చదివింది ఎనిమిదో తరగతే… కానీ.. 35 రాతి డ్యాములు కట్టింది… అడవికి ప్రాణం పోసింది
మావోయిస్టులను ఎదిరించి, వారి బెదిరింపులను లెక్క చేయకుండా జార్ఖండ్ లోని ఓ మహిళ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోంది. ఎండా కాలంలో అడవులు ఎండిపోవడం, అడవులు విస్తీర్ణం తగ్గడం, పక్షులు, జంతువుల సంఖ్య విపరీతంగా తగ్గడంతో పాటు కాలువలు, డ్యాములు కూడా ఎండిపోతున్నాయి. దీంతో అడవీ జంతువులకు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో మేరీ సురీన్ అనే గిరిజన మహిళ దీనికి పరిష్కారం కనుక్కోవాలని ముందుకు వచ్చింది. ప్రకృతిని, అడవీ జంతువులను, స్థానికులను కాపాడాలని నడుం కట్టింది. దీంతో అటవీ ప్రాంతంలో (పలము టైగర్ రిజర్వ్) వున్న దాహార్తిని తీర్చడానికి ఏకంగా రాతితో వున్న 35 కట్టలను నిర్మిస్తోంది. ఆమె చదివింది ఎనిమిదో తరగతే. ఇంజినీర్ అంతకంటే కాదు. అంతేకాకుండా ప్రభుత్వ నిధులు గానీ, సహాయాలు కూడా లేవు. కానీ.. ప్రకృతిని రక్షించాలని, జంతువులను కాపాడాలన్న తపనతో 35 రాతి ఆనకట్టలను నిర్మించింది. దీంతో వన్య ప్రాణులకు, గ్రామస్థులకు ఉపశమనం కలిగినట్లయ్యింది. వీటిని స్థానికంగా అక్కడ ‘‘పత్థర్ ఆనకట్టలు’’ అని పిలుస్తుంటారు.
దీనిపై మేరీ సురీన్ స్పందించారు. ‘‘కీర్తి ప్రతిష్ఠల కోసమో, ప్రతిఫలం కోసం ఏమీ చేయలేదు. అడవి కోసమే చేశా. అడవి మనకు జీవితాన్నిస్తుంది. అంత ఇస్తున్న సమయంలో మనం ద్రోహం చేస్తామా? జంతువులు నీటి కోసం నిరాశగా తిరగడం చూశా. అలాగే నీటి కోసం బక్కెట్లతో ప్రజలు దూరంగా నడవడం చూశా. అందుకే ఏదో చేయాలని తలపోశా. అప్పుడే ఓ ప్రశ్న తలెత్తింది. డబ్బులు, యంత్రాలు లేకుండా అడవిలో నీటిని నిల్వ చేయడం ఎలా? అని ఆలోచించి, ఆనకట్టల ఆలోచన వచ్చింది. పని చేస్తుండటంతో నా చేతులు కూడా దెబ్బతిన్నాయి. కానీ దృఢ సంకల్పం, కరుణతోనే ముందుకు సాగుతున్నా’’ అని పేర్కొంది.

వర్షాలు బాగా కురిసినా… ఎక్కువ భాగం ప్రవహించి, కొండల్లోకి వెళ్లిపోవడం, మట్టిని మోసుకోయి.. దూరంలో వున్న కోయెల్ నదిలో కలవడం చూసింది. వర్షాలు ఆగిపోయిన తర్వాత నేల పొడిపొడిగా అవ్వడం కూడా చూసింది. ఇదంతా చూసింది. అయితే2023 వరకు మేరీ చాలా మంది గ్రామీణ మహిళ, ఓ గృహస్థుగానే వుంది. ఇంట్లో వుండటం, కుటుంబాన్ని పోషించడం, వ్యవసాయం చేయడం, పిల్లలను పెంచడం చేసేది. అంతేకాదు.. తన గ్రామాన్ని విడిచి ఎన్నడూ బయటికి కూడా వెళ్లలేదు. అయితే.. నీటి సంక్షోభం రావడం, చెట్లు నశించిపోవడం, నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడటం చూసింది.
