భారత్‌ ‌వాక్సిన్‌లను గుర్తించిన యూరప్‌ ‌దేశాలు

స్వీయ గౌరవం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తినైనా, దేశాన్నైనా ఎదుటి వ్యక్తి లేదా దేశం గౌరవిస్తారు, మన్నిస్తారు. వాక్సిన్‌ల విషయంలో భారత్‌ ఈ ‌విషయాన్నే ఋజువుచేసింది. యూరప్‌ ‌దేశాల గౌరవాన్ని, అంగీకారాన్ని సంపాదించింది. భారత్‌ ‌స్వయంగా తయారుచేసిన కోవిషీల్డ్, ‌కోవాక్సిన్‌లను గుర్తిస్తున్నట్లు ఎనిమిది యూరోప్‌ ‌దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. మరిన్ని దేశాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఆస్ట్రియ, జర్మనీ, స్లోవియా, గ్రీస్‌, ఐస్‌ ‌లాండ్‌, ఐర్లాండ్‌, ‌స్పెయిన్‌, ‌స్విట్జర్లాండ్‌ ‌వంటి దేశాలు భారత్‌ ‌వాక్సిన్‌లకు తమ ‘గ్రీన్‌ ‌పాస్‌’ ‌క్రింద గుర్తింపును ఇచ్చాయి. ఈ గుర్తింపు లభించిన వాక్సిన్‌లు వేసుకున్న వారికి ఈ దేశాలలో ప్రవేశించే అనుమతి ఉంటుంది.  జులై నెల నుంచి ఈ గ్రీన్‌ ‌పాస్‌ ‌నిబంధన అమలులోకి వస్తుంది.

కోవిడ్‌ ‌వ్యాప్తిని అరికట్టడం కోసం వివిధ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌కు చెందిన దేశాలు గ్రీన్‌ ‌పాస్‌ ‌విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ప్రపంచంలో వివిధ దేశాల్లో తయారైన వాక్సిన్‌లకు గుర్తింపు మంజూరుచేసి, ఆ వాక్సిన్‌లు వేసుకున్న వారికి మాత్రమే తమ భూభాగంలోకి అనుమతిని స్తున్నాయి. ఈ విధానం జులై నుంచి అమలు చేశాయి. భారత్‌లో తయారైన కోవిషీల్డ్, ‌కోవాక్సిన్‌లకు గ్రీన్‌ ‌పాస్‌ ‌గుర్తింపునివ్వడానికి మొదట యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌వెనుకాడింది. అమెరికతోపాటు మరో మూడు దేశాల వాక్సిన్‌ ‌లను గుర్తించిన యూనియన్‌ ‌వివిధ కారణాలు చూపి భారత్‌ ‌వాక్సిన్‌లను అంగీకరించలేదు. దీనితో రంగంలోకి దిగిన విదేశాంగ మంత్రి జయశంకర్‌ ‌యూరోపియన్‌ ‌యూనియన్‌ అధికారులతో మంతనాలు జరిపారు. భారత ప్రభుత్వం కోవిషీల్డ్, ‌కోవాక్సిన్‌ ‌వేసుకున్నవారికి ఇచ్చే కోవిన్‌ ‌సర్టిఫికేట్‌ను గుర్తిస్తే తాము యూరోపియన్‌ ‌యూనియన్‌ ఇచ్చే డిజిటల్‌ ‌కోవిడ్‌ ‌సర్టిఫికేట్‌ను అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే విధానం అవలంబించాలని గుర్తుచేశారు. పైగా యూరప్‌ ‌దేశాల గ్రీన్‌ ‌పాస్‌ ‌గుర్తింపు పొందిన నాలుగు వాక్సిన్‌లలో ఒకటైన వాక్స్ ‌జెవ్రియ (ఆక్స్ ‌ఫర్డ్ -ఆ‌స్ట్రాజెనికా) పూర్తిగా కోవిషీల్డ్ ‌వంటిదేనని గుర్తుచేశారు. దీనితో ఆలోచనలో పడ్డ యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఎనిమిది దేశాలు వెంటనే భారత్‌ ‌వాక్సిన్‌లకు గ్రీన్‌ ‌పాస్‌ ఇస్తూ ప్రకటన చేశాయి.

ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన కోవాక్సిన్‌ ‌కోవిడ్‌ ‌వైరస్‌లో రెండు రకాలైన ఆల్ఫా, డెల్టాల నివారణకు అద్భుతంగా పనిచేస్తుందని అమెరికా ప్రాధమిక ఆరోగ్య పరిశోధన సంస్థ ప్రకటించింది. ఆల్ఫా (బి.1.1.7), డెల్టా (బి.1.617) రకం సార్స్ ‌వైరస్‌లను కోవాక్సిన్‌ ‌పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని అమెరికా ప్రభుత్వ సంస్థ వెల్లడించింది. ఈ రెండింటిలో డెల్టా రకం వైరస్‌ ‌భారత్‌తో కల్లోలం సృష్టించిన రెండవ దశ కోవిడ్‌ ‌వ్యాప్తికి కారణం. దీనికే భారత్‌ ‌రకం వైరస్‌ అం‌టూ పేరు పెట్టి ప్రచారం చేయడానికి, కరోన వైరస్‌ ‌చైనా నుంచి వచ్చిందనే విషయాన్ని మరుగున పరచడానికి కొందరు బాగా ప్రయత్నించారు. కానీ ఈ డెల్టా వైరస్‌ ‌డెన్మార్క్ ‌దేశం, అమెరికాలోని కాలిఫోర్నియాల నుంచి వ్యాపించిందని తేలడంతో ఆ దుష్ప్రచారాన్ని మానుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *