‘‘సేవా యై యజ్ఞ కుండ్…’’ ఏమీ ఆశించకుండా జాతికి సేవ చేస్తున్న స్వయంసేవకులు
వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, సహకారం అనేవి సమాజ అభివృద్ధికి మూలం. ఈ క్రమంలో ఉత్తమ సంస్కారాలతో కూడిన వ్యక్తి నిర్మాణం అనేది అత్యంత ముఖ్యం. అందుకే వ్యక్తి నిర్మాణంతో సమాజ కళ్యాణం అన్న మహోన్నత లక్ష్యంతో డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ని స్థాపించారు. ఈ మహోన్నత ఆశయాన్ని కుల, మత, ప్రాంత, జాతి భేదాలకు అతీతంగా స్వయంసేవకులు ఆచరణలో చూపి ఆదర్శవంతులయ్యారు. ఆర్ఎస్ఎస్ చూపిన ఈ సేవాదీప్తిని స్ఫూర్తిగా తీసుకుని సంఘ్ ప్రేరణతో సేవాభారతి వంటి సంస్థలు ఏర్పడి సేవాజ్యోతులను వెలిగిస్తున్నాయి. హిందూ ధర్మంలోని ‘సేవా పరమోధర్మ’ అన్న వేదోక్తి ఆధారంగా గత వందేళ్ళుగా ఎన్నో జీవితాలలో కాంతులు నింపుతూ వస్తున్నారు సంఘ స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో స్వయంసేవకులు వ్యక్తిగత స్థాయిలో భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ప్రాణాలొడ్డి పోరాడటమేగాక ఎందరో సమరయోధులకు సైతం అండగా నిలిచి వారి ప్రాణాలకు ముప్పు ఉన్న సమయంలో ఆశ్రయమిచ్చి ఆదుకున్నారు. దేశ విభజన సమయంలో అసంఖ్యాకులైన హిందువులపై దాడులు జరిగినప్పుడు స్త్రీ, బాల, వృద్ధులకు స్వయంసేవకులు తోడై నిలిచారు. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి సర్కారు స్వయంసేవకులను నానా బాధలకు గురిచేసినప్పటికీ దేశం కోసం తట్టుకుని నిలిచారే తప్ప పగ, ప్రతికారాల వంటి మాటల ఊసే లేదు. ఆర్ఎస్ఎస్ ఎదగకుండా నాటి ప్రభుత్వాలి నిషేధాలు పెట్టి వేధించినా.. ఎంత ప్రతిఘటన ఎదురైనా దేశం పట్ల ఆర్ఎస్ఎస్ నిబద్ధత అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధాలప్పుడు, దేశంలో ఎక్కడెక్కడ భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ఘోర ప్రమాదాలు, కరోనా వంటి భయానక వ్యాధులు విలయతాండవం చేసినప్పుడు స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి మరీ బాధితులకు సహాయసహకారాలందించారు.

స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు పలు దశాబ్దాలుగా జాతికి చేస్తూ వస్తున్న సేవలు అసంఖ్యాకం… ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంలో వీరి ద్వారా జరిగిన సేవలను ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. 2025వ సంవత్సరం గురించి ప్రత్యేకంగా ఎందుకంటే, ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మహాకుంభమేళా ధార్మిక వేడుక ఆధ్యాత్మికతకు, మానవతల సమ్మేళనంగా జరిగింది. దేశవిదేశాల నుంచి కోటానుకోట్ల మంది ఇందులో భాగమయ్యారు. అంతే కాకుండా పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పెను వైపరీత్యాలు సంభవించడంతో సంఘ్, సేవాభారతి నడుంబిగించి రేయింబవళ్ళు విశేష సేవలందించాయి. అందువల్ల ఈ ఒక్క ఏడాదిలో ఈ రెండు సంస్థలు చేసిన సేవలను స్మరించుకుంటే, గత శతాబ్దకాలంగా కొనసాగుతూ వస్తున్న అంకితభావం, నిబద్ధత, చిత్తశుద్ధి ఏమిటన్నవి స్మృతిపథంలో మెదులుతాయి.