2024 లో ఓరోజు గ్రామపెద్దలను సమావేశపరించింది. జరుగుతున్న విషయాలన్నింటినీ వివరించింది. తన ప్రణాళిక మొత్తాన్నీ వారికి వివరించింది. రాతితో ఆనకట్టలను నిర్మించాలని, వీటి ద్వారా నీటిని ఆపే ప్రక్రియ, కోతను ఎలా తగ్గిస్తాయి? వేసవిలోనూ నీరు ఎలా దొరుకుతాయి? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించింది. గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్థులు అందరూ దీనిని ముక్తకంఠంతో ఆమోదించారు. పాలము టైగర్ రిజర్వ్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్థులు కూడా రాళ్లు, చిన్న చిన్న పరికరాలతో ముందుకు వచ్చారు. తాము ప్రభుత్వ సహాయం కోసం చూడమని, తమని తాము పనులు చేస్తామని, మేరీ సురీమ్ నాయకత్వంలో పనులు మొదలుపెట్టారు.

ఒక్క నెలలోనే 7 డ్యాములను నిర్మించారు. ప్రతి ఆనకట్ట కట్టడానికి 5 గంటల సమయం పట్టిందని మేరీ సురీమ్ తెలిపారు. ఇలా చేసుకుంటూ ముందుకు సాగామని, ప్రస్తుతం బధానియా చుట్టూ వున్న అటవీ ప్రాంతంలో 35 రాతి చెక్ డ్యామ్ లను నిర్మించామని ప్రకటించారు. కేవలం ప్రకృతి రమణీయ దృశ్యంగానే కాకుండా చాలా మంది జీవితాలను కూడా ఈ డ్యాములు మార్చేశాయని తెలిపారు.
ఒకప్పుడు ఎండిపోయిన వాగులు, దాహంతో తిరిగి వన్యప్రాణుల పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మేరీ సారథ్యంలో నిర్మించిన ఆనకట్టల ద్వారా నీటి ప్రవాహం కనిపిస్తోంది. వన్యప్రాణులు తిరిగి ఆ ఆటవీ ప్రాంతంలోకి వచ్చాయి. దాహార్తిని తీర్చుకుంటున్నాయి. పక్షులు కూడా వచ్చి, తన దాహార్తిని తీర్చుకుంటున్నాయి. దీంతో అడవి వాతావరణం అత్యద్భుతంగా తయారైందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో లోకకల్యాణం పని కూడా మేరీ చేసింది. వేసవిలో అడవిలోని చెట్లు తగటబడటం కూడా తనను కలిచివేసింది. దీంతో జంతువులు తీవ్రంగా నష్టపోతాయని, మరణించే అవకాశాలున్నాయని కూడా తెలుసుకుంది. నీటిని సంరక్షించడం ద్వారా దాని ద్వారా వచ్చే తడి, మంటలను అదుపు చేయడంలో సహాయపడుతుందని గ్రహించింది.చుట్టు పక్కల వున్న గ్రామాలన్నింటిలోనూ పర్యటించింది. వ్యర్థాలను అడవుల దగ్గర కాల్చవద్దని పిలుపునిచ్చింది. అంతేకాకుండా పొగలు, మంటలు వ్యాప్తి చెందితే వెంటనే తమకు తెలియజేయాలని కూడా సూచించింది. దీంతో ఈ సందేశం గ్రామాలకూ వ్యాపించింది. కేవల గృహిణిగానే కాకుండా పర్యావరణ సంరక్షకురాలిగా మారింది.
మేరీ చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. 2024 లో జార్ఖండ్ ప్రభుత్వం ఆమెను ప్రశంసిస్తూ, సత్కరించింది కూడా. అటవీ అధికారులు ఇప్పుడు నిత్యం ఆమెను సంప్రదిస్తూనే, సలహాలు తీసుకుంటూనే వుంటారు. మేరీని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.