ఆ ఊళ్ళో ఎద్దులకు ప్రతి సోమవారం సెలవు… గుడికి కూడా తీసుకెళతారు
ఆ ఊళ్లో ప్రతి సోమవారం ఎద్దులకు సెలవు దినం. ఆ రోజు మాత్రం ఎద్దులకు ఎలాంటి పని చెప్పరు. ఎంత వ్యవసాయ పని వున్నా సరే… ఆ రోజు అవి ఇంట్లోనే వుంటాయి. ఈ ఆనవాయితీ కర్నూలు జిల్లాలోని బల్గోటా గ్రామం. ఈ గ్రామంలో అనాదిగా ఈ ఆనవాయితీ వస్తోంది. ఎంత కుండపోత వర్షాలు కురిసినా… రైతుకి ఎంత లాభం వచ్చే పని ఆ రోజు వున్నా… ఎద్దులకి మాత్రం పని చెప్పరు. వాటిని పొలాల్లోకి తీసుకెళ్లరు. అంతే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన వాగులో ఆ ఎద్దులకి స్నానం పోస్తారు. శుభ్రం చేస్తారు. దాని తర్వాత ఆ గ్రామంలో బల్గోటేశ్వర స్వామి (శివుడు) ఆరాధ్య దైవం. స్నానం పోసిన తర్వాత ఆ ఎద్దులను గుడికి తీసుకొచ్చి, దేవాలయం చుట్టూ తిప్పుతారు.
ఈ పని ప్రతి సోమవారం కచ్చితంగా జరుగుతుంది. తమ గ్రామంలో ఈ ఆనవాయితీ అనాదిగా వస్తోందని, ఇప్పటికే దీనిని పాటిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. అలాగు విత్తనాలు విత్తడం కూడా ఆరోజు చేయరు. గ్రామస్థులందరూ కచ్చితంగా ఆ దేవాల?యం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అందరూ కలిసి భజన చేస్తారు. ఎద్దులే తమ వ్యవసాయానికి ప్రధాన వనరులని, అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని రైతులు తెలిపారు. ఎద్దులకు స్నానం చేయించి, చాలా సేపు బల్గోటేశ్వర ఆలయం దగ్గరే వుంచుతామని, ఆ తర్వాతే ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు.
మరో వైపు ఈ సంప్రదాయం తెలంగాణ ప్రాంతంలోనూ వుంది. అయితే ప్రతి సోమవారం మాత్రం కాదు. పొలాల అమావాస్య రోజున ఈ ఆనవాయితీ కనిపిస్తుంది. పొలాల అమావాస్య రోజున తెలంగాణలో ఎద్దులకు సెలవు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ఎద్దులకు స్నానం చేయించి, కొత్త వస్త్రాలు, రంగు రంగుల వస్త్రాలు ధరింపజేస్తారు. సాయంత్రం కాగానే… ఆ ఎడ్లను ఆ గ్రామంలోని పోచమ్మ దేవాలయం చుట్టూ గానీ, లేదంటే ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ గానీ తిప్పుతారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి ప్రసాదం తినిపిస్తారు. దీంతో ఆ పండగ ముగుస్తుంది. ఆ రోజు ఎద్దులకు సెలవు దినం.