విపత్తు నిర్వహణా సంబంధమైన సేవల్లోకి వెళ్ళేముందు, కోటానుకోట్లమంది భాగస్వాములై చిరస్మరణీయంగా నిలిచిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో సంఘ్, సేవాభారతి సంస్థల సేవలను గుర్తు చేసుకోవడం సముచితం. మహాకుంభమేళా విజయవంతం కావడం కోసం ఈ సంస్థలు చేపట్టిన ప్రధాన కార్యకలాపాలు ఇవి..
అన్నక్షేత్రాలు: 24 గంటలూ యాత్రీకులకు భోజన వసతి
చికిత్సా కేంద్రాలు: వైద్య శిబిరాలు, అత్యవసర ఆరోగ్య పరిరక్షణ సేవలు
ఆశ్రయం: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న యాత్రీకుల బస కోసం శిబిరాల నిర్వహణ
ఇవి మాత్రమే కాకుండా 27 రకాల సేవా కార్యకలాపాలను మహాకుంభమేళా కోసం సంఘ స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు చేపట్టారు. ఏ ఒక్కరి నుంచీ ఏమీ ఆశించకుండా దేశంకోసం, ధర్మం కోసం జాతీయవాద దృష్టికోణంతో సేవలందించారు. మరీ ముఖ్యంగా కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా చేయడం కోసం ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ (వస్త్ర సంచీ, స్టీల్ పళ్ళెం) అన్న ఉద్యమానికి ఆరెస్సెస్ పిలుపునిచ్చింది. కొన్ని లక్షలాది హిందూ కుటుంబాలు ఈ ఉద్యమంలో పాల్గొని కుంభమేళా యాత్రీకుల వినియోగం కోసం స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను ఇచ్చారు. మహాకుంభమేళా కోసం సంఘ్ నుంచి 16 వేలమంది స్వయంసేవకులు ముందుకువచ్చారు.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం… అంటే దేహంలోని ఆవయవాలన్నిటిలోను కన్ను ఎంతో ముఖ్యం అని పెద్దలు చెప్పిన హితోక్తిని అనుసరించి సంఘ్ ప్రేరిత సంస్థ సక్షమ్ నిర్వహణలో ‘నేత్ర కుంభ్’ పేరిట నేత్ర వైద్యశిబిరాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేశారు. మొబైల్ మెడికల్ యూనిట్లు, మెడికల్ కిట్స్, ప్రాణాధార ఔషధాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రద్దీ నియంత్రణ ఒక్కటేమిటి సంఘ్, సేవాభారతి ఇక్కడ అందించని సేవ లేదు. సాధారణ వైద్యం సహా శస్త్రచికిత్సల వరకూ ఉచితంగా ఇక్కడ అందించిన వైద్య సేవలను లక్షలాదిమంది ప్రజలు అందిపుచ్చుకున్నారు.

ఇక ప్రకృతి విపత్తులు, ఘోరప్రమాదాల సందర్భాలలో అందించిన సేవలను గమనిస్తే..
ఏప్రిల్ 21, 2025న జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడినప్పుడు సంఘ్, సేవాభారతి సంస్థలు బాధితులకు అండగా నిలిచాయి. ఆహారం, మంచినీరు, ఔషధాలు, తాత్కాలిక పునరావాసం, బాధితులకు మానసిక తోడ్పాటు.. ఇలా ఎన్నో విధాలుగా సేవలు అందించడం జరిగింది.
జూన్ 12, 2025న అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమానం కూలినప్పుడు బాధితులకు వైద్య సహాయం అందించడం, అంబులెన్స్‌లు సమకూర్చడం, DNA నమూనాలు సేకరణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, 2000 మందికి పైగా బాధితులకు ఆహారం సమకూర్చడం వంటి పలు విధాల సేవలను స్వయంసేవకులు అందించారు.

