30 గ్రామాల దాహార్తి తీర్చిన ”రావిచెట్టు ఊటబావి” చరిత్ర ఇదీ.. ఇప్పటికీ అదే రుచి
చాలా గ్రామాలకు ఇప్పటికీ బావే ప్రధాన నీటి వనరు. ఇప్పుడంటే బోర్లు, వగైరాలు వచ్చాయి కానీ.. ఒకప్పుడు బావే ఆ గ్రామానికి ప్రధాన కేంద్రం. బావుల నుంచే నీరు తాగేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ బోర్లు అయ్యాయి. లేదా… మున్సిపల్ సిబ్బంది నళ్లాలను బిగించి ఇచ్చేస్తున్నారు. వీటి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. అయితే.. ఇప్పటికీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఇప్పటికీ ఓ ఊట బావి వుంది. అక్కడి ప్రజలు దీనిని ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. దీని వెనుక పెద్ద చరిత్రే వుంది. ఏమంటే..
రామగుండంలోని బీ పవర్ హౌజ్ చౌరస్తాలోని ఓ చాయ్ హోటల్‌లో ఊట బావి వుంది. సుమారు 50 సంవత్సరాల క్రితం రామగుండం చుట్టుపక్కల దాదాపు 30 గ్రామాలు తమ తాగు నీటి కోసం ఈ బావిపైనే ఆధారపడేవారు. ఇతర అవసరాలకు కూడా ఈ నీటినే వినియోగించేవారు. ఇప్పటికీ చాలా మందికి ఇది ఉపయోగపడుతోంది. ఆ దారి వెంట వచ్చి వెళ్లే వారు ఇందులోని నీటినే తాగుతారు.
50 సంవత్సరాల క్రితం సమీప గ్రామాల ప్రజలు ఈ ఊట బావి దగ్గరికే వచ్చి నీటిని తీసుకెళ్లేవారు. ఒకానొక సమయంలో మట్టితో పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రజలు తీవ్రంగా నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. దీంతో అక్కడే వుండే హనుమయ్య అనే వ్యక్తి తన సొంత డబ్బులతో బావి నిర్మాణాన్ని చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. 50 సంవత్సరాల క్రితం ఈ బావి దగ్గర ఓ పెద్ద రావి చెట్టు కూడా వుండేది. అందుకే ”రావిచెట్టు ఊట బావి” అని కూడా పిలిచేవారు.
అయితే 50 సంవత్సరాల క్రితం 30 గ్రామాలకు ఉపయోగపడ్డ ఈ బావి… ఈ మధ్య సరిగ్గా వుండటం లేదు. అయితే.. దీని పక్కనే వున్న ఓ హోటల్ యజమాని ప్రతి రోజూ దీనిని శుభ్రం చేసవ్తడు. తాగడానికి ఉపయోగపడేలా వుంచుతాడు. ఈ ఎండా కాలంలో రామగుండం, పెద్దపల్లి చుట్టు పక్కల బావులన్నీ ఎండిపోయాయి. కానీ.. ఈ రావిచెట్టు ఊటబావి మాత్రం మొత్తం నీటితో నిండిపోయి వుంది. 50 సంవత్సరాల క్రితం వున్న నీటి రుచే ఇప్పటికీ వుందని అక్కడి వారు చెబుతుంటారు. ఫిల్టర్ వాటర్ కంటే బాగుంటాయని, దీనిని ఎప్పటికీ కాపాడుకుంటామని, ఈ బావే ఓ చరిత్ర అని సవ్థనికులు అంటున్నారు.