక్టెంట్స్ పర్యావరణానికి హాని చేయవు. సులువుగా విచ్ఛిన్నమైపోతాయి.