జులై నెలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి వద్ద భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఇక్కడ కూడా బాధిత కుటుంబాలకు సంఘ్, సేవాభారతి సంస్థలు అండగా నిలిచాయి. ఆహారం, వస్త్రాలు, నిత్యావసరాలతో పునరావాస ఏర్పాట్లు చేసి ఆదుకున్నాయి. ఇదే నెలలో మధ్యప్రదేశ్‌లో గుణ వద్ద భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కాగా రోజుకు 10 గంటలకు తగ్గకుండా సంఘ్, సేవాభారతి సంస్థలు పునరావాస కార్యకలాపాలను చేపట్టాయి. ఆస్పత్రి ఆవరణలోనే సామూహిక వంటశాలలను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక సేవలందించారు.
జులై 31, 2025న రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ పరిసరాలలో చంబల్ నది వరదల్లో రోడ్లు తెగిపోయి జనం అల్లాడిపోతున్న వేళ స్వయంసేవకులు చురుకుగా కదిలి పైన తెలిపిన సందర్భాలలో చేసినట్టుగానే విశేష సేవలందించారు. గ్రామాలలోని ప్రజలు తమ పశువులను భద్రంగా తరలించేందుకు సైతం సహకరించారు.
ఆగస్టు నెల మొత్తంలో రాజస్థాన్‌లోని సిక్రోడీ, ఆరాయా ప్రాంతాల్లోను, ఉత్తరకాశీ – ధరాలీ, ప్రయాగ్‌రాజ్, కాశ్మీర్‌లోని కిస్త్వార్, యూపీలోని కయింగంజ్, ఉత్తరాంచల్‌లోని చమోలీ, ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, మహారాష్ట్రలోని బీడ్ – లాతూర్ – నాందేడ్ జిల్లాలు, పంజాబ్‌లోని మరెన్నో గ్రామాలను జలప్రళయం ముంచెత్తగా వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యకలాపాలు, పునరావాసం, వైద్య శిబిరాల నిర్వహణ వంటి ఎన్నో సవాళ్ళతో కూడిన సేవా కార్యక్రమాలను స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి చేపట్టారు.

సెప్టెంబర్ నెలలోనూ ఇవే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఢిల్లీలో యమునా నది పొంగి ఖాదర్ వంటి లోతట్టు ప్రాంతాలు, మయూర్ విహార్ జిల్లా ముంపునకు గురైనప్పుడు, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా – కిన్నౌర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తినప్పుడు, డెహ్రాడూన్ వద్ద రిస్పానా నది పొంగిపొరలినప్పుడు, మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ ప్రాంతం భారీ వరదలకు గురయినప్పుడు తిరుగులేని సేవాభావం, అంకితభావాలతో సంఘ్, సేవాభారతి, భారత వికాస్ పరిషత్, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేతులు కలిపి బాధితులకు తోడై నిలిచాయి.
అక్టోబర్ నెలలో ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్‌గురి ప్రాంతాలు నీట మునిగాయి, అదే సమయంలో తెలంగాణలోని వరంగల్ ప్రాంతం సైతం జల విలయం బారిన పడింది. ఈ సమయంలోనూ బాధితులను స్వంత కుటుంబంలా భావించి స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు ఆదుకుని అండగా నిలిచారు.

సాధారణంగా సంఘ్ పై వ్యతిరేకులు చేసే దుష్ప్రచారం కారణంగా ఆ ప్రభావం అన్యమతస్తులపైనా ఉండటం సహజం. అయితే, పైన తెలిపిన విపత్తు సందర్భాలలో సంఘ్, సేవాభారతి సంస్థలు ఏ విధమైన భేదభావం లేకుండా అన్యమతస్తులకు సైతం సహాయసహకారాలు అందించడంతో స్వయంసేవకులను వారు మనసారా కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముస్లిం – క్రైస్తవ మతపెద్దలు సంఘ్ సేవలను కొనియాడిన వీడియోలు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యాయి.
పైన తెలిపిన కొన్ని మాత్రమే కాదు.. ఇంకా చిన్నా, పెద్దా ఎన్నో సేవా కార్యక్రమాలలో సంఘ్, సేవాభారతి కార్యకర్తలు పాల్గొని భారతమాతను అర్చించారు, సేవా యాగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.