సేవాబస్తీల్లో ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థుల దీపావళి వెలుగులు
దీపావళి, అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. అదొక బంధాలను బలోపేతం చేసే వేదిక, ఆనందాన్ని పంచే శుభ సందర్భం. ప్రతి ఇంట వెలుగులు నింపే ఈ పండుగ, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాంతులను తీసుకురావాలన్న గొప్ప ఆశయాన్ని, సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. ఈ స్ఫూర్తినే నిజం చేస్తూ, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటి వరంగల్ మరియు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు తమ సేవా మనోభావంతో ‘అనుభూతి’ కార్యక్రమాలు నిర్వహించి, సేవా బస్తీల్లో దీపావళి వెలుగులు నింపారు. ఈ కృషి కేవలం పండుగ జరుపుకోవడం కాదు, మానవ సంబంధాల గొప్పదనాన్ని చాటింది.
అనుభూతి: విద్యార్థుల హృదయావిష్కరణ
NIT వరంగల్ లో చదువుతున్న స్వయంసేవకులు దగ్గరలోని సేవా బస్తీలో నిర్వహించిన ‘అనుభూతి మరియు దీపావళి’ కార్యక్రమం, కేవలం ఒక కార్యక్రమం కాదు, అదొక హృదయావిష్కరణ. సుమారు 40 మంది విద్యార్థులు 50 మంది బస్తీ పిల్లలతో కలిసి వేడుకలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలోనే విద్యార్థులు, ఆ పిల్లల దైనందిన జీవితం, వారి చదువు, భవిష్యత్తు కలల గురించి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ మాటల్లో స్నేహం, సానుభూతి తొణికిసలాడింది.

ఆటలు, పాటలతో ఆనందాన్ని పంచుకున్న విద్యార్థులు, పిల్లలకు విద్యా సామగ్రి, పుస్తకాలు, చిన్న చిన్న బహుమతులు అందజేశారు. వారిలో కొందరు ప్రేరణాత్మక కథలు చెబుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరంగా వివరించారు. చివరగా, సామూహికంగా దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకున్న క్షణం, ఆ బస్తీలో ఐక్యత, ఆనందం అనే సరికొత్త వెలుగులను ప్రసరింపజేసింది.
ఐక్యత పంచుతూ: ఐఐటీ హైదరాబాద్ కృషి
అదే స్ఫూర్తితో, ఐఐటీ హైదరాబాద్ వివేకానంద మిలన్ స్వయంసేవకులు సంగారెడ్డి జిల్లాలోని కంది అంబేద్కర్ బస్తీని సందర్శించారు. సుమారు 25 మంది స్వయంసేవకులు 40 మంది పిల్లలతో కలసి దీపావళిని జరుపుకున్నారు. వారు మొదటగా ‘సేవా భావం’ (నిస్వార్థ సేవ) యొక్క స్ఫూర్తిని మరియు సామాజిక బంధాలను బలోపేతం చేయడంలో పండుగల ప్రాముఖ్యతను పరిచయం చేశారు. ఆనందం మరియు సద్భావనకు ప్రతీకగా, స్వయంసేవకులు పిల్లలకు మిఠాయిలు, ప్రమిదలు మరియు బాణసంచాను పంపిణీ చేశారు.

నిజమైన సేవా భావన: ప్రతిఫలం లేని త్యాగం
నిజానికి, ఈ స్వయంసేవకుల కృషినే సేవా భావన యొక్క అత్యున్నత నిర్వచనంగా చెప్పవచ్చు. వారి ‘సేవ’ కేవలం సామాజిక బాధ్యతగా కాకుండా, ప్రతిఫలాన్ని ఆశించని త్యాగంగా మారింది. ఈ యువ స్వయంసేవకులు , తాము చదువుతున్న ఉన్నత విద్య, ఉన్నత స్థాయి హోదా కేవలం వ్యక్తిగత విజయాల కోసం కాదని, ఆ జ్ఞానాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించాలని బలంగా నమ్మారు. బస్తీ పిల్లల తో కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా, ఈ విద్యార్థులు కేవలం మిఠాయిలు లేదా పుస్తకాలనే పంచలేదు; వారు తమ సమయాన్ని, ఆప్యాయతను, మరియు వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పంచారు. ఈ నిస్వార్థ సేవ, ఇతరుల ముకాలలో చిరునవ్వు చూడటమే తమకు లభించే గొప్ప ఆత్మ సంతృప్తిగా వారు భావించారు. ఈ భావనే… ఈ తరం యువతకు ఆదర్శనీయమైన, అత్యంత విలువైన మానవీయ కోణం. ఈ నిబద్ధతే వారి సేవా దృక్పథాన్ని గొప్పగా నిలబెడుతుంది.

సేవే నిజమైన పండుగ
ఈ రెండు సంఘటనలు ఒకే సత్యాన్ని స్పష్టం చేస్తాయి: ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉంది. దేశానికి కాబోయే మేధావులు, ఉన్నత విద్యావంతులు తమ బిజీ షెడ్యూల్‌లో సమయం కేటాయించి, అట్టడుగు వర్గాల ప్రజల మధ్యకు వెళ్లి వారి దీపావళిని సంతోషమయం చేసారు . ఈ ప్రయత్నం స్వయంసేవకుల్లో సమాజం లో సామాజిక స్పృహను, ఆత్మీయ అనుభూతి ని పెంపొందించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నం. సేవ, ఆత్మీయత మరియు సమాజం పట్ల అంకితభావం అనే ఈ మూడు విలువలు ఈ ‘అనుభూతి’ కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయ్యాయి. ఈ సేవా సుగంధం, దీపావళి పండుగ వెలుగుల మాదిరిగా సమాజంలో నిరంతరం ప్రకటించాలి.